బాధితులకు భరోసా.. | AP CM YS Jagan Consoles Vizianagaram Train Accident Victims - Sakshi
Sakshi News home page

బాధితులకు భరోసా..

Published Tue, Oct 31 2023 5:09 AM

CM YS Jagan Consoles Vizianagaram Train Incident Victims - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం/విజయనగరం 
ఫోర్ట్‌ :  విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కలి్పంచారు. విధి వంచనతో పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతున్న వారికి పెద్ద కొడుకులా అండగా నిలిచి వారి కన్నీరు తుడిచి ఓదార్చారు. రైలు ప్రమాదమైనా సరే... రాష్ట్ర పరిధిలో సంభవించటంతో శనివారం రాత్రి నుంచే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది.

సీఎం ఆదేశాలతో స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు విషయం తెలుసుకుంటూ సోమవారం ప్రమాద స్థలానికి బయలుదేరారు. అయితే ట్రాక్‌ పునరుద్ధరణ పనులకు ఆటంకం కలగవచ్చని అధికారులు చెప్పటంతో అక్కడకు వెళ్లకుండా విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ప్రతి ఒక్కరినీ నేరుగా పరామర్శించారు.

మానవీయ దృక్పథంతో స్పందించి పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదం పెద్దదే అయినా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి సహకరించటంతో 24 గంటలు తిరక్కముందే ట్రాక్‌ పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు అధికారులు అనుమతివ్వగలిగామని రైల్వే అధికారులు పేర్కొనటం గమనార్హం. సీఎం సైతం క్షతగాత్రులను, మృతుల కుటుంబీకులను స్వయంగా పరామర్శించి, తాను అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గాయపడిన వారు పూర్తిగా కోలుకునే వరకూ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ధైర్యం చెప్పారు. 

విజయనగరం జిల్లా అలమండ రైల్వేస్టేషన్‌ సమీపంలో కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి రెండు పాసింజర్‌ రైళ్లు ఢీకొనడం తెలిసిందే. విశాఖపట్నం నుంచి బయల్దేరిన విశాఖ–పలాస ప్యాసింజర్‌ రైలును అదే మార్గంలో కొద్ది నిమిషాల వ్యవధిలో బయల్దేరిన విశాఖ–రాయగడ ప్యాసింజర్‌ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైల్వే సిబ్బంది సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు.

50 మంది క్షతగాత్రులయ్యారు. వారిలో 34 మందిని విజయనగరం సర్వజన ఆస్పత్రిలోను, మిగిలిన వారిని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో హుటాహుటిన చేర్చారు. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ, రైల్వే మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా మానవీయ కోణంలో సకాలంలో స్పందించి ఘటన వివరాలను కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేయటమే కాక రాష్ట్రంలో వివిధ శాఖలను అప్పటికప్పుడు అప్రమత్తం చేసి అర్ధరాత్రి వరకూ పరిస్థితిని సమీక్షించారు.

ప్రతి ఒక్కరికీ పరామర్శ.. 
ఆదివారం అర్ధరాత్రి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారిలో స్వల్ప గాయాలైన వారు కొందరు చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 22 మంది బాధితులకు రెండు వార్డుల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి... అక్కడ రైలు దుర్ఘటనకు సంబంధించిన చిత్రాలను చూశారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి బొత్స సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు.

చికిత్స పొందుతున్న బాధితులు ప్రతి ఒక్కరినీ వారి వద్దకు వెళ్లి పరామర్శించారు. వారికి వైద్యసేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాయాలైన వారికి ఇంకా ఏమైనా మెరుగైన వైద్యం అవసరమా అని వైద్యులను అడిగారు. ఎవరికైనా అవసరమైతే ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. ఒక్కపైసా కూడా వారిపై భారం పడకూడదని, పూర్తి ఉచితంగా వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు స్పష్టంగా చెప్పారు. 

ఉదారంగా ఎక్స్‌గ్రేషియా.. 
రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి ప్రకటించారు. క్షతగాత్రుల విషయంలోనూ ఉదారంగా వ్యవహరించారు. స్వల్పగాయాలైన ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. నెలరోజుల కన్నా ఎక్కువ రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స అవసరమైన వారికి.. వైకల్యం కారణంగా ఉపాధి పొందలేని వారికి రూ.5 లక్షల చొప్పున, శాశ్వత వైకల్యం కలిగిన వారికి రూ.10 లక్షల వరకూ ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

దీంతో.. క్షతగాత్రుల్లో ఎవరెవరికి ఎంత ఎక్స్‌గ్రేషియా చెల్లించాలో నిర్ణయించేందుకు డాక్టర్లతో కమిటీ వేసినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి చెప్పారు. ఈ మొత్తాన్ని మంగళవారం మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా అందిస్తామని చెప్పారు. 

సీఎం ఏరియల్‌ సర్వే..
వాస్తవానికి రైళ్లు ఢీకొన్న ప్రమాద స్థలానికి వెళ్లి స్వయంగా పరిశీలించాలని సీఎం జగన్‌ తొలుత నిర్ణయించారు. అయితే, ట్రాక్‌ పునరుద్ధరణ పనులు, మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ దృష్ట్యా సందర్శనను రద్దుచేసుకోవాలని రైల్వే అధికారులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన హెలికాప్టర్‌లో నేరుగా విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాల మైదానానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆసుపత్రిలో క్షతగాత్రులు, మృతుల కుటుంబీకుల  పరామర్శ అనంతరం విశాఖకు తిరిగివెళ్తూ ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ స్పీకర్‌  కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక, ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, బొత్స అప్పలనర్సయ్య, శంభంగి వెంకటచిన అప్పలనాయుడు, జోగారావు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్‌బాబు, రఘురాజు, వరుదు కళ్యాణి, విజయనగరం మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చు లయా యాదవ్, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్, సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు ఉన్నారు. 

ఎవరికైనా అవసరమైతే ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించాలి. ఒక్కపైసా కూడా వారిపై భారం పడకూడదు. పూర్తి ఉచితంగా వైద్యసేవలు అందించాలి. క్షతగాత్రుల్లో కొంతమంది ఇంకా షాక్‌లో ఉన్నారు.. పూర్తిగా కోలుకున్నామని వారు సంతృప్తి వ్యక్తంచేసిన తర్వాతే వారిని ఇళ్లకు పంపించాలి.    – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం..
మృతుడి తండ్రి కన్నీళ్లు తుడిచిన సీఎం జగన్‌ ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురానికి చెందిన లోకో పైలట్‌ సువ్వారి చిరంజీవి మృతిచెందడంతో ఆయన తండ్రి సన్యాసిరావును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్చారు. సీఎంను చూడగానే ఒక్కసారిగా సన్యాసిరావు బోరున విలపించారు. ‘ఒక్కగానొక్క కొడుకు మృతిచెందాడు.. ఈ వయసులో మాకు ఎవరు దిక్కు’.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. సీఎం వెంటనే ఆయన కన్నీళ్లు తుడుస్తూ.. ‘అధైర్య పడొద్దు.. కుటుంబానికి అండగా ఉంటా’మంటూ ఓదార్చారు.  

కుటుంబ సభ్యుడిలా ఓదార్చారు.. 
వైద్యులు బాగా చూస్తున్నారా.. ఏ పనిచేస్తున్నావు.. మీది ఏ గ్రామం... దెబ్బలు ఏమైనా తగిలాయా.. అంటూ కుటుంబ సభ్యుడిలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బాధితులను ఓదార్చారు. వైద్యులు బాగా చూసుకుంటారు, అధైర్య పడొద్దు.. మెరుగైన వైద్య సేవలు అందించమని వైద్యులకు చెప్పానని సీఎం చెప్పారు. విజయనగరం నుంచి విశాఖపట్నం కళాసీ పనికి వెళ్లి వస్తుండగా జరిగిన  ప్రమాదంలో నేను గాయపడ్డాను.     – కొల్లి ఎర్ని ఆంజనేయులు, బురదపాడు గ్రామం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా  

ఆప్యాయంగా పలకరించి.. ఓపిగ్గా అంతా విన్నారు..
డాక్టర్లు బాగా చూసుకుంటారు.. ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. అధైర్య పడొద్దని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు. ఆప్యాయంగా పలకరించి నాకు తగిలిన గాయాలు గురించి అడిగారు. నొప్పులు తగ్గాయా, ఆరోగ్యం ఎలా  ఉందని ప్రశ్నించారు. ఓపిగ్గా నేను చెప్పింది అంతా విన్నారు. తాపీ పనికోసం కొత్తవలస వెళ్లి అక్కడ నుంచి మా గ్రామానికి రైలులో వస్తుండగా ప్రమాదంలో గాయపడ్డాను.     – గదల మహాలక్ష్మినాయుడు, చుక్కవలస గ్రామం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా 

ఎంత ఖర్చయినా భరిస్తామన్నారు.. అది చాలు
ఆరోగ్యం ఎలా ఉంది.. మా తరఫున అవసరమైన సాయాన్ని అందిస్తాం. వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందించాలని వైద్యులకు ఆదేశాలిచ్చామని సీఎం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, వైద్యానికి ఎంత ఖర్చయినా భరిస్తామని చెప్పారు. అది చాలు.      – రెడ్డి రాము, ఎం.అలమండ గ్రామం, దేవరాపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా 

Advertisement
 
Advertisement