
పీఎం పర్యటనకు పకడ్బందీ బందోబస్తు
● విధుల్లో 1,800 మంది పోలీసులు ● ఎస్పీ సునీల్ షెరాన్
శ్రీశైలంటెంపుల్: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న శ్రీశైలం పర్యటనను పురస్కరించుకుని 1800 మంది పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు నంద్యాల ఎస్పీ సునీల్‌షెరాన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ.. ప్రధాని శ్రీశైలం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని హెలిపాడ్‌కు చేరుకున్నప్పటి నుంచి దర్శనం అనంతరం తిరిగి వెళ్లేంత వరకు ఆయన పర్యటించే ప్రదేశాలలో విస్త్రత తనిఖీలు నిర్వహించి, ప్రధాన కూడళ్లలో సాయుధ బలగాలతో పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్త్‌కు వచ్చిన సిబ్బందిని 10 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్‌కు ఒక ఉన్నతాధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించామన్నారు. జియోగ్రాఫికల్ మ్యాప్ ద్వారా ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో తీసుకోవలసిన భద్రత చర్యలను క్షుణ్ణంగా సిబ్బందికి వివరించామని వివరించారు.
నల్లమలలో గ్రేహౌండ్స్ కూంబింగ్:
నల్లమల అడవుల్లో స్పెషల్‌పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశారు. స్పెషల్ పార్టీ సాయుధబలగాలు శ్రీశైలం చుట్టూ, ప్రధాని పర్యటించే ప్రదేశాలలో తనిఖీలు చేపట్టారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో రోడ్డు ఓపెనింగ్ పార్టీ సిబ్బంది హ్యాండ్ హోల్డ్ మెటల్ డిటెక్టర్ సహాయంతో, పోలీసు జాగిలాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. క్షేత్ర పరిధిలోని అన్ని డార్మెంటరీలు, సత్రాలలో బస చేస్తున్న భక్తుల వివరాలను తెలుసుకుంటున్నారు.