పులిచింతల ప్రాజెక్టు గేటు బిగింపు పూర్తి

Gate fastening of Pulichintala project is complete - Sakshi

రెండేళ్ల క్రితం వరద ఉధృతికి కొట్టుకుపోయిన 16వ గేటు 

48 గంటల్లోనే స్టాప్‌లాగ్‌ గేటు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 

పూర్తి స్థాయిలో నీటి నిల్వ.. ఆయకట్టుకు నీరు 

నీటి నిల్వ తగ్గాక కొత్త గేటు పనులు ప్రారంభం 

18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పు 250 టన్నుల బరువుతో గేటు తయారీ 

సెల్ఫ్‌ లూబ్రికెంట్‌ బుష్‌ల తయారీలో తీవ్ర జాప్యం చేసిన జపాన్‌ సంస్థ 

పది రోజుల క్రితం బుష్‌లు రాక 

వెంటనే యుద్ధప్రాతిపదికన గేటు బిగించిన అధికారులు

సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు స్థానంలో కొత్త గేటును బిగించారు. జలవనరుల శాఖ అధికారుల పర్యవేక్షణలో కాంట్రాక్టు సంస్థ బీకెమ్‌ ప్రతినిధులు శుక్రవారం ఈ ప్రక్రియ పూర్తి చేశారు. 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 250 టన్నుల బరువున్న గేటును భారీ క్రేన్ల సహాయంతో అమర్చారు.

స్పిల్‌ వే 16, 17 పియర్స్‌ (కాంక్రీట్‌ దిమ్మెలు) మధ్య గేటును దించి.. ఆర్మ్‌ గడ్డర్లను పియర్స్‌ ట్రూనియన్‌ బీమ్‌ల యాంకర్లను జపాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న సెల్ఫ్‌ లూబ్రికెంట్‌ బుష్‌లతో అనుసంధానం చేశారు. ఆ తర్వాత గేటును పైకి ఎత్తుతూ.. కిందకు దించుతూ పలుమార్లు పరీక్షించారు. గేటు పనితీరు ప్రమాణాల మేరకు ఉన్నట్లు అధికారులు తేల్చారు. 

జపాన్‌లో బుష్‌ల తయారీ, దిగుమతిలో జాప్యం వల్లే 
నాగార్జున సాగర్‌ నిండిపోవడంతో 2021 ఆ­గస్టు 4వ తేదీ సాయంత్రం 55,028 క్యూసెక్కులను తెలంగాణ అధికారులు దిగువకు వి­డు­దల చేశా­రు. ఆ రాత్రికి 1.80 లక్షల క్యూసెక్కు­ల­కు పెంచారు. పులిచింతల ప్రాజెక్టులో అప్పటికే 44.54 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి భారీ వరద రావడంతో అంతే స్థాయిలో దిగు­­వ­కు విడుదల చేసేందుకు 2021 ఆగస్టు 5 తెల్లవా­రుఝామున ఏడు గేట్లను రెండడుగులు ఎ­త్తా­రు.

ఈ క్రమంలోనే 16వ గేటు ఎడమ వైపు పి­య­­ర్‌ ట్రూనియన్‌ బీమ్‌ విరిగిపోయి గే­టు ఊడిపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపో­యింది. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్య­లు చేపట్టి, 48 గంటల్లోనే దాని స్థానంలో స్టాప్‌లాగ్‌ గేటు­ను ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలు నిల్వ చేసి ఆయకట్టుకు నీరందించింది. ప్రభు­త్వ ఆదేశాల మేరకు జలాశయంలో నీటి నిల్వ తగ్గాక కొత్త గేటు బిగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.

16, 17వ పియర్‌ల­కు ట్రూనియన్‌ బీమ్‌లను కొత్తగా నిర్మించారు. గేటును కూడా సిద్ధం చేశారు. గేటును పియర్స్‌ మధ్య బిగించడానికి, వాటి ఆర్మ్‌ గడ్డర్లను ట్రూ­ని­యన్‌ బీమ్‌లతో అనుసంధానం చేసే సెల్ఫ్‌ లూబ్రికెంట్‌ బుష్‌లను గతంలో జపాన్‌ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్నారు. కొత్త బుష్‌ల తయారీలో జపాన్‌ సంస్థ తీవ్ర జాప్యం చేసింది. దీని వల్లే గేటు బిగింపు ఆలస్యమైంది. పది రోజుల క్రితం జపాన్‌ సంస్థ బుష్‌లను పంపడం­తో అదే రోజు గేటు బిగింపు ప్రక్రియను ప్రారంభించిన అధికారులు శుక్రవారం పూర్తి చేశారు.

కృష్ణా డెల్టాకు వరం.. 
కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌ పంటకు సకాలంలో నీటిని విడుదల చేసి.. తుపానులు వచ్చేలోగా పంట కోతలు పూర్తయ్యేలా చేయడం ద్వారా రైతుకు దన్నుగా నిలవాలనే లక్ష్యంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005 నవంబర్‌ 18న పులిచింతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 20,37,656 క్యూసెక్కుల వరద వచ్చినా దిగువకు సులభంగా విడుదల చేసే­లా పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు.

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు. స్పిల్‌వేకు 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పు­తో 24 గేట్లను బిగించారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో 2014 నుంచి 2019 వరకు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోయారు.

వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యుద్ధప్రాతిపదికన నిర్వాసితులకు పునరావాసం కల్పించి, 2019 ఆగస్టులోనే పులిచింతలలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గత నాలుగేళ్లుగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ కృష్ణా డెల్టాలో రెండు పంటలకు సకాలంలో నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top