వెంట పడి పెళ్లి చేసుకుంటానని.. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి

 Girl Protect Her Lover Home In West Godavari District - Sakshi

భీమవరం అర్బన్‌: ప్రేమ పేరుతో మోసగించిన యువకుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన ఉదంతం మండలంలోని వెంప గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు గుత్తుల లావణ్య ఇంటర్మీడియట్‌ చదివి ఇంటివద్దే ఉంటుంది. ఆమె కథనం ప్రకారం.. వెంప గ్రామానికి చెందిన బొక్కానరేష్‌ రెండేళ్ల క్రితం పరిచయం అయ్యాడు. లావణ్య వెంట పడి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పాడు.


వెంప గ్రామంలో ప్రియుడు నరేష్‌ ఇంటి ముందు ధర్నా చేస్తున్న లావణ్య

నరేష్‌ కుటుంబ సభ్యులకు పరిచయం చేసి తరచూ వాళ్ల ఇంటికి తీసుకువెళ్లేవాడు. కొంతకాలంగా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి మొహం చాటేసేవాడని.. ఇటీవల పెళ్లి చేసుకోమని గట్టిగా అడిగితే డబ్బులు తీసుకుని ఈ విషయం మార్చిపోవాలని నరేష్, ఆయన కుటుంబ సభ్యులు చెప్పారని వాపోయింది. సంఘ పెద్దలు చర్చించి వివాహం చేసుకోవాలని చెప్పడంతో గురువారం రాత్రి నరేష్, అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.

నరేష్‌ తనను పెళ్లి చేసుకునే వరకు కదిలేది లేదంటూ ఇంటిముందు టెంట్‌ వేసి ఆందోళనకు దిగింది. బాధితురాలు లావణ్యకు కుటుంబ సభ్యులు, స్థానికులు మద్దతుగా నిలబడ్డారు. విషయం తెలుసుకున్న మొగల్తూరు ఎస్సై సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.   

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top