బోయకొండ బతికొచ్చాడు.. మరి ఆ శవమెవరిది ?

Chittoor Man Returns Home After Family Conducts His Funeral - Sakshi

ఈనెల 7న అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు

మృతుడు తమబిడ్డేనని అప్పుడు భావించిన తల్లిదండ్రులు

తాను బతికే ఉన్నానంటూ ఇల్లు చేరిన కొడుకు

చనిపోయింది ఎవరంటూ తల పట్టుకుంటున్న పోలీసులు

భిక్షాటనకు వెళ్లిన కొడుకు ఏదో జరిగి చనిపోయాడనుకుని గుక్క పట్టి ఏడ్చారు ఆ తల్లిదండ్రులు.. యాచక వృత్తి చేసుకునే తమ వద్ద అంత్యక్రియలు జరపడానికి కూడా స్థోమత లేదనడంతో మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో శవాన్ని పూడ్చారు. అంత్యక్రియలు నిర్వహించిన ఆ పోలీసులను స్థానికులు ఘనంగా సన్మానించారు. ఇంతవరకు ఓకే.. సీన్‌ కట్‌ చేస్తే.. చనిపోయాడనుకున్న వ్యక్తి నేను బతికే ఉన్నా అని ప్రత్యక్షమయ్యాడు. దీంతో కంగారు పడడం పోలీసుల వంతు అయింది. మరి చనిపోయిందెవరా ! అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇంతకీ మ్యాటర్‌ఏంటంటే.. పలమనేరు పట్టణంలో చోటుచేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళ్లాల్సిందే. 

సాక్షి, చిత్తూరు: తల్లిదండ్రుల సమక్షంలో ఈనెల 7న అంత్యక్రియలు నిర్వహించిన పోలీసుల సాక్షిగా మృతి చెందిన వ్యక్తి తాను బతికే ఉన్నానంటూ ఇంటికి చేరిన సంఘటన ఆదివారం పలమనేరులో సంచలనం సృష్టించింది. 15 రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి పట్టణంలో ఫిట్స్‌తో అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. పది రోజులుగా చికిత్స పొందుతూ ఈనెల 7న ఆస్పత్రిలో మృతిచెందాడు. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనాథ శవం కావడంతో వారు మున్సిపల్‌ అధికారుల ద్వారా అంత్యక్రియలను ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా మృతదేహాన్ని గమనించిన కొందరు గంగవరం మండలం చిన్నూరుకు చెందిన బోయకొండగా గుర్తుపట్టారు.

దీంతో పోలీసులు చిన్నూరులోని బోయకొండ తల్లిదండ్రులు వెంకటరమణ, ఎల్లమ్మకు సమాచారం ఇచ్చి ఆస్పత్రి వద్దకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసిన వారు తమబిడ్డేనని యాచనకు ఎక్కడో వెళ్లి చనిపోయాడని అనుకుని బోరున విలపించారు. మృతదేహాన్ని తీసుకెళ్లమంటే భిక్షాటన చేసుకునే తమకు అంత్యక్రియలు చేసేందుకు స్థోమత లేదని వాపోయారు. దీంతో పోలీసులు, స్థానిక లారీవర్కర్‌ యూనియన్‌తో కలసి పట్టణ సమీపంలోని వడ్డోనికుంట శ్మశానవాటికలో ఈనెల 8న అంత్యక్రియలను నిర్వహించారు. పోలీసుల సేవలపై ‘మానవత్వం చాటుకున్న పోలీసులంటూ’ జనం మెచ్చుకున్నారు.

బతికే ఉన్నానంటూ వచ్చిన బోయకొండ
ఇలా ఉండగా భిక్షాటనకు వెళ్లిన వెంకటరమణ కుమారుడు బోయకొండ ఆదివారం గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. తాను బయటకు వెళ్లానని కుటుంబీకులకు తెలపడంతో చనిపోయిన కొడుకు తిరిగొచ్చాడంటూ సంబరపడ్డారు. మృతిచెందిన వ్యక్తి మొహం కూడా తమ కొడుకులాగే ఉండడంతో తమ బిడ్డేననుకున్నామని చెబుతున్నారు. 

ఇంతకీ ఆ శవమెవరిది ?
బోయకొండ బతికే ఉండడంతో తాము అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరిదనేది ఇప్పుడు పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలిస్తే గుర్తుతెలియని వ్యక్తిగా నమోదు అయింది. వెంకటరమణ మాట నమ్మి మృతుడెవడో తెలుసుకోకుండానే తొందర పడ్డామేమోనని పోలీసులు భావిస్తున్నారు. ఇలాఉండగా కొందరు ఆదివారం సైతం మానవత్వం చూపిన పోలీసులను సన్మానించడం కొసమెరుపు.

ఈ విషయమై ఆస్పత్రి ఆర్‌ఎంఓ శారదను వివరణ కోరగా తాము గుర్తుతెలియని వ్యక్తి గనుకే పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఇదే విషయమై స్థానిక సీఐ భాస్కర్‌ను వివరణ కోరగా బోయకొండ బతికున్నప్పుడు మృతిచెందిన వ్యక్తి ఎవరో తెలియడం లేదన్నారు. దీనిపై విచారిస్తామన్నారు. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top