ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న ప్రవేశాలు
ఈ రెండేళ్లలో ఆరు లక్షల మేర తగ్గిన విద్యార్థులు
మండలి సాక్షిగా నిజం ఒప్పుకున్న మంత్రి లోకేశ్
బాబు పాలనలో కొరవడిన మౌలిక సదుపాయాలు
వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలకు మంగళం
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం సడలుతోంది. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య క్రమేపి పడిపోతోంది. ఇక ప్రహరీ కూలి విద్యార్థులు మృత్యువాత పడుతున్న దుర్ఘటనలు కూడా లేకపోలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంతో పోలిస్తే బాబు రెండేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య సుమారు ఆరు లక్షల మేర తగ్గినట్టు శాసన మండలి సాక్షిగా విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఒప్పుకోవడం గమనించదగ్గ అంశం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల తగ్గుదలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.
విద్యార్థుల సంఖ్య తగ్గుదల ఇలా ...
‘యూడైస్’ విద్యా సమాచార వ్యవస్థ వివరాల మేరకు 2023–24లో వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,031 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలల వాటా 46.33 శాతంగా తేలింది. 2025–26లో చంద్రబాబు పాలనలో 34,92,791కి పడిపోయింది. అంటే 41.40 శాతానికి తగ్గింది. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 34,61,612 మాత్రమే. దీనిని 2023–24తో పోల్చి చూడగా, మొత్తం 5,88,419 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. 2023–24లో 52 శాతం ఉన్న ప్రైవేటు పాఠశాలల వాటా ప్రస్తుతం 56.57 శాతానికి పెరిగింది.
విద్యారంగాన్ని పటిష్టం చేసిన వైఎస్ జగన్...
వైఎస్ జగన్ హయాంలో నాడు–నేడు కార్యక్రమం అమలు చేసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. మౌలిక వసతులు సమకూర్చారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని బలోపేతం చేశారు. డిజిటల్ తరగతులను అందుబాటులోకి తెచ్చారు. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఇంగ్లిష్ మీడియం, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, ట్యాబ్‌లు పంపిణీ చేశారు. పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాంతోపాటు జగనన్న కానుకలో భాగంగా విద్యార్థి కిట్‌లను అందించారు. అమ్మ ఒడి పథకాన్ని అందించి పేద విద్యార్థులను పాఠశాలలకు రప్పించారు. అయితే వీటన్నింటికి చంద్రబాబు ఈ రెండేళ్లలోనే మంగళం పాడేశారు. ఫలితంగానే విద్యాప్రమాణాలతోపాటు, విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతుందనే ఆరోపణలు ఉపాధ్యాయ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.


