సచివాలయాల సేవలకు కోత | 4 services removed from the Secretariat Services Portal | Sakshi
Sakshi News home page

సచివాలయాల సేవలకు కోత

Oct 7 2026 4:29 AM | Updated on Oct 7 2026 4:29 AM

4 services removed from the Secretariat Services Portal

4 సేవలు సచివాలయ సేవలు పోర్టల్‌ నుంచి తొలగింపు  

కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల రీ ఇష్యూ ఉండదు  

భూముల పాస్‌బుక్‌ ప్రింటింగ్, నీటితీరువా చెల్లింపులు కూడా..  

ఈ సేవలు విద్యార్థులు, రైతులు, సామాన్యులకు ఎంతో అవసరం  

సచివాలయాలతోపాటు మీసేవ కేంద్రాల్లోనూ ఆ సేవలు బంద్‌  

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను మరింత నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు సర్కారు చర్యలు  

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై కక్షగట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం వాటి ద్వారా ప్రజలకందే సేవల్లో కోతలు మొదలుపెట్టింది. విద్యార్థులు, రైతులకు ఎక్కువ అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పట్టదారు పాస్‌పుస్తకాలు, నీటితీరువా చెల్లింపు సేవల్ని సచివాలయాల నుంచి దూరం చేసింది. రెవెన్యూశాఖకు సంబంధించి కీలకమైన ఈ నాలుగు సేవలు ప్రజలకు ఎంతో అవసరం. గతంలో ప్రభుత్వాఫీసుల్లో చిన్నపని పడినా గ్రామీణ ప్రాంత ప్రజలు తమ రోజువారీ పనులన్నీ మానుకుని మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. 

ప్రజలకు ఈ ఇబ్బందుల్ని తప్పించి వారి గ్రామాల్లోనే, ఇళ్లవద్దే సేవలు అందించేందుకు గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2019లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 540కి పైగా ప్రభుత్వ సేవల్ని ఈ సచివాలయాల్లో అందుబాటులో తీసుకొచ్చింది. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలు దాదాపు 10 కోట్ల సేవలను పొందారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ప్రజలకు ప్రతి సందర్భంలోను ఎక్కువ అవసరం పడే  కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల పునఃజారీ (రీ ఇష్యూ), పట్టాదారు పాస్‌బుక్‌ పునఃముద్రణ (రీ ప్రింట్‌), రైతుల నీటితీరువా పన్ను చెల్లింపు సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిగా నిలిపేసింది. 

సచివాలయాలతోపాటు మీ–సేవ కేంద్రాల్లోను ఆ సేవలు లేకుండా చేసింది. విద్యార్థులు, నిరుద్యోగులు, పేదలు చదువులకు, ఉద్యోగాలకు, పథకాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు.. గతంలో తమకు మంజూరైన కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల పునఃజారీకి సచివాలయాల్లో దరఖాస్తు చేసి మళ్లీ తీసుకుంటారు. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఆ సేవల్ని దూరం చేయడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  

ఊళ్లోనే ప్రజలకు సేవలందించే వ్యవస్థను కనుమరుగు చేసేందుకేనా?  
ప్రజలకు సొంత ఊళ్లలోనే ఆయా సేవలను అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను క్రమంగా కనుమరుగు చేసేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలున్నాయి. అందుకే రెండేళ్లుగా సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు, మంత్రులు విషం చిమ్ముతున్నారన్న విమర్శలున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కోసం గత ప్రభుత్వం ఒకేసారి 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడాన్ని అనవసరంగా చేసినట్లు చంద్రబాబు, మంత్రులు నిందలు వేస్తూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రేషనలైజేషన్‌ పేరిట ఒక్కో సచివాలయంలో ఉండే ఉద్యోగుల సంఖ్యను కుదించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందే ప్రభుత్వ సేవలను కూడా దూరం చేస్తున్నారు. ఇలా ఒక్కో సేవను దూరం చేస్తూ.. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. చివరికి ఈ వ్యవస్థనే పూర్తిగా నిర్మూలించేదిశగా చంద్రబాబు ప్రభు­త్వం చర్యలు తీసుకుంటోందన్న విమర్శలున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు సచివాలయాల్లో అందే ప్రభుత్వ సేవల్లో కోతలు విధించిందన్న చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు సచివాలయ ఉద్యోగులను ఇంటింటి ప్రభుత్వ సర్వేలకు, అధికార పార్టీలకు ఉపయోగపడే ఇంటింటికీ స్టిక్కర్లు అంటించే రాజకీయ ప్రచార కార్యక్రమాలకే ఎక్కువగా ఉపయోగించుకుంటున్న తీరును ఉద్యోగులు తీవ్రంగా తప్పుపడుతూ 
ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement