స్వాతంత్య్ర సమరయోధుడు 'పావులూరి' కన్నుమూత

Freedom fighter Pavuluri Sivaramakrishnaiah passes away - Sakshi

అనారోగ్యంతో తుదిశ్వాస

తెనాలిరూరల్‌/వేమూరు/గుంటూరు వెస్ట్‌: తెనాలికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య (98) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1923 నవంబర్‌ 15న తెనాలి సమీపంలోని గోవాడ గ్రామంలో జన్మించిన ఆయన తురుమెళ్లలో ప్రాథమిక విద్య అనంతరం గోవాడలో ఉన్నత విద్య అభ్యసించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మెట్రిక్యులేషన్, మద్రాసు యూనివర్సిటీ నుంచి హిందీ పట్టా, ఆగ్రా యూనివర్సిటీ నుంచి హిందుస్థానీ, భారతీయ పారంగత్‌ పట్టా అందుకున్నారు. హిందీ ఉపాధ్యాయుడిగా చేస్తూ భారత స్వాతంత్య్ర పోరాటంలో జైలు జీవితాన్ని అనుభవించారు. జాతీయ భాష హిందీని ఉచితంగా బోధిస్తూ శివయ్య మాస్టారుగా ఖ్యాతిని ఆర్జించారు.

మహాత్మాగాంధీ సేవాగ్రామ్‌లో ఏడాది పాటు ఉండి మహాత్ముడికి సేవలందించారు. 1933లో కావూరు వినయాశ్రమంలో గాంధీజీకి స్వాగతం పలికారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో ఆలీపూర్‌లో కారాగార శిక్ష అనుభవించారు. జిల్లా పరిషత్‌ హైస్కూలులో ప్రథమ శ్రేణి హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసి 1979లో రిటైరయ్యారు. శివరామకృష్ణయ్య తన స్వగ్రామం గోవాడలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ పార్లమెంటు నిధులతో తన గ్రామంలో కమ్యూనిటీ హాలు కూడా నిర్మించారు. శంకర్‌దయాళ్‌శర్మ, మన్‌మోహన్‌సింగ్, సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్, ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వంటి ప్రముఖుల సత్కారాలను అందుకోవడంతో పాటు 2018లో జరిగిన విశ్వహిందీ సమ్మేళనంలో విశిష్ట సన్మానం అందుకున్నారు.

శివరామకృష్ణయ్యకు భార్య మంగమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు విజయకుమార్‌ వ్యవసాయశాఖలో జాయింట్‌ డైరెక్టర్‌గా రిటైరయ్యారు. రెండో కుమారుడు కృష్ణకుమార్‌ అధ్యాపకుడిగా చేసి, గుంటూరులో వ్యాపారంలో స్థిరపడ్డారు. కుమార్తె జయశ్రీ గృహిణిగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్‌ పట్టు పరిశ్రమ సలహాసంఘ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్‌ స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, కావూరు వినయాశ్రమం ధర్మకర్తల మండలి సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త పావులూరి శివరామకృష్ణయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 

చంద్రబాబు సంతాపం
స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య మృతిపట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధేయవాదంతో నేటి తరానికి శివరామకృష్ణయ్య స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీతో పాటు ఆశ్రమంలో ఉన్న వ్యక్తుల్లో శివరామకృష్ణయ్య ఒకరని, సహాయ నిరాకరణ, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. రైతు బాంధవుడిగా పేరు గడించిన శివరామకృష్ణయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top