CM YS Jagan: 48 గంటల్లో సాయం | Sakshi
Sakshi News home page

CM YS Jagan: 48 గంటల్లో సాయం

Published Tue, Jul 19 2022 3:13 AM

CM Jagan orders authorities in Review meeting on Godavari floods - Sakshi

వరద బాధితులను ఆదుకోవడంలో విరామం లేకుండా అవిశ్రాంతంగా పని చేస్తున్నప్పటికీ కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న దురుద్దేశపూర్వక ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. ‘మీరు చేస్తున్న మంచి పనులు కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతుంటే వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ముందడుగు వేసి అలాంటి వాటి పట్ల దూకుడుగా వ్యవహరించాలి’ అని నిర్దేశించారు.
–ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: గోదావరి వరద బాధిత కుటుంబాలకు 48 గంటల్లోగా రూ.రెండు వేల సాయం అందించడంతోపాటు రేషన్‌ పంపిణీని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ముంపు బారిన పడిన గ్రామాల్లో ఏ ఒక్క ఇల్లూ మిగిలిపోకుండా అందరికీ సాయం అందించాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ఎక్కడా రూ.2 వేల సాయం, రేషన్‌ అందలేదనే మాటే వినిపించడానికి వీల్లేదని, కలెక్టర్లు, సీనియర్‌ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. 25 కిలోలు బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో ఉల్లిపాయలు, కిలో పామాయిల్‌తో రేషన్‌ సరుకుల పంపిణీ జరగాలన్నారు. బాధితులు శిబిరాలకు వచ్చినా రాకున్నా.. ముంపునకు గురైన చోట్ల ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు, రేషన్‌ సరుకులు అందాలని స్పష్టం చేశారు.

నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతున్నందున సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు దురుద్దేశపూరితంగా చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికార యంత్రాంగానికి సూచించారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ సమీర్‌శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, విపత్తుల నిర్వహణశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.సాయి ప్రసాద్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఎలాంటి సాయానికైనా సిద్ధం..
మీకు ఇంకా ఏమైనా అవసరమైతే అన్ని రకాలుగా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నిధుల సమస్య లేనే లేదు. చురుగ్గా ముందుకు వెళ్లండి. ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కారానికి ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు. బాధిత కుటుంబాల పట్ల మానవతా ధృక్పథంతో వ్యవహరించండి. ఇప్పటివరకూ ఒకరు మాత్రమే మరణించినట్లు సమాచారం ఉంది. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సహాయ శిబిరాలు కొనసాగించాలి. బాధిత కుటుంబాలకు మంచి ఆహారం, తాగునీరు అందించాలి. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలి.
 
వరద తగ్గగానే పంట నష్టం అంచనా

వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తి చేయాలి. పశువులకు పశుగ్రాసం, దాణా సక్రమంగా అందించాలి. పశు సంపదకు నష్టం వాటిల్లితే అంచనాలు రూపొందించాలి.

గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ
గర్భిణిలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఆస్పత్రులకు తరలించాలి. వైద్యాధికారులు, స్పెషలిస్టులు సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. ముంపు తగ్గగానే అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. ఆస్పత్రుల్లో తగినంత మంది సిబ్బంది, మందులను సిద్ధంగా ఉంచాలి. రక్షిత తాగునీటి సరఫరాను అవసరమైన ప్రాంతాలకు కొనసాగించాలి,  క్లోరినేషన్‌ కొనసాగించండి. అన్ని మంచినీటి పథకాలను ఒకసారి పరిశీలించడంతో పాటు మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయించండి.

అదనపు సిబ్బంది తరలింపు..
వరద బాధిత ప్రాంతాలకు పక్క జిల్లాల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని తరలించి ముమ్మరంగా పనులు చేపట్టాలి. ఇతర జిల్లాల నుంచి తరలించేటప్పుడు సిబ్బంది వసతి, భోజన సదుపాయాలకు లోటు రాకుండా చూసుకోవాలి. పంచాయతీరాజ్, మునిసిపల్‌ శాఖల విభాగాధిపతులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మురుగునీటి కాలువల్లో పూడిక తీత కార్యక్రమాలు చేపట్టాలి. నీరు తగ్గగానే కల్వర్టులు, బ్రిడ్జిలను క్షుణ్నంగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టాలి.
 
కరకట్ట పరిశీలన.. పూడికతీత
గోదావరి కరకట్ట బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెట్రోలింగ్‌ నిరంతరం కొనసాగాలి. అన్ని డ్రెయిన్ల ముఖద్వారాలు మూసుకుపోయే అవకాశం ఉన్నందున పూడిక తొలగింపు పనులు చేయాలి. గట్లు, కాల్వలకు ఎక్కడైనా గండ్లు పడితే వెంటనే పూడ్చి వేయాలి.

తక్షణం విద్యుత్తు పునరుద్ధరణ
వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ, మరమ్మతుల పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. వచ్చే 48 గంటల్లో ఈ సమస్యను పరిష్కరించాలి. పలు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలను నిర్వహిస్తున్నందున తిరిగి అప్పగించేటప్పుడు పరిశుభ్రంగా అప్పగించాలి.

అందుబాటులో అత్యుత్తమ వ్యవస్థ..
గతంలో రెండు జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎస్పీలు ఇద్దరు చొప్పున మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం కాకినాడతో కలిపి ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలున్నారు. సచివాలయాల వ్యవస్థ కూడా మీకు అందుబాటులో ఉంది. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులున్నారు. ప్రతి 50 ఇళ్లకూ ఒక వలంటీర్‌ ఉన్నారు. అందుబాటులో ఉన్న ఇలాంటి అత్యుత్తమ వ్యవస్థ ద్వారా నాణ్యమైన సేవలు అందించాలి. పంపిణీ ముమ్మరం చేయాలి. ఈ వ్యవస్థ ద్వారా ఎప్పుడూ జరగని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ రూ.2 వేలు ఆర్థిక సాయం చేయలేదు.

మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్‌కళ్యాణ్‌ లాంటివారు బురద జల్లుతున్నారు. వీరంతా రాష్ట్ర ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తారు. బురద జల్లడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. దురుద్దేశ పూర్వకంగా చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలి. వదంతులను కూడా తిప్పికొట్టాలి.   

Advertisement
 
Advertisement
 
Advertisement