
ఆ విధానం లోపభూయిష్టం.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తెచ్చింది
కూటమివన్నీ అబద్ధపు ప్రచారాలే
ప్రజలకు వాస్తవాలు తెలియాలి
నిజంగా సర్కారు వద్ద డబ్బుల్లేకపోతే జోలెపట్టి తెచ్చి ఇస్తాం
మెడికల్ కాలేజీల విషయంలో వైఎస్ జగన్‌కే మద్దతు
కోటి సంతకాల సేకరణలో భాగస్తులమవుతాం
రాబోయే రోజుల్లో 110 నియోజకవర్గాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు
మేధోమథన సదస్సులో వక్తలు
గాందీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తోందని మేధోమథన సదస్సులో పలువురు వక్తలు విమర్శించారు. పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలు కట్టబెట్టేందుకు జారీ చేసిన జీవోను తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం ప్రభుత్వం రంగంలోనే నడపాలని పట్టుబట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో శనివారం జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో మేధోమథన సదస్సు జరిగింది.
ఈ సదస్సులో పలువురు వక్తలు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమికి సహకరించిన ఎన్‌ఆర్‌ఐలు, కార్పొరేట్లు, తమకు కావాల్సిన వారికి మెడికల్ కళాశాలలను కట్టబెట్టేందుకు లోపభూయిష్టమైన పీపీపీ విధానం ముందుకు తెచ్చిందని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణకు డబ్బులు లేవని సర్కారు కుంటి సాకులు చెబుతోందని, వాస్తవంగా డబ్బులు లేకపోతే తాము జోలెపట్టి డబ్బులు అడిగి ప్రభుత్వానికి ఇస్తామని, వైద్య కళాశాలలు ప్రైవేటుపరం చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు.
ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే మహోద్యమం తప్పదని హెచ్చరించారు. రాబోయే రెండు నెలల్లో సర్కారు తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 110 నియోజకవర్గాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల విషయంలో అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు వివరించి ప్రభుత్వ కుట్రలు బహిర్గతం చేస్తామన్నారు.
వాస్తవాలు వివరించేందుకే సదస్సు..
‘‘వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించారు. వీటిలో ఐదు కళాశాలలు వైఎస్సార్‌సీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయి. మరో రెండు కూడా పూర్తవగా, ఎన్నికల తర్వాత ఒక కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మరో కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా కూటమి ప్రభుత్వం వద్దని ఎన్‌ఎంసీకి లేఖ రాసింది. మరో రెండు అడ్మిషన్లకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి.
కూటమి నేతలు మెడికల్ కాలేజీలకు జీవోలు లేవని, అసలు నిర్మాణం జరగలేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ప్రజలకు వాస్తవాలు వివరించేందుకే మేధోమథన సదస్సు నిర్వహించాం. ఈ విషయంలో వైఎస్ జగన్‌కే మా మద్దతు. ఆయనను అందరూ అభినందించి తీరాల్సిందే. కమీషన్లకు ఆశపడి చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ పీపీపీపై మోజు పెంచుకున్నారు. సర్కారు తీరువల్ల ఏటా 2,500 మంది ఏపీ విద్యార్థులు నష్టపోతారు. హోమంత్రి అనిత తన శాఖ పనిని వదిలేసి మెడికల్ కాలేజీలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అసంబద్ధం.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మేమూ భాగస్వాములం అవుతాం.’’ అని వక్తలు స్పష్టం చేశారు. ఈ మేరకు తీర్మానం చేశారు. అనంతరం మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఒక్కొక్కటి చదివి వినిపించారు. స
దస్సులో వైఎస్సార్‌సీపీ నాయకురాలు మంచా నాగమల్లేశ్వరి, వైఎస్సార్‌సీపీ వైద్యవిభాగం ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు అంబటి నాగరాధాకృష్ణ, న్యాయవాది సాయిరామ్, రిటైర్డ్ జడ్జి జయసూర్య, ముస్లిం లీగ్ నాయకులు బషీర్ అహ్మద్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.