వక్ఫ్‌ ఆస్తుల జియో మ్యాపింగ్‌ 

Geomapping of waqf assets - Sakshi

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా  

రాష్ట్రంలో రెండో విడత 3,674 ఆస్తుల సర్వే 

3,295 ఆస్తుల గెజిట్‌కు ప్రభుత్వానికి సిఫారసు 

సాక్షి, అమరావతి: వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు అధునాతన సాంకేతిక పద్ధతిలో జియో మ్యాపింగ్‌ (జీపీఎస్, జీఐఎస్‌) చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌బీ అంజాద్‌ బాషా తెలిపారు. బుధవారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్‌ నిర్వహించిన సమావేశానికి అన్ని జిల్లాల అధికారులు, వక్ఫ్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్లు, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఈడీలు, ఉర్దూ అకాడమీ అధికారులు, క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ తదితర విభాగాల అధిపతులు హాజరయ్యారు. వైఎస్సార్‌ సీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే రీ సర్వే చేసి వక్ఫ్‌ ఆస్తులను పరిరక్షిస్తున్నట్లు అంజాద్‌ బాషా చెప్పారు.

గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వక్ఫ్‌ బోర్డు రెండో విడత సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. 3,674 వక్ఫ్‌ ఆస్తులను సర్వే చేసి 3,295 ఆస్తుల గెజిట్‌ నోటిఫికేషన్‌ కోసం ప్రభుత్వానికి నివేదించినట్లు వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో సుమారు 223 వక్ఫ్‌ భూములు, 3,772 మసీదులు, దర్గాలకు అనుబంధంగా ఉన్న ఆస్తులను జియో మ్యాపింగ్‌ చేశామన్నారు. మరో 1,206 వక్ఫ్‌ భూములు, 69 వక్ఫ్‌ సంస్థల అనుబంధ ఆస్తులను మ్యాపింగ్‌ చేయాల్సి ఉందన్నారు. వక్ఫ్‌ బోర్డుకు ఆదాయం కోసం బహిరంగ వేలం ద్వారా 1,204 ఎకరాల వ్యవసాయ భూమిని 2021–22 సంవత్సరానికి రూ.78.81 లక్షలకు లీజుకు ఇచ్చామన్నారు.  

అన్యాక్రాంత భూములు స్వాధీనం.. 
రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతమైన సుమారు 495.80 ఎకరాల భూమిని వక్ఫ్‌ బోర్డు స్వాధీనం చేసుకోగలిగిందన్నారు. 2,346 పెండింగ్‌ కేసుల విచారణను వేగవంతం చేసినట్లు చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top