Badvel Bypoll: బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం..

Election Officials All set For Byelections Badvel Bypoll - Sakshi

వంద శాతం పోలింగ్‌ నిర్వహణకు అధికారుల చర్యలు 

2019 ఎన్నికల్లో 77.64 శాతం పోలింగ్‌ నమోదు 

ఈసారి ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంపునకు చైతన్య కార్యక్రమాలు 

ఇప్పటికే బద్వేలుకు చేరుకున్న పోలీసు యంత్రాంగం

సాక్షి, కడప: బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అందుకు సంబంధించి పోలింగ్‌ సామగ్రి మొదలుకొని బారికేడ్ల ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. అయితే ప్రజాప్రతినిధుల ఎన్నికలో కీలక భాగస్వామ్యం ఓటరుదే కనుక ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు కూడా బద్వేలు ఎన్నికల్లో ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నాయి. 2019 ఎన్నికల కంటే కూడా ఈసారి అధికంగా ఓటింగ్‌ శాతం నమోదయ్యేలా అధికారులు ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో 100 శాతం పోలింగ్‌ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు.  

ఓటర్లలో చైతన్యం తెస్తున్న అధికారులు 
బద్వేలు అసెంబ్లీకి ఉప ఎన్నిక నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అందుకోసం కళాజాత ద్వారా పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, గోపవరం, కాశినాయన, కలసపాడు ఇలా అన్ని మండలాల్లోనూ కళా రూపాల ద్వారా ఓటు విలువ తెలియజేస్తున్నారు. ఓటే వజ్రాయుధం కనుక ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.  

2019లో 77.64 శాతం పోలింగ్‌ 
2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 77.64 శాతం పోలింగ్‌ నమోదైంది. అప్పట్లో 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 77,466 మంది, 81,394 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 77.64 శాతం నమోదైంది. ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 22 మంది ఉన్నారు.   

పోలింగ్‌కు సమాయత్తం 
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి శనివారం జరిగే పోలింగ్‌కు అధికారులు సమాయత్తమవుతున్నారు. అందుకోసం ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. ఇప్పటికే ఈవీఎం, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రి బద్వేలుకు తరలించారు. శుక్రవారం ఉద యం నుంచి ఎన్నికల సామగ్రిని సంబంధిత పోలింగ్‌ అధికారులకు అందజేసి తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేలా చర్యలు చేపట్టారు. ఎన్నికలకు విధులు కేటాయించిన పోలీసు యంత్రాంగమంతా బద్వేలు చేరుకుంది. ప్రశాంత పోలింగ్‌కు అటు పోలీసు అధికారులతోపాటు ఇటు ఎన్నికల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు: కలెక్టర్‌ వి.విజయరామరాజు 
బద్వేలు అర్బన్‌: ఉప ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.విజయరామరాజు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్, కౌంటింగ్‌ కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) గౌతమి, జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) సాయికాంత్‌వర్మ, జాయింట్‌ కలెక్టర్‌ (హౌసింగ్‌) ధ్యానచంద్ర, ఉప ఎన్నిక రిటర్నింగ్‌ అధికారి కేతన్‌గార్గ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని పనులు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో నిర్దేశించిన సమయానికి సామగ్రి అంతా పంపిణీ అయ్యేలా చూడాలని కోరారు. అలాగే పరిసర ప్రాంతాల్లో ఎక్కడా చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీటి సౌకర్యం, భోజన ఏర్పాట్లు, శానిటేషన్‌ తదితర అంశాలపై సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం ఉప ఎన్నికల స్ట్రాంగ్‌రూమ్‌లను, వస్తు సామగ్రిని పరిశీలించి సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు, సహాయ రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరెడ్డి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ మహేశ్వర్‌రెడ్డి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సౌభాగ్యలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్, తహసీల్దార్లు మధుసూదన్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌
బద్వేలు అర్బన్‌: ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉంటూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ సిబ్బందికి సూచించారు. ఎన్నికల బందోబస్తుకు వచ్చిన సిబ్బందితో గురువారం స్థానిక అర్బన్‌ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ బూత్‌లోకి ఓటు వేసే వ్యక్తులు తప్ప ఇతరులు రాకుండా చూడాలని అన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంచినీళ్ల బాటిళ్లు, ఇంకు సీసాలు, బాల్‌పెన్నులు, మొబైల్‌ ఫోన్లు మొదలైన వాటిని పోలింగ్‌ బూత్‌లలోకి అనుమతించకూడదని తెలిపారు. పోలింగ్‌ బూత్‌ నుంచి 100 గజాల లోపు జనసందోహం లేకుండా చూసుకోవాలని కోరారు.

ఓటుహక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లు ముఖ్యంగా మహిళలు, వృద్ధుల పట్ల మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. జిల్లా సరిహద్దుల్లో 23 చెక్‌పోస్టులు, నియోజకవర్గ సరిహద్దుల్లో 14 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఒక్కో చెక్‌పోస్టులో పది మందిని నియమించామని తెలిపారు.  ఎన్నికలు పూర్తయ్యేంత వరకు హోటళ్లు, లాడ్జిలు, ఫంక్షన్‌ హాళ్లను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ దేవప్రసాద్, డీఎస్పీలు శ్రీనివాసులు, సుధాకర్, రవికుమార్, విజయకుమార్, సీఐలు, ఎస్‌ఐలు, సీఆర్‌పీ, సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్‌ భద్రత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top