
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 13 లోపు నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. పోలీసులు.. కోర్టును తప్పుదోవ పట్టించారని సవీంద్ర తరపు లాయర్ తన వాదనలు వినిపించారు. ‘‘ రాత్రి 7:30 గంటలకు అరెస్ట్ చేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు. 6:30కు అరెస్ట్ చేశారని నిందితుడు చెబుతున్నాడు.
..కన్ఫెషన్ రిపోర్టులో రాత్రి 7.30కు అరెస్ట్ చేసినట్లు రాశారు. రిమాండ్ రిపోర్టులో రాత్రి 8.30కు అరెస్ట్ చేసినట్లు రాశారు. ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. లాలాపేట ఎస్‌హెచ్‌వో శివప్రసాద్ అరెస్ట్ చేసినట్లు స్పష్టంగా ఉంది. రాత్రి 7 గంటలకు సవీంద్రరెడ్డి సతీమణి పీఎస్‌కు వచ్చినట్లు సీసీటీవీలో ఉంది. సవీంద్ర ఫోన్ సాయంత్రం 6:21కి స్విచాఫ్ చేసినట్లు స్పష్టంగా ఉంది. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే సీబీఐ సుమోటోగా తీసుకుని విచారించాలి’’ అని సవీంద్ర లాయర్ కోరారు.
‘‘సవీంద్రారెడ్డిపై గంజాయి కేసు ఎలా పెట్టారు?. సుప్రీంకోర్టు తీర్పులున్న యూనిఫాం లేకుండా ఎలా పోలీసులు సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు? ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు. ఇది అక్రమ అరెస్టా లేదా తెలియాలంటే సీబిఐతో విచారించాలి’’ అని సవీంద్ర లాయర్ తన వాదనలు వినిపించారు. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ.. సీబీఐ అక్టోబర్ 13వ తేదీ కల్లా కేసుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా, బుధవారం( సెప్టెంబర్ 24) ఈ కేసును విచారిస్తూ.. పోలీసులు యూనిఫామ్‌లో కాకుండా.. సివిల్ దుస్తుల్లో వెళ్లి అరెస్టులు చేస్తుండటాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు తీర్పునే పట్టించుకోరా? అని సూటిగా నిలదీసింది. ఇదెక్కడి సంస్కృతి అంటూ ప్రశ్నించింది. మఫ్టీలో వెళ్లి సోషల్ మీడియా యాక్టివిస్టు కుంచాల సౌందరరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అసలు పౌరులను అరెస్ట్ చేయడానికి మఫ్టీలో ఎందుకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనంది. సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు వర్తించవని అనుకుంటున్నారా..? అని నిలదీసింది.
తన భర్త సవీంద్రరెడ్డిని పోలీసులు ఈనెల 22న సాయంత్రమే అరెస్ట్ చేశారంటూ రాత్రి 7 గంటల సమయంలో పిటిషనర్ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే... మీరు మాత్రం రాత్రి 7.30–8.45 గంటల మధ్య అరెస్ట్ చేశామని ఎలా చెబుతారని విస్మయం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తాము తాడేపల్లి పోలీస్‌స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని నిర్ణయించినట్లు హైకోర్టు ప్రకటించింది. రాత్రి 8.30 గంటలకు సవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తే, ఆమె 7 గంటలకే ఫిర్యాదు చేసేందుకు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు వెళతారని ప్రశ్నించింది.
