పక్కాగా వరద నియంత్రణ | CWC Letter To States Announcing Reservoirs To Monitor Flood Flow | Sakshi
Sakshi News home page

పక్కాగా వరద నియంత్రణ

Apr 30 2021 3:44 AM | Updated on Apr 30 2021 3:45 AM

CWC Letter To States Announcing Reservoirs To Monitor Flood Flow - Sakshi

సాక్షి, అమరావతి: నదీజలాలకు సంబంధించి దిగువ రాష్ట్రాలు ఇబ్బందులు పడకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. నదీజలాలను రాష్ట్రాలకు కేటాయించిన దామాషా మేరకు.. కాలానుగుణంగా విడుదల చేయాలని గతంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రతి 15 రోజులకు ఒకసారి పరిస్థితిని సమీక్షించి అవసరాల మేరకు నీటి విడుదలకు సంబంధించి ఏర్పాటు చేయాలని సూచించింది. దీనికి స్పందించిన కేంద్రం.. దేశవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. దేశంలో అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లోను (బేసిన్‌లలోను).. బేసిన్‌ల వారీగా రిజర్వాయర్లను గుర్తించి, వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకు ప్రవాహాలు, నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలించి.. దిగువకు విడుదల చేసేలా చూడటం ద్వారా వరద ముప్పు తప్పించాలని కేంద్ర జల్‌శక్తిశాఖ కేంద్ర జలసంఘాన్ని (సీడబ్ల్యూసీని) ఆదేశించింది.

దీంతో బేసిన్‌ల వారీగా తాము పరిశీలించే రిజర్వాయర్లను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు గురువారం సీడబ్ల్యూసీ లేఖ రాసింది. కృష్ణా బేసిన్‌ పరిధిలో నాలుగు రాష్ట్రాల్లోని 19 రిజర్వాయర్లు, బ్యారేజీల్లో ప్రవాహాలను పరిశీలిస్తామని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాలకు లేఖ రాసింది. కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్లలోకి గత 30 నుంచి 40 ఏళ్లలో వచ్చిన వరద ప్రవాహం, వినియోగం, దిగువకు విడుదల చేసిన ప్రవాహం, దిగువకు విడుదల చేసే నదీ ప్రవాహ సామర్థ్యం తదితర వివరాలను అందజేయాలని కోరింది. వీటిని బేసిన్‌ ప్లానింగ్‌ మేనేజ్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (బీపీఎంవో) ద్వారా అధ్యయనం చేయించి.. రిజర్వాయర్ల నిర్వహణ నియమాలను రూపొందిస్తామని తెలిపింది. దామోదర్‌ వ్యాలీ తరహాలో బేసిన్‌ల వారీగా ఫ్లడ్‌ క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ (ఎఫ్‌సీఎంటీ)లు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా వరద నియంత్రణ చర్యలు చేపడతామని పేర్కొంది. గోదావరి బేసిన్‌ పరిధిలోని రాష్ట్రాలకు కూడా ఇదే రీతిలో సమాచారం ఇచ్చింది. 

దిగువ రాష్ట్రాలకు ప్రయోజనం
కృష్ణానది బేసిన్‌లో జలాశయాల్లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరాకగానీ మహారాష్ట్ర, కర్ణాటక వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయడం లేదు. గరిష్టంగా వరదను ఒకేసారి విడుదల చేయడం వల్ల తెలుగు రాష్ట్రాలు వరద బారిన పడుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటున్న ఏపీ, తెలంగాణ.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇకమీదట ఎఫ్‌సీఎంటీ నేతృత్వంలో రిజర్వాయర్లను నిర్వహించడం వల్ల ఈ సమస్యలు తీరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రయోజనం చేకూరుతుందని నీటిపారుదలరంగ నిపుణులు చెబుతున్నారు.

కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహాన్ని సీడబ్ల్యూసీ పర్యవేక్షించే రిజర్వాయర్లు
రాష్ట్రం                     రిజర్వాయర్‌
మహారాష్ట్ర                 1.కోయినా
                                  2.వర్ణ
                                 3.ఉజ్జయిని
                                 4.నీరా

కర్ణాటక                    1.హిప్పర్గి బ్యారేజీ
                                2.ఆలమట్టి
                                3.హిడ్కల్‌
                               4.మలప్రభ
                               5.నారాయణపూర్‌
                               6.అప్పర్‌ తుంగ
                               7.భద్ర
                               8.తుంగభద్ర

ఆంధ్రప్రదేశ్‌         1.సుంకేశుల బ్యారేజీ
                               2.శ్రీశైలం
                               3.పులిచింతల
                               4.ప్రకాశం బ్యారేజీ

తెలంగాణ             1.జూరాల
                               2.నాగార్జునసాగర్‌
                               3.మూసీ      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement