కాలు దువ్విన కోడి పుంజులు

Cock Fight Bettings Started In Andhra Pradesh On Bhogi Fest - Sakshi

భోగి రోజునే మొదలైన పందేలు

వీఐపీ గ్యాలరీలు, ఎంట్రీ పాస్‌లు

క్యూఆర్‌ కోడ్‌ ద్వారా నగదు చెల్లింపులకు ఏర్పాట్లు

బహుమతులుగా కార్లు, బైక్‌లు

గుండాటలకు చెక్‌ పెట్టిన పోలీసులు 

సాక్షి,అమరావతి/కాకినాడ/భీమవర/పెనమలూ­రు: సంక్రాంతి సంబరాల తొలి రోజునే కోడి పందేల జాతర మొదలైంది. భోగి రోజైన శనివారం మొద­లైన ఈ పందేలు మూడు రోజులపాటు నిర్వహించేలా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఊరూ వాడా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేకచోట్ల పందేలు మొదల­య్యాయి.

ఈ సారి భారీ బరుల వద్ద కోడి పందేల్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా నగదు చెల్లింపులకు వీలుగా ఏర్పాట్లు చేశారు. విశాలమైన మైదానాలు, తోటల్లో బరులను ఏర్పాటు చేశారు. భారీ టెంట్లు వేసి కూర్చునేందుకు వీవీఐపీ, వీఐపీ, సాధారణ గ్యాలరీలను సైతం ఏర్పాటు చేశారు. రాత్రి వేళలోనూ పందేలు కొన­సాగేలా బరుల వద్ద  ఫ్లడ్‌ లైట్లను అమర్చారు.

కేరవాన్లు.. స్పెషల్‌ పాస్‌లు
కోడి పందేలకు పెట్టింది పేరైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో భారీ ఏర్పాట్ల నడుమ కోడి పందేలు నిర్వహిస్తున్నారు. కాకినాడ  రూరల్‌ పరిధిలోని వలసపాకలో పందేలు వీక్షించేందుకు పాస్‌లు జారీ చేశారు. కొన్నిచోట్ల పందేల్లో గెలిచిన వారికి బుల్లెట్‌ వాహనం, కారు బహుమతిగా ప్రకటించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో భారీ ఏర్పాట్లతో ఒక్కో కోడి పందెం రూ.లక్షల్లో నిర్వహించారు.

పందేల్లో పాల్గొనే వారికి వీవీఐపీ పాస్‌ ధర రూ.60 వేలు.. వీఐపీ పాస్‌ రూ.40 వేలుగా నిర్ణయించారు. పందేల రాయుళ్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ నగదు చెల్లింపుల సౌకర్యం కల్పించారు. కొన్నిచోట్ల వీవీఐపీల కోసం బరులకు సమీపంలో కేరవాన్లు (బస చేసే వాహనాలు) కూడా ఏర్పాటు చేశారు.

అతిథి మర్యాదలకు లోటు లేకుండా..
పందేలను చూసేందుకు, పందేలు ఒడ్డేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి అభిలాషకు అనుగుణంగా పలుచోట్ల బరుల నిర్వాహకులు అతిథి మర్యాదలు సిద్ధం చేశారు. ప్రత్యేకంగా హోటళ్లు, అతిథి గృహాలు, చేపల చెరువులపై మకాంలను కేటాయించి ప్రత్యేకంగా మాంసాహార వంటకాలు, విదేశీ మద్యంతో అతిథి మర్యాదల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 

‘పశ్చిమ’లో 270 బరులు
పశ్చిమ గోదావరి, జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చిన్నాపెద్దా అన్నీ కలిపి కోడి పందేల బరులు దాదాపు 270 వరకు ఏర్పాటయ్యాయి. ఉండి, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఎక్కువ కోడి పందేలు గెలిచిన వారికి బుల్లెట్‌ మోటార్‌ సైకిల్‌ బహుమతిగా ప్రకటించారు. దుంపగడప బరిలో ఏలూరు జిల్లా తాడినాడకు చెందిన వ్యక్తి 9 పందేలకు గాను 5 పందేలు గెలిచి బుల్లెట్‌ మోటార్‌ సైకిల్‌ బహుమతి అందుకున్నాడు. ఏలూరు జిల్లా పరిధిలోనూ సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి.
పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఈడుపుగల్లులో కోడిపందేల బరి 

‘తూర్పు’ పందేలు డీలా
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందేలు నిర్వహించినప్పటికీ.. గుండాటలను పోలీసులు అడ్డుకోవడంతో జూదరులు డీలా పడ్డారు. తూర్పు గోదావరి, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో దాదాపు 300 చోట్ల కోడి పందేల బరులు వెలిశాయి. గత సంక్రాంతితో పోల్చితే ఈ సారి కోడి పందేలు సాధారణంగా జరిగాయే తప్ప భారీ ఎత్తున ఎక్కడా జరగలేదు. 

ప్రత్యేక వాహనాల్లో రాక
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడి పందేల బరులను సిద్ధం చేశారు. పెనమలూరు, గన్నవరం, మచిలీపట్నం, పామర్రు, ఎన్టీఆర్‌ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన బరుల్లో సంప్రదాయంగా, రైతువారీగా కోడిపందేలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. వారి కోసం బరుల నిర్వాహకులు ప్రత్యేక వసతి సదుపాయాలను సమకూర్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top