విధివంచితులు

Children with mental health Problem At Tadipatri - Sakshi

బుద్ధిమాంద్యంతో బిడ్డల ఇక్కట్లు 

ఆలనా పాలనా చూస్తున్న తల్లిదండ్రులు 

అపన్నహస్తం కోసం ఎదురుచూపులు 

తాడిపత్రి పట్టణంలో దాదాపు 150 మంది బుద్ధిమాంద్యులు 

వారిదో వింతలోకం.. ఉలుకూ పలుకూ లేని వారు కొందరైతే.. నిస్తేజంగా కనిపించేవారు మరికొందరు.. ఆకలేసినా అన్నం అడగలేనివారు ఇంకొందరు.. వయసు పెరుగుతున్నా అందుకు తగ్గట్టు బుద్ధి పెరగడం లేదు. ఎదుగూబొదుగూ లేని బుద్ధిమాంద్యం పిల్లలను తల్లిదండ్రులు మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉన్నారు. సరైన వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు పిల్లలను భవిష్యత్తును తలచుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. 

తాడిపత్రి టౌన్‌: తాడిపత్రి పట్టణంలో దాదాపు 150 మంది బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. వీరిలో చెవిటి, మూగ, అంధులు, శారీరక, మానసిక వైకల్యం కల్గిన చిన్నారులు దుర్భర జీవితం గడుపుతున్నారు. విధివంచితులైన వారిని తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతూనే ప్రేమతో చూసుకుంటున్నారు.  

అవ్వ సంక్షరణలో అక్కాతమ్ముడు 
వడ్లపాలెంకు చెందిన కూలీలు హజీరాని, దస్తగిరి దంపతులు. వీరికి నసృన్‌ (14), మహమ్మద్‌ సందానీ ( 15) సంతానం. వీరు పుట్టుకతోనే బుద్ధిమాంద్యులు. రెక్కాడితే గానీ డొక్కాడని దయనీయ జీవితం. ఈ నేపథ్యంలో పిల్లల సంరక్షణ బాధ్యతను అవ్వ దస్తగిరమ్మ తీసుకుంది. దస్తగిరమ్మ అద్దె ఇంట్లో ఇద్దరు పిల్లలలో కలసి ఉంటోంది. నసృన్, మహమ్మద్‌ సందానీలకు మతిస్థిమితం లేదు. అన్నం కూడా తినలేని పరిస్థితి. ఆమె ఇంటి వద్దనే చిరువ్యాపారం చేసుకుంటూ.. వచ్చే పింఛన్‌ డబ్బుతో బతుకు బండి లాగుతోంది. 

నడవలేస్థితిలో ధరణి, సృజన.. 
గన్నెవారిపల్లి కాలనీకి  చెందిన లలితమ్మ, శివశంకర్‌ భార్యాభర్తలు. వీరికి ధరణి (15), సృజన (7) పిల్లలు. వీరు పుట్టుకతోనే బుద్ధిమాంద్యులు. శివశంకర్‌ ఆటోడ్రైవర్‌. లలితమ్మ పిల్లలను చూసుకుంటూ ఇంటి వద్దనే ఉంటోంది. పిల్లలు నడవలేరు. రోజూ భవిత సాధన ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. ఆటో సంపాదనతో అతి కష్టం మీద శివశంకర్‌ కుటుంబం నడుపుతున్నాడు. అధికారులు స్పందించి తమవంతు సాయం చేయాలని వారు కోరుతున్నారు.. 

తల్లిచాటు బిడ్డ ఫకృద్దీన్‌ 
శ్రీనివాసపురానికి చెందిన లారీ డ్రైవర్‌ వలిబాషా, బీబీ దంపతులు. వీరి కుమారుడు బాబా ఫకృద్ధీన్‌ (29)కు రెండు, కాళ్లు, చేతులు పని చేయవు. మానసిక స్థితి సరిగా లేదు. దీంతో ఆలనా పాలన తల్లి బీబీ చూసుకుంటోంది. వయసు పెరిగినప్పటికీ ఫకృద్ధీన్‌ చిన్న పిల్లవాడిగానే ప్రవర్తిస్తుంటాడు.  
తమ్ముడికి అక్క అండ 
నందలపాడుకు చెందిన అంకాలమ్మ, గంగయ్య దంపతులకు నలుగురు పిల్లలు. వీరిలో లోకేష్‌  (24) మానసిక బుద్ధి మాంద్యంతో పుట్టారు. కొన్ని సంవత్సరాల క్రితం లోకేష్‌ తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి లోకేష్‌ను అక్క జ్యోతినే సంరక్షిస్తోంది. చివరకు తాను వివాహం కూడా చేసుకోలేదు. తమ్ముడికి వచ్చే పింఛన్‌ డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తుంది. లోకేష్‌ స్వయంగా నడవలేడు. ఎవరైనా పట్టుకుని నడిపించాల్సిందే. 

కదల్లేని దీనస్థితిలో ఎందరో.. 
శ్రీనివాసపురానికి చెందిన హుస్సేన్‌బీ, దస్తగిరి దంపతుల కుమార్తె నూర్జహాన్‌ (14). నూర్జహాన్‌ కదలని బొమ్మగా ఉంటుంది. చంటి పిల్లను చూసుకున్నట్టుగా ఆమెను తల్లి చూసుకుంటోంది. పుట్లూరు రోడ్డులోని ఆర్టీటీ కాలనీకి చెందిన ప్రమీణ, రాము భార్యభర్తలు. వీరి కుమారుడు నరసింహులు (13) బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. వీల్‌చైర్‌కే పరిమితం. గన్నెవారిపల్లి కా­లనీకి చెందిన ఆంజనేయులు (18) బుద్ధిమాంద్యం బా­రినపడ్డాడు. తండ్రి చనిపోవడంతో తల్లి అ­చ్చమ్మే ఆంజనేయులుకు అన్ని సపర్యలూ చేస్తోంది.

బాగా చూసుకుంటున్నాం 
తాడిపత్రి మండల విద్యాశాఖ కార్యాల­య ఆవరణలో బు­ద్ధిమాంద్య పిల్లల కో­సం రాç­Ù్ట్ర ప్రభుత్వం భవిత సాధన కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక్కడ బుద్ధిమాంద్యం పిల్లల కోసం ట్రైసైకిల్, మరికొన్ని ఆట వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల బొమ్మలతో పిల్లలు గడిపే విధంగా చూస్తున్నాం. రోజూ 10 నుంచి 20 మంది పిల్లలు భవిత కేంద్రానికి వస్తారు. ఫిజియోథెరపీ వంటి సేవలు కూడా అందిస్తున్నాం. దివ్యాంగుల సర్టిఫికెట్లు ఇప్పించేందుకు సదరం పరీక్షా కేంద్రాలకు పంపుతున్నాం.   
– నాగరాజు, భవిత కేంద్ర అధికారి, ఎంఈఓ, తాడిపత్రి   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top