నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీరేటు నిర్ణయం
అయినా రూ.3,400 కోట్ల బాండ్లు మాత్రమే కొన్న పెట్టుబడిదారులు
వీరిలో ఎక్కువమంది టీడీపీ వారేనని ప్రచారం
సాక్షి, అమరావతి: అప్పుల సమీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీ (ఖనిజాభివృద్ధి సంస్థ) ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా ముందుకెళ్తోంది. బాండ్ల అంశం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ న్యాయస్థానం నోటీసులను బేఖాతరు చేస్తూ ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్) బాండ్ల ప్రక్రియకు బరితెగించింది. నిబంధనలకు విరుద్ధంగా అధికశాతం వడ్డీరేట్లకు వాటిని జారీచేసింది. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్‌పై ప్రైవేట్ వారికి హక్కులు కల్పిస్తూ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ గురువారం రూ.9 వేల కోట్ల ఎన్సీడీ బాండ్లను జారీచేయగా, సుమారు రూ.3,400 కోట్ల బాండ్లను మాత్రమే పెట్టుబడిదారులు కొనుగోలు చేసినట్లు తెలిసింది.
సెబీలోని ఐబీపీ ప్లాట్‌ఫాంలో నిర్వహించిన ఎల్రక్టానిక్ బిడ్డింగ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన బినామీ వ్యక్తులే ఎక్కువగా ఈ బాండ్లు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కన్సాలిడేటెడ్ ఫండ్‌పై హక్కులు ఇచ్చే విషయాన్ని చివరి నిమిషంలో బయటపెట్టడం ద్వారా ఎక్కువమంది పెట్టుబడిదారులు ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పాల్గొనకుండా చేయడంలో ప్రభుత్వ పెద్దలు సఫలమైనట్లు సమాచారం. అయితే, అమ్ముడైన రూ.3,400 కోట్ల బాండ్లలో ఎక్కువ భాగం టీడీపీకి చెందిన వ్యక్తులే కొన్నట్లు తెలుస్తోంది. ఈ బాండ్ల జారీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచింది.
ఏపీఎండీసీలోని ముఖ్య అధికారులకు కూడా ఈ బాండ్లకు సంబంధించిన వివరాలేమీ తెలియకుండా ఆరి్థక శాఖ ముఖ్య ఉన్నతాధికారే అన్ని చూసుకున్నట్లు తెలిసింది. ఇక అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడడంతోపాటు అందుకు సంబంధించిన కీలకమైన విషయాలను బయటపెట్టకుండా కేవలం తమకు అనుకూలమైన వారికి మాత్రమే మేలు చేసేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నింది. అయినా, అనుకున్న మేర బాండ్లను విక్రయించడంలో సఫలం కాలేకపోయింది. మిగిలిన బాండ్లకు సంబంధించి ఏం చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
హైకోర్టు నోటీసులు బేఖాతరు..
ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్‌ని ప్రైవేట్ వ్యక్తులకు బాండ్లు జారీచేయడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైనా లెక్కచేయకుండా ప్రభుత్వం ముందుకెళ్లడం గమనార్హం. రాజ్యాంగంలోని ఆర్టీకల్స్ 203, 204, 293 (1), 293 (3)లను ప్రభుత్వం ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సహా ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. అయినా, టీడీపీ కూటమి ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా గురువారం బాండ్లు జారీచేసేసింది. ఇలా జారీచేసిన బాండ్లలో సుమారు రూ.3,400 కోట్ల మొత్తాన్ని 9.30 శాతం అధిక వడ్డీ రేటుతో పెట్టుబడిదారులు కొనుగోలు చేశారు.
ప్రైవేట్ వారికి పెత్తనం రాజ్యాంగ విరుద్ధం..
ఇక ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్సీడీ బాండ్లను 6.71 శాతం వడ్డీ రేటుతో జారీచేసింది. కానీ, ఇప్పుడు ఏపీఎండీసీ ఈ బాండ్లను 9.30 శాతం అధిక వడ్డీకి జారీచేయడంతోపాటు కన్సాలిడేటెడ్ ఫండ్‌పై ప్రైవేట్ వారికి పెత్తనం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు.


