
తాడేపల్లి : అసెంబ్లీ సమావేశాల నుండి ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు. రైతులు గిట్టుబాటు ధరలు, మెడికల్ కాలేజీల గురించి అడిగితే అసలు ఆ సమస్యలే లేవని వ్యాఖ్యానించారని స్పష్టం చేశారు. ఈ రోజు(ఆదివారం, సెప్టెంబర్ 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. రైతులు యూరియా కోసం క్యూ కడుతున్న దృశ్యాలు ప్రభుత్వానికి కనపడలేదని విమర్శించారు. ‘ యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు, అచ్చెనాయుడు అంటున్నారు.
యూరియా అందించలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ హయాంలో వ్యవసాయం పండుగైతే చంద్రబాబు హయాంలో దండగగా మారిపోయింది. రైతుల బాధలను కూడా అవహేళన చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేసి పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారు. ఆరువేల కోట్లు కూడా ఖర్చు చేయలేక ప్రయివేటు వ్యక్తుల చేతిలో పెడతారా?, నిధుల్లేకపోతే విడతల వారీగా నిర్మాణాలు పూర్తి చేయొచ్చుకదా?, అదేమీ లేకుండా తమ వారికి దోచి పెట్టటమే పనిగా పెట్టుకుంటారా?, చంద్రబాబు పాలన అంతా ప్రయివేటీకరణ కోసమే. విద్య, వైద్యం ప్రయివేటు వ్యక్తుల చేతిలో ఉంటే ఇక సామాన్యులు బతికేది ఎలా?, ప్రయివేటీకరణే కరక్టని రోడ్డు మీదకు వచ్చి జనం ముందు చెప్పే ధైర్యం ఉందా?, సూపర్ సిక్స్ మేనిఫెస్టోనే మారిపోయింది.
ఎన్నికలకు ముందు ఉన్న మేనిఫెస్టోకి, ఇప్పటి మేనిఫెస్టోకి సంబంధం లేకుండా పోయింది. అప్పుల మీద అధికార పార్టీ నేతలు గాలి మాటలు మాట్లాడారు. బాలకృష్ణ తప్పతాగి అసెంబ్లీకి వచ్చారు. నోటికొచ్చినట్టు మాట్లాడి అసెంబ్లీ పరువు తీశారు. మండలి ఛైర్మన్‌కి సరైన గౌరవం కూడా ఇవ్వలేదు. దళితుడన్న కారణంతో అగౌరవంగా చూస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని దూషిస్తున్నారు. నారా లోకేష్ సకల శాఖా మంత్రిగా వ్యవహరిస్తూ మిగతా మంత్రుల నోళ్లు మూయించారు. ప్రజా సమస్యల పరిష్కారం అయ్యే వారకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం’ హెచ్చరించారు.
