వడివడిగా.. అన్నీ పరిశీలిస్తూ

CM Jagan Visit To Polavaram Project - Sakshi

పోలవరంలో సీఎం జగన్‌ పర్యటన

స్పిల్‌వే ఆద్యంతం పరిశీలన

నిర్వాసితులను కలసి ఆదుకుంటామని భరోసా

సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు మెట్రో: పోలవరం పనులన్నీ నిశితంగా పరిశీలిస్తూ.. అధికారులతో సమీక్షిస్తూ.. వినతులు స్వీకరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సోమవారం వడివడిగా సాగింది. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టు డ్యామ్‌ ప్రాంతానికి హెలికాప్టర్‌ ద్వారా చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. 

స్పిల్‌వే బ్రిడ్జి నుంచి ప్రారంభం..
ముందుగా స్పిల్‌వే బ్రిడ్జిపై నుంచి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం స్పిల్‌వే వద్దకు చేరుకుని ఫొటో గ్యాలరీని తిలకించారు. 44వ గేటు పిల్లర్‌ వద్ద ట్రయల్‌ రన్‌  పరిశీలించారు. ప్రాజెక్టు గేట్ల నిర్మాణం, నీటి విడుదల, స్పిల్‌ వే ద్వారా పంపించే నీటి పరిమాణాన్ని ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తరువాత స్పిల్‌వే నుంచి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్దకు చేరుకుని పనుల పురోగతిని గమనించారు. ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న ప్రాంతం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం డ్యామ్‌ వద్ద ఉన్నతాధికారులు, నాయకులతో సమీక్ష చేపట్టారు. సమస్యలు, పనుల తీరుతెన్నులను అంశాలవారీగా ఆరా తీశారు. సుమారు గంటన్నర పాటు సమీక్ష నిర్వహించారు. 

ఏ ఒక్క నిర్వాసితుడికీ అన్యాయం జరగనివ్వం..
పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులుగా మారుతున్న తమను అన్ని విధాలుగా ఆదుకోవాలంటూ కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాలకు చెందిన ప్రజలు, నాయకులు ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌.. నిర్వాసితుల త్యాగాలు మరువలేనివని, కేంద్ర ప్రభుత్వం అందించే నష్టపరిహారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారాన్ని కలిపి రూ.10 లక్షలు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ ఒక్క నిర్వాసితుడికీ అన్యాయం జరగకుండా గృహ సముదాయాలకు తరలిస్తామని హామీ ఇచ్చారు.

గిరిజన ప్రాంతంలో ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేకంగా గిరిజన జిల్లా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వరదల వల్ల ఏటా పోలవరం ముంపునకు గురవుతున్న నేపథ్యంలో దీనిపై ఒక ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజును సీఎం ఆదేశించారు. మున్నూరుకాపు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంపై రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కుక్కునూరు మండలం నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఎడ్ల బళ్లపై ఇసుకని తరలించి స్థానిక అవసరాలకు వినియోగించుకుంటే పోలీసులు కేసులు బనాయిస్తున్నారన్నారు. నిర్వాసితులకు గతంలో ఇచ్చిన రూ.1.50 లక్షల పరిహారానికి అదనంగా మరో రూ.5 లక్షలు ఇప్పించాలని కోరారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top