
సీమ హక్కుల అమలుకు చర్యలు చేపట్టండి
నంద్యాల(అర్బన్): రాయలసీమ ప్రాంతానికి చట్టబద్ధంగా కల్పించిన హక్కులను తక్షణమే అమలు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విన్నవించారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో మంగళవారం వినతి పత్రాన్ని మెయిల్ ద్వారా ఆయన పీఎం కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం సీమకు ప్రత్యేక ప్యాకేజీ విడుదల చేయాలని, రాష్ట్రం విడిపోయి 11 ఏళ్లు అవుతున్నా సీమ జిల్లాలకు నిధుల విడుదలలో అన్యాయం జరుగు తుందన్నారు. కేంద్రీకృత అభివృద్ధి విధానాన్ని పాలకులు ఎంచుకోవడంతో ఏర్పడిన నిధుల కొరత వల్ల రాష్ట్ర విభజన చట్టం హక్కులు కల్పించిన తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని నిధులు విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కడప ఉక్కు కర్మాగారం, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. బచావత్ ట్రిబ్యునల్ హక్కులు కల్పించిన హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు పూడిక, రిజర్వాయర్ల లేమి కారణంగా కేటాయించిన నీరు వినియోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. సీమ యువత భవిష్యత్తు, గ్రామీణ ప్రజల జీవనోపాధిపై తక్షణ చర్యలు చేపట్టి సీమ సమగ్ర అభివృద్ధికి పునాదులు వేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వైఎన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, అసదుల్లా, బెక్కెం రామసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.