వంటింట్లో 'వార్'! | Essential commodities have increased drastically under the TDP coalition rule | Sakshi
Sakshi News home page

వంటింట్లో 'వార్'!

Mar 28 2026 2:08 AM | Updated on Mar 28 2026 2:08 AM

Essential commodities have increased drastically under the TDP coalition rule

ధరల నియంత్రణ గాలికి వదిలేసిన బాబు సర్కార్‌

టీడీపీ కూటమి 22 నెలల పాలనలో జనం నడ్డి విరుస్తున్న నిత్యావసరాలు

ఇటు పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేదు

అటు వినియోగదారులపై ధరల మోత

వణికిస్తున్న వంట నూనె.. పది రోజుల్లో రూ.15–25 పెరుగుదల

లీటరు వేరుశనగ రూ.210–225.. సన్‌ఫ్లవర్‌ రూ.180–190.. పామాయిల్‌ రూ.131–140

రూ.420కి ఎగబాకిన కిలో కోడి మాంసం.. కాక రేపుతున్న కర్రీ పాయింట్లలో రేట్లు

బియ్యం బస్తాపై ఏకంగా రూ.200కి పైగా పెరుగుదల

బాస్మతి, దావత్‌ బియ్యం కిలో రూ.150 – 230 

అగ్నికి ఆజ్యం తోడైనట్లు వంట గ్యాస్‌ రూ.110 పెరుగుదల

గ్యాస్‌ దొరక్క మండుటెండల్లో.. క్యూ లైన్లలో జనం అవస్థలు

ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర దక్కక అన్నదాతల అగచాట్లు  

సాక్షి, అమరావతి: ధరల నియంత్రణలో చంద్రబాబు సర్కార్‌ వైఫల్యం సామాన్యుడి వంటింట్లో సెగలు పుట్టిస్తోంది. నిత్యావసరాల ధరలు అంతకంతకూ భగ్గుమంటూ జనం నడ్డి విరుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే దిక్కులు చూస్తోంది. గత 22 నెలలుగా నూనె రేట్లు కాక రేపుతున్నాయి. ప్రతి నెలా భారీగా పెరగడమేగానీ స్వల్పంగా కూడా దిగొచ్చిన దాఖలాలు లేవు. 

ఇప్పటికే ధరల బాదుడుతో అల్లాడుతుండగా గ్యాస్‌ సంక్షోభం పేదల జీవనాన్ని మరింత దిగజార్చింది. చంద్రబాబు సర్కారు పీఠం ఎక్కిన తర్వాత గ్యాస్‌ రేట్లు రెండు సార్లు పెరగడంతో జనంపై ఏకంగా రూ.110 భారం పడింది. గ్యాస్‌ కోసం 10–15 రోజులు ఎదురు చూసినా రాకపోవడంతో మండుటెండల్లో వినియోగదారులు ఏజెన్సీలకు క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. 

మరోవైపు వరదలు, అకాల వర్షాలు, కరువు దెబ్బకు పంటలు దెబ్బ తిన్నాయి. రైతులకు ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. మార్కెట్‌లో చూస్తే నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. రోజు­వారీ పనులు లేక..  చేతిలో చిల్లి గవ్వలేక.. భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలతో పేదలు విలవిల్లాడుతుంటే చంద్రబాబు సర్కారు వేడుక చూస్తోంది.  

60 శాతానికిపైగా పెరిగిన నూనెల ధరలు.. 
దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఏపీలో వంట నూనెల ధరలు సెగ పుట్టిస్తున్నాయి. గత 22 నెలలుగా పామాయిల్, సన్‌ఫ్లవర్, వేరుశనగ నూనె రేట్లు పైకి ఎగబాకుతూనే ఉన్నాయి. పది రోజుల క్రితం సన్‌ఫ్లవర్, పామాయిల్‌ రేట్లు లీటరుకు రూ.15–25 వరకు పెరిగాయి. గతంలో ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో పెరిగిన నూనె రేట్లు.. చంద్రబాబు హయాంలో సాధారణ పరిస్థితుల్లోనూ ఆకాశాన్ని తాకుతుండటం గృహిణులను కన్నీళ్లు పెట్టిస్తోంది. 2024 ఏప్రిల్‌లో లీటర్‌ వేరుశనగ నూనె రూ.167.87 కాగా ఇప్పుడు రూ.210–22 ఉంది. 

గతంలో పామాయిల్‌ రూ.89–91 ఉంటే ఇప్పుడు రూ.131–140 ఉంది. సన్‌ఫ్లవర్‌ గతంలో రూ.112 ఉంటే ఇప్పుడు రూ.180–190కి కొనుగోలు చేయాల్సిన దుస్థితి. పామాయిల్‌ ఏకంగా 60 శాతం, సన్‌ఫ్లవర్‌ 63–70 శాతం, వేరుశనగ నూనెపై 70 శాతం రేట్లు పెరిగాయి. వీటితోపాటు ఆవనూనె, సోయా, వనస్పతి రేట్లు కూడా దిగి రావట్లేదు. ఫలితంగా మధ్య తరగతి కుటుంబాలు వంటలను కుదించుకుంటున్న పరిస్థితి. గ్యాస్‌ కొరతకు తోడు నూనె రేట్లకు భయపడి ఒంటి పూట వంటలు వండుకోవడం గమనార్హం.  

ఉడకని పప్పులు.. తగ్గని రేట్లు.. 
వంట నూనెలకు తోడు పప్పు దినుసుల రేట్లు పేదింటి కుటుంబాలకు పెను భారంగా మారుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చినా, తెలంగాణతో చూసినా ఏపీలోనే రేట్లు అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కిలో కందిపప్పు రూ.120–150, గోధుమ పిండి రూ.71–100, మినçప్పప్పు రూ.146–150 పైగా పలుకుతోంది. పెసలు సైతం కిలో రూ.160, వేరుశనగ గుళ్లు రూ.188–200, శనగపప్పు రూ.128కి తగ్గట్లేదు. 

నిత్యం కూరలు, తాలింపుల్లో తప్పనిసరిగా వినియోగించే దినుసుల్లో  ఎండు మిర్చి రూ.200–390, పసుపు రూ.380, వెల్లుల్లి రూ.219–250, అల్లం రూ.109–150, కారం రూ.500(ప్రీమియం), సాధారణం రూ.200కిపైగా, ఇంగువ 100 గ్రాములు రూ.200 వరకు ఉంది. పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేదు గానీ మార్కెట్‌లో  కొనుగోలుదారులు కూరగాయలను ముట్టుకుంటే మండుతున్నాయి. 

టమాటా రైతుకి కిలో రూ.3 మాత్రమే దక్కుతుంటే మార్కెట్‌లో రూ.20–25 చొప్పున వినియోగదారులు కొనాల్సి వస్తోంది. అరటి సైతం రైతుకు కిలో రూ.5 మాత్రమే దక్కుతుంటే బయట డజను రూ.100 పలుకుతోంది. వేసవిలో పండ్లలో అధికంగా తీసుకునే కర్బూజా రైతుల నుంచి కిలో రూ.3–4 చొప్పున కొంటుంటే బయట కాయ ఏకంగా రూ.20–30 ఉంటోంది.

చివరికి కరివేపాకు సైతం కిలో రూ.180 పలుకుతోంది. పచ్చి మిర్చి రూ.79, క్యాప్సికం రూ.75, కూరమామిడి రూ.100కు తక్కువ లేదు. ఇవన్నీ పండించిన రైతులకు పదో పరకో దక్కుతుంటే పచ్చ సిండికేట్‌ మార్కెట్‌లో వినియోగదారుల జేబులను గుల్ల చేస్తోంది. 

బియ్యం.. బాబోయ్‌! 
అన్నపూర్ణగా పిలుచుకునే ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం రేట్ల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. వరి పండించే రైతులకు 75 కిలోల బస్తాకు రూ.1,100–­1,500 మాత్రమే దక్కుతుంటే మార్కెట్‌లో వినియోగదారుడు 26 కిలోల బస్తా రూ.1,600 పెట్టి కొనాల్సి వస్తోంది. పది రోజుల క్రితంతో పోలిస్తే బస్తాకు రూ.300 దాకా  రేట్లు పెంచారు. బాస్మతి బియ్యం సైతం కిలో రూ.80 నుంచి రూ.110–150కి పెరిగాయి. 

దావత్‌ బియ్యం అయితే కిలో రూ.230కిపైగా ఉంది. వాస్తవానికి గత నెలలోనే మిల్లర్లు, బియ్యం సిండికేట్‌ సన్నరకాల బియ్యంపై రేట్లు పెంచారు. క్వింటాకు ఏకంగా రూ.400పైనే బాదారు. హోల్‌సేల్‌ నుంచి మార్కెట్‌లోకి వచ్చే సరికి కర్నూలు సోనా 26 కిలోల బస్తా రకాన్ని బట్టి రూ.1,599, రూ.1699కిపైగా ఉంటోంది. ఇష్టానుసారం బియ్యం రేట్లను పెంచేస్తుంటే చంద్రబాబు సర్కార్‌ కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు.  

కోడి మాంసం కిలో రూ.420 
రాష్ట్రంలో పౌల్ట్రీ రంగంలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పుణ్యమా అంటూ గుడ్డు రేటు భారీగా పతనమై పౌల్ట్రీ రైతులను ముంచేసింది. మరోవైపు కోడి మాంసం రేటు రూ.400–420కి ఎగబాకి వినియోగదారులకు షాకిచ్చింది. చివరికి కోడి మాంసాన్ని ప్యాకింగ్‌ చేసే ప్లాస్టిక్‌ కవర్లు, పెళ్లిళ్లలో వేసే విస్తరులు, గ్లాసుల రేట్లకు కూడా రెక్కలు రావడం చంద్రబాబు సర్కార్‌ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది. కర్రీ పాయింట్‌లో కూరల ధరలు రూ.5–10 వరకు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో వంట చేసుకోలేక.. బయట కొనుక్కొని తినలేక సగటు జీవి నిత్యం నరకం అనుభవించాల్సి వస్తోంది.

రేషన్‌లో కందిపప్పు కట్‌.. 
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసరాల రేట్లు అమాంతం పెరుగుతుంటే.. పేదలకు ఇచ్చే రేషన్‌ మాత్రం కుంచించుకుపోతోంది. జాతీయ ఆహార భద్రత చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తూ రేషన్‌ వ్యవస్థను దిగజార్చింది. గత ప్రభుత్వంలో నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యాన్ని ఎండీయూ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సమర్థంగా అందిస్తే చంద్రబాబు సర్కార్‌ కక్షపూరితంగా ఆ వ్యవస్థనే రద్దు చేసింది. 

బియ్యం నాణ్యతకు తిలోదకాలిచ్చి అక్రమ రవాణాకు గేట్లు తెరిచింది. ఫలితంగా పేదలు తినాల్సిన బియ్యం వారి ఇళ్లకు చేరకుండా దొడ్డిదారిన పోర్టుల ద్వారా విదేశాలకు తరలిపోతోంది. ఇక మార్కెట్‌లో కందిపప్పు రేటు అందనంత ఎత్తులో ఉంటే చౌక దుకాణాల ద్వారా ఇవ్వకుండా మంగళం పాడేసింది. గోధుమ పిండిని సైతం అర్ధంతరంగా నిలిపివేసింది. కిలో రూ.20 చొప్పున జిల్లా కేంద్రాల్లో పంపిణీ చేస్తామని ప్రకటించి  చేతులు ఎత్తేసింది.

పౌష్టికాహారంలో భాగంగా ఇవ్వాల్సిన రాగులు, జొన్నల పంపిణీని సైతం గాడి తప్పించింది. సబ్సిడీపై ఇచ్చే నూనెలను సైతం ఎత్తేసింది. ఎన్నికల ప్రచారంలో రేషన్‌ దుకాణాల ద్వారా ఏకంగా 18 రకాల నిత్యావసరాలను ఇస్తామని నమ్మబలికి దారుణంగా మోసం చేసింది. రేషన్‌లో కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం, అరకొర పంచదార మినహా చంద్రబాబు సర్కారు పేదలకు ఒరగబెట్టిందేమీ లేదు.  

గ్యాస్‌ కోసం క్యూ కట్టి..
ప్రజలకు బూటకపు కబుర్లు చెప్పి మోసం చేయడంలో తాను దిట్ట అని చంద్రబాబు రుజువు చేసుకున్నారు. ఒకవైపు గ్యాస్‌ సంక్షోభం ముంచుకొస్తుంటే ఏపీలో ఎక్కడా గ్యాస్‌ కొరత లేదని ప్రకటనలు గుప్పించి చేతులు దులుపుకొన్నారు. కూటమి సర్కారు వచ్చాక వంట గ్యాస్‌ రూ.110 పెరిగింది. కమర్షియల్‌ గ్యాస్‌పై తాజాగా రూ.115 చొప్పున పెంచడంతో పాటు ఆంక్షలు విధించడంతో హోటల్‌ రంగం కుదేలైంది. 

వాస్తవానికి గృహ వినియోగ గ్యాస్‌ విషయంలో పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల పాటు గ్యాస్‌ బుకింగ్‌ వ్యవధిగా నిర్ణయించారు. అయితే పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులు బుకింగ్‌ కోసం ప్రయత్నిస్తే 35 రోజుల తర్వాతే బుకింగ్‌లు చేసుకోవాలని మెసేజ్‌లు వస్తున్నాయి. గ్యాస్‌ బుక్‌ చేసుకున్న 10–15 రోజుల తర్వాత కూడా ఏజెన్సీలు డెలివరీ చేయలేకపోతున్నాయి. 

సాధారణ రోజుల్లో వచ్చే స్టాకు కంటే ఇప్పుడు 20 శాతం తగ్గించి ఇస్తుండటం, పెండింగ్‌ డెలివరీలు పెరిగిపోవడంతో ఏజెన్సీలు చేతులు ఎత్తేస్తున్నాయి. ఇదే అదనుగా చంద్రబాబు అనుకూల ఏజెన్సీలు దొడ్డిదారిన గ్యాస్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తూ దండుకుంటున్నాయి. సామాన్య ప్రజలు మాత్రం సిలిండర్లతో మండుటెండలో క్యూలలో నిల్చోవాల్సిన దుస్థితి దాపురించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement