
చలానా బకాయిలను వచ్చే నెల 4లోగా చెల్లిస్తేనే పథకం వర్తిస్తుందని మెలిక
8 వేల మంది డ్రైవర్లను అనర్హులను చేసే ఎత్తుగడ
ఈ నిబంధనను తొలగించాలంటున్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల యూనియన్లు
సాక్షి, అమరావతి: ‘డ్రైవర్ సేవలో..’ పేరిట ఆటో, ట్యాక్సీ, మాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే పథకం అమలులో చంద్రబాబు ప్రభుత్వం ‘చలానా’ మెలికతో కోత పెడుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకం కింద లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందించారు. గత ఐదేళ్లలో లేని నిబంధనలను కూటమి ప్రభుత్వం ‘డ్రైవర్ల సేవలో..’ పథకంలో చేర్చి ,సాధ్యమైనంత మందిని పథకానికి అనర్హులను చేస్తోంది.
ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌లపై ట్రాఫిక్ చలానాల బకాయి ఉంటే రూ.15 వేల ఆర్థిక సహాయం పథకానికి అనర్హులని ప్రకటించింది. చలానా బకాయిల కారణం చూపి దాదాపు 8వేల మంది డ్రైవర్లు అనర్హులని చెబుతోంది. ఈ నెల 4లోగా చలానా బకాయిలు చెల్లించకపోతే వారికి ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించేది లేదని రవాణా శాఖ స్పష్టం చేస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను కెమెరాలు/సెల్‌ఫోన్ల ద్వారా ట్రాఫిక్ పోలీసులు రికార్డు చేసి జరిమానాలు విధిస్తుంటారు. అయితే, జరిమానా విధింపుపై డ్రైవ్రర్లకు తక్షణం సమాచారం ఉండదు.
తమ వాహనాన్ని విక్రయించే సమయంలోనో ఏదైనా ఇతర నిబంధనల ఉల్లంఘన సమయంలోనో పోలీసులు చెబితేనే తెలుస్తుంది. అప్పుడు వారు చలానా బకాయిలు చెల్లిస్తారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే. కాగా.. ప్రస్తుతం ఆటో, ట్యాక్సీ, మాక్సి క్యాబ్ డ్రైవర్లకు తమ వాహనంపై చలానా బకాయిలు ఉన్నాయో లేదో తెలియడం లేదు. వారికి గ్రామ, వార్డు సచివాలయం నుంచి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.
ఈ నెల 4న ఈ పథకం కింద డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అప్పటికీ డ్రైవర్లకు సమాచారం లేకపోతే వారు ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి అనర్హులు అవుతారు. ఈ విషయంపై రవాణా శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చలానా బకాయిల నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆటో, ట్యాక్సీ, మాక్సీ కేబ్ డ్రైవర్ల యూనియన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఉద్యోగులను నిరాశపరిచారు
దసరా కానుకగా నాలుగు కరువు భత్యాల్లో రెండైనా ఇస్తారనుకున్నాం
12వ పీఆర్సీ నియమించి ఐఆర్ ప్రకటిస్తారని ఎదురుచూశాం
స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం దక్కుతుందని ఎదురుచూసిన ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగిందని ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. దసరా కానుకగా పెండింగ్‌లో ఉన్న నాలుగు కరువు భత్యాలలో కనీసం రెండైనా ఇస్తారని, 12వ పీఆర్సీ నియమించి ఉద్యోగులందరికీ ఇంటీరియం రిలీఫ్ ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూశారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం వీటి ఊసెత్తకపోవడం విచారకరమన్నారు. ఉద్యోగుల కరువు భత్యం, 11వ పీఆర్సీ బకాయిలు రూ.12,119.77 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పకపోవడం సరైంది కాదన్నారు. అలాగే, గ్రాట్యుటీ, సరెండర్ లీవులు, పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, మెడికల్ బిల్లులు పెండింగ్‌లో ఉండడంవల్ల ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. అందరికీ ఆమోద యోగ్యమైన పెన్షన్ పథకం అమలు చేస్తామని ఇప్పటివరకు నిర్ణయం ప్రకటించకపోవడం వల్ల రిటైరవుతున్న ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు.
ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఉన్నా వైద్యం అందడం లేదని.. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఒకటిన్నర నెల జీతం పెండింగ్‌లో ఉండడంవల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలుకాక ఇబ్బందిపడుతున్నారని వీళ్లందరికీ సంక్షేమ పథకాలు అమలుచేసేలా నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.