తండ్రి ఆస్తిలో కుమార్తెలకూ సమాన హక్కు.. తేల్చి చెప్పిన హైకోర్టు

Daughters have equal rights in fathers property - Sakshi

హిందూ వారసత్వ సవరణ చట్టం ‘పూర్వం’ నుంచే వర్తిస్తుంది 

తండ్రి మరణించారా? లేదా? అన్న దానితో సంబంధం లేదు 

వినీత శర్మ కేసులో కూడా సుప్రీం కోర్టు ఇదే చెప్పింది 

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి తీర్పు 

సాక్షి, అమరావతి : హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం కూతురు పుట్టుకతోనే తండ్రి ఆస్తిలో సమాన వారసత్వ హక్కుదారు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. సవరణ చట్టం అమల్లోకి వచ్చిన 2005 సెప్టెంబర్‌ 9వ తేదీ నాటికి తండ్రి మరణించారా? లేదా? అన్న దాంతో సంబంధం లేకుండా హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) ఆస్తుల విషయంలో కుమార్తెలకు సైతం సమాన హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది.

ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు వినీత శర్మ కేసులో స్పష్టంగా చెప్పిందని, సవరణ చట్టం అమల్లోకి వచ్చే నాటికి తండ్రి బతికి ఉండాల్సిన అవసరం లేదని తెలిపిందని వివరించింది. తండ్రి ఉమ్మడి ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా హక్కును సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత నుంచి మాత్రమే పరిమితం చేయలేమని తేల్చి చెప్పింది.

ఆ చట్టం నిబంధనలు పూర్వం (రెట్రోస్పెక్టివ్‌) నుంచే వర్తిస్తాయని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదంది. హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం తుది తీర్పునివ్వాలని అభ్యర్థి స్తూ తెనాలి కోర్టును ఆశ్రయించాలని ఓ కేసులో పిటిషనర్లుగా ఉన్న ముగ్గురు మహిళలకు హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి ఈ నెల 13న తీర్పు వెలువరించారు.  

తండ్రి ఆస్తిలో వాటా కోసం కుమార్తెల పోరాటం
తమ తండ్రి తురగా రామమూర్తికి చెందిన ఉమ్మడి ఆస్తిలో వాటా ఇచ్చేందుకు సోదరులు, సోదరీమణులు తిరస్కరిస్తున్నారంటూ ఆనందరావు అనే వ్యక్తి 1986లో తెనాలి అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో దావా వేశారు. ఇదే సమయంలో హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం తమ తండ్రి ఆస్తిలో తమకు సమాన వాటా ఉందని, ఆ మేర తీర్పునివ్వాలని కోరుతూ రామమూర్తి కుమార్తెలు సీతారావమ్మ మరో ఇద్దరు ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు.

విచారణ జరిపిన కోర్టు 2009లో వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ఉత్తర్వు­లను సమీక్షించాలంటూ రామమూర్తి కుమారుల్లో కొందరు, వారి వారసులు తెనాలి కోర్టులో అనుబంధ పిటిషన్‌ వేశారు. విచారణ జరిపిన కోర్టు 2010లో కుమారులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వారసత్వ సవరణ చట్టం ఆస్తి వాటాల విషయంలో కుమార్తెలకు వర్తించదని కోర్టు చెప్పింది.

సవరణ చట్టాన్ని పూర్వం నుంచి వర్తింపజేయడానికి వీల్లేదని చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ముగ్గురు కుమార్తెలు అదే ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి తుది విచారణ జరిపారు. పిటిషనర్ల తరపున చింతలపాటి పాణినీ సోమ­యాజి వాదనలు వినిపించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top