శ్రీగిరి అభివృద్ధికి ఆమోదీంచేనా! | - | Sakshi
Sakshi News home page

శ్రీగిరి అభివృద్ధికి ఆమోదీంచేనా!

Oct 15 2025 6:14 AM | Updated on Oct 15 2025 6:14 AM

శ్రీగ

శ్రీగిరి అభివృద్ధికి ఆమోదీంచేనా!

రేపు శ్రీశైలం రానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ

శ్రీగిరి అభివృద్ధికి బాటలు పడేనా?

కలగా మిగిలిన శ్రీశైలానికి రైలు మార్గం

క్షేత్రానికి 5,300 ఎకరాల భూ బదిలీ జరిగేనా

ఆత్మకూరు–దోర్నాల ఘాట్‌రోడ్డు విస్తర్ణకు ఆమోదం లభించేనా?

గతంలో కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ స్కీం నుంచి రూ.43 కోట్లు విడుదల

శ్రీశైలంటెంపుల్‌: ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వరూపంలో కొలువైన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంగణంలో జ్యోతిర్లింగ స్వరూపుడు, శక్తిపీఠం కలగలసి వెలసి ఉన్న ఏకై క క్షేత్రం. అంతటి ప్రాశస్త్యం ఉన్న మహాక్షేత్రం అభివృద్ధికి దూరమవుతోంది. అరకొర సౌకర్యాలతో భక్తులు అవస్థలు పడుతున్నారు. క్షేత్రంలో ఏ చిన్న అభివృద్ధి చేయాలన్న అటవీశాఖ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. రహదారులు, వసతి సౌకర్యాలు భక్తులను వేధిస్తున్నాయి. గురువారం శ్రీశైలానికి భారత ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో క్షేత్ర అభివృద్ధిపై దృష్టి సారించి, శ్రీగిరిలో నెలకొన్న సమస్యలపై దృష్టిసారించి పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే అటు ఆంధ్రా నుంచి అయినా, ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి అయినా రైలు మార్గం లేదు. సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని మార్కాపురం రోడ్డు వరకు మాత్రమే రైలు మార్గం ఉంది. ఇటు తెలంగాణ నుంచి అయితే రైలు మార్గం అసలే లేదు. గతంలో పార్లమెంట్‌సభ్యులు శ్రీశైలానికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడంతో పరిశీలించాలని అధికారులకు ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో ప్రత్యేక కమిటీ సభ్యులు శ్రీశైలానికి రైలు మార్గానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు. శ్రీగిరి చుట్టూ నల్లమల అభయారణ్యం కావడంతో మార్కాపురం రోడ్డు నుంచి దోర్నాల వరకు రైలు మార్గాన్ని విస్తరించవచ్చునని ప్రతిపాదనలను పంపినట్లు సమాచారం. అయితే ఏటా బడ్జెట్‌ ప్రవేశపెట్టేటప్పుడు శ్రీశైలానికి రైలు మార్గం బడ్జెట్‌లో ప్రస్తావనకు రావడం లేదు. క్షేత్రానికి రైలు మార్గం ఉంటే సామాన్య భక్తులు సైతం క్షేత్ర యాత్ర చేసుకునే అవకాశం ఉంటంది.

ఐకానిక్‌ బ్రిడ్జికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేనా?

శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు సున్నిపెంటగ్రామంలో సుమారు రూ.70 కోట్లతో స్టాఫ్‌ క్వాటర్స్‌ నిర్మించారు. సున్నిపెంట నుంచి శ్రీశైలానికి 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూరాన్ని తగ్గించాల నే ఉద్దేశంతో సున్నిపెంట నుంచి కృష్ణానదిపై శ్రీశైలం వరకు ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించాలని మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. అలాగే తెలంగాణ నుంచి శ్రీశైలంకు సమీపంలో దూరాన్ని తగ్గించేలా తెలంగాణ ప్రభుత్వం ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించేందుకు డీపీఆర్‌ సిద్ధం చేసి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఏపీ, తెలంగాణ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలి. ఐకానిక్‌ వంతెనను నిర్మిస్తే భక్తులకు శ్రీశైలం దూరం తగ్గడంతో పాటు ప్రయాణం సాఫీగా సాగుతుంది.

భూ బదలాయింపు జరిగేనా

గతంలో దేవదాయ, అటవీ, రెవెన్యూ శాఖల మంత్రులు, మూడు శాఖల ఉన్నతాధికారులతో హైపవర్‌ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ప్రాథమికంగా శ్రీశైల దేవస్థానానికి 5,302 ఎకరాల భూమి ఉందని నిర్ధారించారు. శ్రీశైల దేవస్థానానికి 1967 నవంబర్‌లో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకారం 5,302 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ మొత్తం భూమి 9 సర్వే నెంబర్లలో ఉంది. 5,302 ఎకరాల్లో 900 ఎకరాలు శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్‌లో ముంపు అయింది. బ్రిటీష్‌కాలం నాటి జీవో, బ్రిటీష్‌ కాలం నాటి గెజిట్‌ ఎంట్రీ ద్వారా సర్వే చేయించి క్షేత్ర సరిహద్దులను గుర్తించారు. 4,400 ఎకరాలు శ్రీశైల మల్లన్న కు చెందిన భూమి అని గుర్తించి, అటవీశాఖ అంగీకరించింది. దీంతో ఆ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవదాయశాఖకు భూమిని అప్పగించేందుకు గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా సర్వే డిపార్ట్‌మెంట్‌కు డీఎఫ్‌వో లేఖ రాశారు. అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.

మల్లన్న క్షేత్రానికి ‘ప్రసాదం’ అందేనా..!

శ్రీశైల క్షేత్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్‌ స్కీం రూ.43 కోట్లతో అభివృద్ధి చేసింది. శ్రీశైలక్షేత్రానికి రోజు రోజుకు పెరుగుతున్న భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం శ్రీశైలంలో కల్పించాల్సిన సౌకర్యాలపై 2017 లో అప్పటి ఈవో భరత్‌గుప్తా కేంద్ర పర్యటక శాఖ అధికారులకు వివరించి, డీపీఆర్‌ను సమర్పించారు. దీంతో కేంద్ర పర్యాటక శాఖ (పిలిగ్రిమేజ్‌ రెజువెనేషన్‌ అండ్‌ స్పిర్చువల్‌ అగ్మెంటేషన్‌ డ్రైవ్‌) ప్రసాద్‌ పథకం కింద శ్రీశైల క్షేత్రంలో భక్తులకు, పర్యాటకులకు కల్పించాల్సి న సౌకర్యాల కోసం రూ.43 కోట్లు నిధులు మంజూరు చేసింది. మూడు విడతలుగా నిధులు మంజూరయ్యాయి. 2017లో శ్రీశైలంలో ప్రసాద్‌ పథకం ద్వారా పనులు ప్రారంభించారు. కేంద్రం మంజూరు చేసిన పనులను రాష్ట్ర పర్యాటక శాఖ, శ్రీశైల దేవస్థాన ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో చేపట్టారు. 2022 డిసెంబరు 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మల్లన్న దర్శనానికి వస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీగిరి అభివృద్ధికి వరాలు కురిపించాలని భక్తులు కోరుతున్నారు.

శ్రీగిరి అభివృద్ధికి ఆమోదీంచేనా! 1
1/1

శ్రీగిరి అభివృద్ధికి ఆమోదీంచేనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement