తల్లికి వందనం 30 లక్షల మందికి ఎగనామం | CM Chandrababu has cheated every mother and every student | Sakshi
Sakshi News home page

తల్లికి వందనం 30 లక్షల మందికి ఎగనామం

Jun 12 2025 4:01 AM | Updated on Jun 12 2025 11:59 AM

CM Chandrababu has cheated every mother and every student

అదీ కేవలం రూ.13 వేలే! 

నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు అన్నారు.. తీరా మాట మార్చేశారు 

ప్రతి తల్లీని, ప్రతి విద్యార్థినీ మోసం చేసిన సీఎం చంద్రబాబు 

యూడైస్‌లో ఉన్నది 87.42 లక్షల మంది విద్యార్థులు.. వీరందరికీ ఏటా రూ.13,112 కోట్లు అవసరం 

ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది రూ.8,745 కోట్లే.. వాస్తవంగా ఈ మొత్తం 58 లక్షల మందికే సరి 

గతేడాది రూ.13,112 కోట్లు ఎగవేత 

రెండేళ్లకు కలిపి రూ.30 వేల చొప్పున ఇవ్వాలని తల్లుల డిమాండ్‌  

రూ.13 వేలు ఒకే మొత్తంగా ఇస్తారా.. లేక వాయిదాల పద్దతో స్పష్టత కరువు 

ఇప్పుడే ఇట్లుంటే తీరా నగదు జమ అయ్యే సమయానికి ఎంత మందికి ఎగ్గొడతారోనని తల్లుల ఆందోళన

నేడు ‘తల్లికి వందనం’ 

సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం

సాక్షి, అమరావతి: ‘నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు.. నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం.. అధికారంలోకి రాగానే తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం కింద ఈ మొత్తాన్ని జమ చేస్తాం’ అని ఊరూరా.. ఇంటింటా ఎన్నికల ముందు ప్రచారం చేసిన చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌.. ఇప్పుడు మాట తప్పింది. ఏకంగా దాదాపు 30 లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టనుంది. 

అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టడమే కాకుండా.. రెండో ఏడాది తూతూ మంత్రంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. రూ.15 వేల స్థానంలో రూ.13 వేలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిందని తెలిసింది. రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్‌ లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం. అయితే ఈ పథకం అమలు కోసం రూ.8,745 కోట్లు మాత్రమే కేటాయించినట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. 

ఈ లెక్కన ఈ మొత్తం 58 లక్షల మంది విద్యార్థులకే సరిపోతుంది. అంటే దాదాపు 30 లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టడానికి రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ రూ.13 వేలను ఒకేసారి ఇస్తారా.. లేక వాయిదాల పద్దతిలో ఇస్తారా.. అన్నది ఇంకా స్పష్టం చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా సూపర్‌ సిక్స్‌ అమలు చేయక పోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ని డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసినా.. ప్రజలు ఈ పథకం గురించి ఎక్కడికక్కడ ప్రశ్నిస్తుండటంతో అరకొరగా అమలు చేయనుందని తెలుస్తోంది. 

అయితే అంతుబట్టని అంకెల గారడీతో తల్లుల కళ్లకు ప్రభుత్వం గంతలు కట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులున్నట్టు చెబుతోంది. ఈ లెక్కన తీసుకున్నా, తలో రూ.15 వేల చొప్పున రూ.10,090.74 కోట్లకు పైగా అవసరం. కానీ కేటాయింపులు మాత్రం ఆ మేరకు కూడా లేక పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. తీరా నగదు జమ చేసే సమయానికి ఇంకెంత మందికి ఎగ్గొడతారోననే అనుమానం వ్యక్తమవుతోంది.

గత ఏడాది ఎగ్గొట్టి.. ఈ ఏడాది కోతలు పెట్టి.. 
‘‘ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ అమలు చేస్తాం. ఒక్కరుంటే రూ.15 వేలు ఇస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి పథకాలు అందుకోండి’’ అంటూ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే హామీని ‘సూపర్‌–­6’లోనూ పేర్కొన్నారు. 

అందరికీ తల్లికి వందనం ఇస్తామన్న హామీ ప్రకారం.. ఇప్పుడు చెప్పిన విద్యా­ర్థుల సంఖ్య, నిధుల లెక్క సరిపోవడం లేదు. విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలో యూ­డైస్‌ డేటానే ప్రామాణికం. అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ లెక్కలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే అప్‌లోడ్‌ చేస్తారు. రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూ­డైస్‌ లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వంద­నం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం.

గతేడాది ఒక్క విద్యార్థికీ ఈ పథకం ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఈసారి విద్యార్థుల సంఖ్యలో కోత పెట్టి గొప్పలు చెబుతోంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్‌ నెలలో అమ్మ­ఒడి జమయ్యేది. గతేడాది ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం రావడంతో పథ­కం ఆగిపోయింది. కానీ సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కొన­సాగిస్తామన్నారు. అలాగే, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామన్నారు. హామీ ప్రకారం రెండేళ్లకు ఒక్కో విద్యా­ర్థికి రూ.30 వేల చొప్పున ఇవ్వాలని తల్లులు డిమాండ్‌ చేస్తున్నారు.

నేడు ‘తల్లికి వందనం’ నిధులు జమ
సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం
సాక్షి, అమరావతి: తల్లికి వందనం పథకాన్ని గురువారం నుంచి అమలుచేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సచివాలయంలో బుధవారం ఈ పథకం అమలు, విధివిధానాలపై మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, అధికారులతో సీఎం సమీక్షించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గురువారమే తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి  తెలిపారు. అర్హులైన విద్యార్థుల ప్రతి తల్లి ఖాతాలో తల్లికి వందనం నిధులను జమచే­యాలని ఆయన ఆదేశించారు. 

సమీక్షలో విద్యా­శాఖ మంత్రి నారా లోకేశ్‌  మాట్లాడుతూ.. అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామన్నారు. పథకాన్ని ఎలా అమలుచేయబోతున్నామనే విషయాన్ని వివరించారు. పథకం అమలుకు అవసరమైన నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద గురువారం నగదును తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement