గూడేనికి కొత్త గుర్తింపు

Development Benefits To Bavikadipalle village Andhra Pradesh - Sakshi

ఊరూ పేరులేని మారుమూల ప్రాంతంలోని గిరిజనుల జీవితాల్లో వెలుగు

దారికూడా లేని బావికాడిపల్లెకు అభివృద్ధి ఫలాలు

ఆధార్, ఓటరు కార్డులతోపాటు రేషన్‌ కూడా!

ఎస్టీలకు ప్రత్యేకంగా కమిషన్‌ ఏర్పాటు ఫలితం

గిరిజన సమస్యలపై స్పందిస్తున్న యంత్రాంగం

సత్ఫలితాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం 

యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి: ‘‘అది.. రెండు నెలల క్రితం దాకా ఊరూ పేరూ లేని ఓ మూరుమూల గూడెం! అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం బావికాడిపల్లె పంచాయతీ శివారులో 40 మంది యానాదులు దశాబ్దాలుగా గుడిసెల్లో జీవిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మారలేదు! ప్రభుత్వ పథకాలేవీ దరి చేరలేదు! ఇప్పుడు రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చొరవతో ఆ ప్రాంతంలో అభివృద్ధి కుసుమాలు వికసిస్తున్నాయి.

తుప్పలను తొలగించి పారిశుధ్య పనులు చేపట్టడంతో ఇన్నాళ్లూ రవాణా సదుపాయం లేని ప్రాంతానికి దారి ఏర్పడింది. తాగునీటి కోసం మంచినీటి బోరు కూడా తవ్వారు. ఏ ఆధారంలేని వారికి ఇప్పుడు ఆధార్‌ కార్డు వచ్చింది. దీంతో ఓటు హక్కు దక్కింది. రేషన్‌ కార్డులూ రెడీ అవుతున్నాయి. ఇదంతా ‘జగనన్న ఎస్టీ కాలనీ’లో కేవలం రెండు నెలల్లోనే జరిగిన పురోగతి. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో మంచి ఫలితాలు సాకారమవుతున్నాయి.

వేర్వేరు కమిషన్ల ఏర్పాటు..
ఎస్సీ ఎస్టీలకు సంబంధించి భిన్న స్థితిగతులు, సమస్యలు ఉంటాయి. గతంలో వారిని ఒకే కమిషన్‌ పరిధిలో కొనసాగించడంతో సత్వర న్యాయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే కుంభ రవిబాబు 2021 మార్చి 4న నియమితులయ్యారు.

రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) కమిషన్‌ చైర్మన్‌గా న్యాయవాది, దళిత ఉద్యమ నాయకుడైన మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ను  2021 ఆగస్టు 24న ప్రభుత్వం నియమించింది. ఈ రెండు కమిషన్లు ఎప్పటికప్పుడు ఎస్సీ ఎస్టీల సమస్యలపై స్పందిస్తూ న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.

ఎస్టీ కమిషన్‌ పనితీరులో మైలు రాళ్లు..
► కలెక్టరేట్లలో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ఎస్టీ కమిషన్‌ ఆరా తీస్తోంది.

► విశ్వవిద్యాలయాలను సందర్శించి విద్యార్థులు, పరిశోధకుల అడ్మిషన్లతోపాటు టీచింగ్, నాన్‌ టీచింగ్, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ కచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వానికి నివేదించింది.

► శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది.

► ప్రభుత్వ శాఖల్లో నియామకాలు, పదోన్నతులు, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, గిరిజనులకు భూమి పట్టాల (ఆర్‌ఓఎఫ్‌ఆర్, డీ పట్టా) పంపిణీపై ప్రభుత్వానికి నివేదించింది. 

► గిరిజనులపై అఘాయిత్యాలు, భూ సమస్యలు, సర్వీసు వ్యవహారాలపై విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదించింది.

► గిరిజన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తెచ్చింది.

► కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు పెద్ద తండ, మాన్‌సింగ్‌ తండా, మత్రియ తండా తదితర తండాల్లో పర్యటించి కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదించింది. కృష్ణా నది నుంచి పైపులైను ద్వారా నేరుగా మంచినీరు అందించేలా ప్రతిపాదించింది. 

మారుమూల ప్రాంతాలకూ ప్రయోజనం
సీఎం జగన్‌ ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను నియమించి గిరిజనులకు ఎంతో మేలు చేశారు. గిరిజనులకు ఎక్కడ సమస్య తలెత్తినా కమిషన్‌ అక్కడికి వెళుతోంది. సమస్యలను గుర్తించి పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు సైతం విద్య, వైద్యం, సంక్షేమ పథకాలను అందించేలా సీఎం జగన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
–వడిత్యా శంకర్‌ నాయక్, ఏపీ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు

నీటి తిప్పలు తీర్చారు
గతంలో మా ప్రాంతానికి కనీసం మంచినీటి సదుపాయం కూడా ఉండేది కాదు. దూరంగా ఉన్న తోటల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్లం. పనికి వెళితేనే అక్కడి రైతులు నీరు ఇచ్చేవారు. అధికారులు మా గ్రామాన్ని సందర్శించి బోరు వేయడంతో నీటి తిప్పలు తీరాయి. 
–ఎం.సరోజమ్మ, జగనన్న ఎస్టీ కాలనీ, బావికాడపల్లె గ్రామం

తుప్పలు తొలగించి రహదారి సౌకర్యం
మార్గమే లేని మా ప్రాంతానికి తుప్పలు తొలగించి రహదారి సౌకర్యం కల్పించారు. త్వరలో పక్కా రోడ్డు వేస్తామన్నారు. పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య పనులు చేశారు. బడికెళ్లే పిల్లల కోసం ఆటో ఏర్పాటు చేశారు. మాకు ఆధార్, ఓటర్లుగా నమోదు చేయడంతోపాటు రేషన్‌ కార్డులు, ఇళ్లు ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు.
–టి.నాగరాజు, జగనన్న ఎస్టీ కాలనీ, బావికాడపల్లె గ్రామం

జగనన్న ఎస్టీ కాలనీగా నామకరణం
గతంలో యానాదుల కాలనీకి పేరు కూడా లేదు. గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు జగనన్న ఎస్టీ కాలనీగా బోర్డు ఏర్పాటు చేశాం. వారికి అవసరమైన వసతులు కల్పించడంతోపాటు సమస్యలు పరిష్కరించేలా శ్రద్ధ వహిస్తున్నాం. 
–గంగాధర్, బావికాడపల్లె పంచాయతీ కార్యదర్శి

బాక్స్‌లో హైలెట్‌ చేయగలరు
► జగనన్న ఎస్టీ కాలనీలో యానాదుల సంఖ్య 40 
► గతంలో ఇద్దరికి మాత్రమే ఆధార్‌ ఉండగా ప్రత్యేక క్యాంపుతో 30 మందికి ఆధార్‌ కార్డులిచ్చారు.
► ఇప్పటివరకు ఎవరికీ ఓట్లు లేవు. తాజాగా 21 మందిని (10 మంది మహిళలు, 11 మంది పురుషులు)కి ఓటర్లుగా నమోదు చేశారు.
► ఆధార్‌ కార్డులు రావడంతో కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేశారు.
► పెన్షన్లు కూడా అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 
► ఐదేళ్ల లోపు పిల్లలకు పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ నమోదు చేసి ముగ్గురిని బడిలో చేర్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top