
మే నుంచి జూన్ మధ్య రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్
ఉదయం, రాత్రి వేళల్లో అనూహ్యంగా పెరగనున్న వినియోగం
దేశవ్యాప్తంగా 15 గిగావాట్ల నుంచి 20 గిగావాట్ల కొరత ఏర్పడే ప్రమాదం
అన్ని రాష్ట్రాలను హెచ్చరించిన నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్
రాష్ట్రంలో ఇప్పటికే మొదలైన అనధికార విద్యుత్ కోతలు
రైతులకు రోజుకు 7 గంటలే ఇవ్వగలమంటున్న అధికారులు
ఏ రోజు బొగ్గు ఆ రోజే తెచ్చుకోవడంతో ఆందోళనకర స్థాయికి నిల్వలు
సాక్షి, అమరావతి: ప్రజలేమైపోయినా ప్రభుత్వానికి అక్కర్లేదు. విద్యుత్ అవసరాలపై ఎప్పటికప్పుడు సమీక్షించి అధికారులను అప్రమత్తం చేయాల్సిన మంత్రికి కనీస అవగాహన లేక ఆ పనే చేయడం లేదు. మే నెలలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 260 మిలియన్ యూనిట్లు ఉంటుందని తెలిసినా.. ఆ మేరకు విద్యుత్ సమకూర్చుకునే ప్రయత్నాలు జరగడం లేదు. విద్యుత్ లోటు ఏర్పడితే పరిస్థితి ఏమిటనే ఆలోచన చేయడం లేదు. ఫలితంగా విద్యుత్ కోతలు మొదలుపెట్టి.. దానికి ‘మెయింటెనెన్స్’ అనే పేరు తగిలించి తప్పించుకుంటున్నారు.
వ్యవసాయ అవసరాలకు 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాల్సిందిపోయి.. 7 గంటలు మించి ఇవ్వలేమంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. మరోపక్క ఈ ఏడాది మే నుంచి జూన్ వరకు విద్యుత్ డిమాండ్ భారీగా ఉంటుందని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్‌ఎల్‌డీసీ) హెచ్చరించడం రాష్ట్ర ప్రజలను కలవరపెడుతోంది.
ఇప్పుడే విద్యుత్ డిమాండ్‌ను తీర్చలేక కోతలు విధిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రస్తుత మే, వచ్చే జూన్ నెలల్లో ఇంకెంతగా బాధిస్తుందోననే ఆందోళన మొదలైంది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఇప్పటికైనా మేలుకోండి
ఈ ఏడాది మే నుంచి జూన్ మధ్య రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదవుతుందని ఎన్‌ఎల్‌డీసీ అన్ని రాష్ట్రాలను తాజాగా హెచ్చరించింది. ఈ ఏడాది మార్చిలోనే తొలిసారిగా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అప్పుడు కూడా మన పాలకులు, అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. మే, జూన్ నెలల మధ్య దేశవ్యాప్తంగా 15 గిగావాట్ల నుంచి 20 గిగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, సౌర విద్యుత్ అందుబాటులో లేని ఉదయం, రాత్రి వేళ(పీక్ అవర్స్)ల్లో అనూహ్యంగా విద్యుత్ వినియోగం పెరుగుతుందని వెల్లడించింది.
పీక్ డిమాండ్ రోజుకి 270 గిగావాట్లుగా నమోదవుతుందని ఎన్‌ఎల్‌డీసీ అంచనా వేసింది. ఇది గతేడాది 240 గిగావాట్లు మాత్రమే. అంటే 30 గిగావాట్లు ఈ ఏడాది పెరగడమనేది భారీ మార్పే. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అందుబాటులో బొగ్గు, ఇతర ముడిసరుకు అందుబాటులో లేకుండాపోతుందని తెలిపింది.
రాష్ట్రంలో వేధిస్తున్న విద్యుత్ కోతలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం అందించడంపై దృష్టి సారించలేదు. వేసవి ప్రారంభం నుంచీ అనధికార విద్యుత్ కోతలు మొదలుపెట్టారు. రైతులకు 9 గంటలు విద్యుత్ అందించడం లేదు. కనీసం 7 గంటలు కూడా ఇవ్వలేమని బహిరంగంగానే చెబుతున్నారు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారు.
తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు సబ్‌స్టేషన్ల వార్షిక మరమ్మతులు, విద్యుత్ లైన్ల తనిఖీలు చేపడుతున్నామంటూ అధికారులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు. లైన్ల మరమ్మతుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా డిస్కంల వారీగా నిత్యం పగలు 3 గంటలు, రాత్రి 2 గంటలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. సబ్‌స్టేషన్ నిర్వహణ అని చెబితే ఇక ఆ రోజంతా విద్యుత్ సరఫరా ఉండటం లేదు.
బొగ్గు ఏదీ?!
థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలను అందుబాటులో ఉంచాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ చెబుతున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ఆ మేరకు నిల్వలు ఉండటం లేదు. వీటీపీఎస్‌కు రోజుకి 41,500 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి చేయగలం. కానీ.. ఇక్కడ ప్రస్తుతం ఉన్న 4,13,707 మెట్రిక్ టన్నులతో 9 రోజులకు మించి విద్యుత్ ఉత్పత్తి చేయలేం. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో 35,760 మెట్రిక్ టన్నులు ఒక్క రోజుకు మాత్రమే సరిపోతాయి.
కృష్ణపట్నంలో 1,65,181 మెట్రిక్ టన్నులతో 5 రోజులు విద్యుత్ ఉత్పత్తి చేయగలం. ఈ నిల్వలను ఇప్పటికే పెంచుకుని ఉండాల్సింది. వేసవికి ముందే ఆ పని చేయకపోవడం వల్ల ఇంకా బొగ్గు కొరత వస్తే ఈ మాత్రం నిల్వలు కూడా ఉండవు. అప్పుడు బహిరంగ మార్కెట్‌పైనే ఆధారపడాలి. అధిక ధర చెల్లించి విద్యుత్ కొనాలి. అందుకోసం కూడా ముందుగానే షార్ట్‌టెర్మ్ టెండర్లు దాఖలు చేయాలి. ఆ భారం తిరిగి ప్రజలపైనే చార్జీల రూపంలో పడుతుంది.
ఇంకా పెరిగితే కష్టమే
రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి 239.228 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. ఇది గతేడాది ఇదే సమయానికి జరిగిన 224.509 మిలియన్ యూనిట్లతో పోల్చితే 6.56 శాతం ఎక్కువ. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ను సరిపెట్టడానికి ఏపీ జెన్‌కో థర్మల్ నుంచి 86.275 మిలియన్ యూనిట్లను సమకూరుస్తోంది. జెన్‌కో హైడల్ నుంచి కేవలం 5.361 మిలియన్ యూనిట్లే వస్తోంది.
సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లు 34.174 మిలియన్ యూనిట్లు, పవన విద్యుత్ ప్లాంట్లు 18.610 మిలియన్ యూనిట్లు, సౌర విద్యుత్ కేంద్రాలు 23.850 మిలియన్ యూనిట్లు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు 41.069 మిలియన్ యూనిట్లు, ఇతరులు 4.279 మిలియన్ యూనిట్లు సమకూరుస్తున్నారు. అయినప్పటికీ సరిపోకపోవడంతో బహిరంగ మార్కెట్ నుంచి 25.610 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు డిమాండ్‌ను ఎదుర్కోవడం ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనేనా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.