
కొండాపురం గ్రామ సచివాలయం దగ్గర రైతులు
పంపిణీలో తీవ్ర ఉద్రిక్తతలు
కొండాపురంలో వీఏఏపై టీడీపీ శ్రేణుల దాడి
కోరుకొండలో ఎరువుల కోసం రైతుల ఘర్షణ
ఆళ్లగడ్డ/కోరుకొండ: రాష్ట్రంలో యూరియా అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో యూరియా పంపిణీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకుడి (వీఏఏ)పై టీడీపీ శ్రేణులు దాడి చేసిన ఘటన శనివారం నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురంలో చోటు చేసుకుంది. గ్రామ సచివాలయం వద్ద యూరియా పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కరికి (ఒక్కో పాసు పుస్తకానికి) రెండు బస్తాల చొప్పున వీఏఏ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రసీదు రాసిస్తున్నారు.
ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ వారు సచివాలయం వద్దకు చేరుకుని ‘ఒక్కో రైతుకు రెండు బస్తాల ఇస్తున్నామన్నారు కదా. ఇందులో ఓ రైతుకు 10 బస్తాలు ఎలా రాసిచ్చావ్’ అంటూ వాగ్వాదానికి దిగారు. అతను ఐదు పాసు పుస్తకాలు తెచ్చుకుని ఒకే రసీదు రాయించుకున్నారని, పైగా అతను కూడా టీడీపీకి చెందిన వారేనని వీఏఏ తెలిపారు. దీంతో వారు గట్టిగా కేకలు వేస్తూ వీఏఏపై దాడి చేసి బయటకు ఈడ్చుకొచ్చి పిడిగుద్దులు కురిపించారు. విషయం తెలుసుకున్న మండల వీఏఏలు అక్కడకు చేరుకుని ఇలా అయితే యూరియా పంపిణీ చేసేది లేదని నిరసన వ్యక్తం చేశారు.
అంతలో వీఏఏ బంధువులు కూడా అక్కడకు చేరుకోవడంతో సమస్య మరింత జటిలమైంది. ఎస్‌ఐ రామిరెడ్డి, తహసీల్దార్ సుభద్ర, ఎంపీడీవో సావిత్రి, ఏవో ప్రమీల అక్కడకు చేరుకుని రెండు వర్గాలకు సర్దిచెప్పడంతో సమస్య సర్దుమణిగింది. కాగా దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని వీఏఏల సంఘం డిమాండ్ చేస్తోంది.
ఇదిలా ఉండగా..
కోరుకొండలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద శనివారం జరిగిన యూరియా బస్తాల పంపిణీ రైతుల మధ్య ఘర్షణకు దారితీసింది. కోరుకొండ సొసైటీకి యూరియా ఎరువులు వచ్చాయని తెలుసుకున్న ఆ సొసైటీ పరిధిలోని 10 గ్రామాల రైతులు భారీ సంఖ్యలో తరలి రావడంతో తోపులాట జరిగింది. రైతులు ఘర్షణ పడ్డారు. నలుగురు రైతులకు స్వల్పంగా గాయాలవగా, సొసైటీ తలుపులు, కిటికీలు, అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ విషయమై సీఈఓ వర్మను వివరణ కోరగా.. వాస్తవానికి 180 టన్నుల యూరియా అవసరం కాగా, 80 టన్నులే వచి్చందని పేర్కొన్నారు.