మత్స్యకార సొసైటీ ఎన్నిక వాయిదాపై ఆందోళన | Concern over postponement of Fishermens Society elections | Sakshi
Sakshi News home page

మత్స్యకార సొసైటీ ఎన్నిక వాయిదాపై ఆందోళన

Oct 7 2026 4:40 AM | Updated on Oct 7 2026 4:40 AM

Concern over postponement of Fishermens Society elections

పెదతీనార్ల సొసైటీ ఎన్నిక వాయిదా వేయడంతో రోడ్డుపై బైఠాయించిన మత్స్యకారులు, గ్రామస్తులు

వైఎస్సార్‌సీపీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి జాన్‌ 

చివరిక్షణంలో ఎన్నికను వాయిదా వేయించిన హోంమంత్రి 

కూటమి బలపరిచిన అభ్యర్థి ఓడిపోతారనే భయంతోనే వాయిదా వేయించారని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజం 

రోడ్డుపై బైఠాయించిన పెదతీనార్ల మత్స్యకారులు, గ్రామస్తులు 

నక్కపల్లి:  పెదతీనార్ల మత్స్యకార సొసైటీ ఎన్నికను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మత్స్యకారులు, గ్రామస్తులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఓడిపోతామనే భయంతోనే పెదతీనార్ల మత్స్యకార సొసైటీ ఎన్నికను వాయిదా వేయించారంటూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై గ్రామస్తులు మండిపడ్డారు. దాదాపు మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పెదతీనార్ల మెరైన్‌ ఫిషర్‌మెన్‌న్‌సొసైటీకి ప్రభుత్వం మంగళవారం ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో 547 మంది సభ్యులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో మైల­పలి జాన్‌ అధ్యక్షుడిగా బరిలోకి దిగారు. 

సొసైటీ సభ్యులంతా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు వైపే ఉన్నారు. చేతులెత్తే పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో కూటమి బలపరిచిన అభ్యర్థులు ఓడిపోతారనే భయం ఉంది. ఈ పరిస్థితిని గమనించిన హోంమంత్రి వంగలపూడి అనిత ఓటమి భయంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి గంట ముందు ఎన్నికను వాయిదా వేయించారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆరోపించారు. మంత్రి అండదండలతో కూటమి నాయకులు ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారన్నారు. వాయిదా విషయం తెలుసుకున్న ఆయన, గ్రామంలోకి వెళ్లి వందలాది మంది మత్స్యకారులతో కలిసి ధర్నాకు దిగారు. 

రోడ్డుపై మూడు గంటల పాటు బైఠాయించారు. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ఎన్నిక వాయిదా వేసినట్లు నోటీసులో పేర్కొన్నారన్నారు. ముందుగా తెలియపరచకుండా అప్పటికప్పుడు వాయిదా వేయడం సిగ్గుచేటన్నారు. ఒక గ్రామంలో శాంతి భద్రతలను అదుపుచేయలేని స్థితిలో హోంమంత్రి ఉండటం దారుణమన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మత్స్యకారుల సత్తా చూపిస్తామన్నారు. ఆందోళనలో అభ్యర్థి జాన్, నాయకులు, ముసలయ్య, కొర్లయ్య, తాతారావు పాల్గొన్నారు. త్వరలోనే ఎన్నిక నిర్వహించేందుకు కృషి చేస్తామని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement