
విద్యుత్ ఒప్పందాలకు కూటమి ప్రభుత్వం, ఏపీఈఆర్‌సీ ఏకపక్ష ఆమోదం
అనవసర కొనుగోలు ఒప్పందాలతో ప్రజలపై భారం
ఏపీఈఆర్సీ చైర్మన్, సభ్యుల నియామకంలో చట్టాల ఉల్లంఘన
విద్యుత్ రంగంలో పరిణామాలపై సదస్సులో మండిపడ్డ మేధావులు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)ని చెప్పుచేతల్లో పెటు్టకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు విద్యుత్‌రంగ నిపుణులు, మేధావులు మండిపడ్డారు. విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో మంగళవారం థింక్4 ఏపీ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్కరణలు–ప్రభావాలు–ప్రత్యామ్నాయాలు అనే అంశంపై సదస్సు జరిగింది. శాతావాహన కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సాంబిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో విద్యుత్ రంగ పరిస్థితిని విశ్లేషించారు. ప్రభుత్వ వైఖరితో విద్యుత్ వినియోగదారులపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీఈఆర్‌సీపై ప్రభుత్వం ఒత్తిడి
విద్యుత్‌రంగ నిపుణుడు ఎం.వేణుగోపాలరావు మాట్లాడుతూ ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గానీ, సభ్యులుగానీ పదవీ విరమణ చేయడానికి ఆరునెలల ముందే కొత్తవారి నియామకానికి కమిటీ వేయాలని చెప్పారు. గతేడాది చైర్మన్, ఈ ఏడాది సభ్యుడు పదవీ విరమణ చేస్తే ఇంతవరకు కమిటీ వేయకపోవడాన్ని తప్పుబట్టారు. విద్యుత్ రంగంలో తీసుకొచి్చన సంస్కరణలు.. కార్పొరేట్ రంగానికి ఎలా దోచిపెట్టాలి, కమీషన్లు ఎలా పంచుకోవాలనే విధంగానే ఉన్నాయని విమర్శించారు.
కావాల్సిన వారితో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటూ వినియోగదారులపై విపరీతమైన భారాలు మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2024–25లో 14,500 మిలియన్ యూనిట్లు (ఎంయూ) విద్యుత్ మిగిలిందన్నారు. ఇంకా సెకీ, యాక్సిస్, సెంబ్‌కార్ప్ పీపీఏలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వీటివల్ల థర్మల్ ఉత్పత్తి నిలిపేయడంతో ఫిక్స్‌డ్ చార్జీల రూపంలో వేలకోట్లు చెల్లించడంతో వినియోగదారులపై ఎఫ్‌పీపీసీఏల భారం మోపాల్సి ఉంటుందన్నారు.
యాక్సిస్ పవర్‌తో 2018లో గత టీడీపీ హయాంలో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. గతంలో డిస్కంలు యూనిట్ విద్యుత్‌ను రూ.3.30కి కొనేందుకు చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన ఏపీఈఆర్‌సీ.. మళ్లీ రూ.4.60కి ఎక్కువ ధరకు కొనేందుకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఏపీఈఆర్‌సీపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని విమర్శించారు.
స్మార్ట్ మీటర్లతో ప్రజలకు ఉపయోగం లేదు
ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ సభ్యుడు శ్రీకుమార్ మాట్లాడుతూ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. స్మార్ట్ మీటర్లను ప్రీపెయిడ్ మీటర్లుగా మార్చేందుకు అనేక రాష్ట్రాలు ఒప్పుకోలేదన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ఉండాల్సిన సంస్కరణలు, వారిపై భారం మోపేలా ఉన్నాయని చెప్పారు. సంస్కరణలకు ముందు విద్యుత్ రంగం మొత్తం ప్రభుత్వరంగంలో ఉండగా.. సంస్కరణల తర్వాత 50 శాతానికిపైగా ప్రైవేట్ రంగంలోకి వెళ్లిందని తెలిపారు.
పునరుత్పాదక విద్యుత్‌లో 95 శాతం ప్రైవేట్ రంగంలోనే ఉందన్నారు. పదేళ్ల కిందట పునరుత్పాదక విద్యుత్ ధర ఎక్కువగా ఉందని చెప్పారు. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు చిన్నవి పెట్టాలని సూచించారు. వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ అందించాలంటే విద్యుత్ ఉత్పత్తి ధర తగ్గించాలని, విద్యుత్ పరికరాలకు అయ్యే ఖర్చు తగ్గించాలని చెప్పారు. డిస్కమ్‌లలో ఫిర్యాదులకు గ్రీవెన్స్ ఫోరాన్ని ఎక్కువమంది ఉపయోగించుకునేలా చూడాలన్నారు.
లీజు పేరుతో వేల ఎకరాలు లాక్కుంటున్నారు
విద్యుత్‌రంగ నిపుణుడు బి.తులసీదాస్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాలను ఉల్లంఘించి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు పెడుతున్నారని చెప్పారు. హుకుంపేట మండలంలో గిరిజనులు ప్రతిఘటించడంతో కంపెనీ ప్రతినిధులు వెళ్లిపోయారని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో సోలార్ ప్లాంట్లకు ప్రజల నుంచి లీజు పేరుతో వేల ఎకరాలు లాక్కుంటున్నారని చెప్పారు.
ఒక్కసారి తీసుకున్న తరువాత ఆ భూములను రైతులు ఏమీ చేయలేరని ఆయన తెలిపారు. ఈ సదస్సులో ఏపీ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు, కారి్మక నాయకుడు వై.రాము, విశ్రాంత ఎస్‌ఈ పున్నారావు, విద్యుత్ ఉద్యోగులు, కారి్మకు లు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.