బీసీలకు బాబు పోటు.. మేనిఫెస్టోలో మరో హామీకి తూట్లు
బాబు సర్కారు ఉత్తుత్తి జీవోల డ్రామాకు సుప్రీంకోర్టు తీర్పుతో తెర
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుపై కపట నాటకాలు
చట్టపరంగా చెల్లదని తెలిసీ మేనిఫెస్టోలో హామీలిచ్చి వంచన
బాబు నమ్మక ద్రోహంతో మరోసారి మోసపోయామంటున్న బీసీలు
పార్లమెంట్‌లో చట్టం ద్వారా బీసీలకు 34శాతం రిజర్వేషన్లకు అవకాశం ఉన్నా రెండున్నరేళ్లుగా బాబు మోసం
ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతూ మభ్యపుచ్చే యత్నాలు
కోర్టులు కొట్టివేస్తాయని తెలిసీ జీవో ఇచ్చి డ్రామాకు శ్రీకారం
చెల్లని జీవోలిచ్చి ‘జయహో బీసీ’ అంటూ కపట నాటకాలు
ఆ జీవో చెల్లదని హైకోర్టు, సుప్రీంకోర్టులు తేల్చి చెప్పడంతో బరి తెగించి విపక్షంపై బాబు నిందలు
2020 స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు బాబు వెన్నుపోటు
మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తే.. అడ్డుకుని హైకోర్టులో బాబు అండ్ కో పిటిషన్
నాడు కోర్టుల తీర్పును గౌరవిస్తూనే స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 34 శాతానికిపైగా రిజర్వేషన్లు కల్పించి చిత్తశుద్ధి చాటుకున్న జగన్
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో దాదాపు సగం జనాబా ఉండే బీసీలకు వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో కీలక హామీ డ్రామాగా ముగిసింది. చంద్రబాబు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల హామీ, జీవో కథ అమలుకు నోచుకోకుండానే తెర పడింది. చంద్రబాబు సర్కారు ఇచ్చిన జీవోతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని... రాజ్యాంగ సవరణతోనే అది సాకారం అవుతుందని న్యాయ నిపుణులు, రాజకీయవేత్తలు మొదటి నుంచి చెబుతున్నా చంద్రబాబు తన నాటకాన్ని ముగించలేదు. బలహీన వర్గాలను ఓట్లు కోసం పావులుగా వాడుకుంటూ తన రాజకీయ డ్రామాను కొనసాగించారు.
గత ఐదారేళ్లలో దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఒడిశా తదితర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భాల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టంగా కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ... 40 ఏళ్లకు పైబడి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ‘బీసీలకు రాజకీయ ప్రాధాన్యతతో పాటు స్థానిక సంస్థల పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు’ అంటూ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఏడాది క్రితం తెలంగాణ ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కూడా.. ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించాయంటూ, మొదలైన ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలిచ్చింది.
ఎన్నికల కమిషన్ లేదా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఏదైనా ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేస్తే సాధారణంగా కోర్టులు ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోవు. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించుతున్నప్పుడు ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయడం లాంటి అసాధారణ రీతిలో కోర్టు తీర్పులు వెలువడ్డ ఉదంతాలున్నాయి. ఇవన్నీ తెలిసినా చంద్రబాబు సర్కారు మభ్యపుచ్చేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించేలా బీసీలకు 34 శాతం అంటూ ఆగస్టులో ఉత్తుత్తి జీవోతో డ్రామాకు తెర తీసింది.
న్యాయపరంగా చెల్లవని తెలిసినా రోజుకో డ్రామా
సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్న బీసీ రిజర్వేషన్ల జీవోతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పరిస్థితి ఉండదని తెలిసీ సీఎం చంద్రబాబు తన డ్రామాను రోజుకో రకంగా రక్తి కట్టించారు. జీవో ఇచ్చిన వెంటనే చంద్రబాబు సహా మంత్రులు, టీడీపీ, మిత్రపక్ష కూటమి నేతలు అది అమలుకు నోచుకోకముందే అమలైనట్లుగా ‘జయహో బీసీ’ అంటూ సంబరాలు నిర్వహించారు. పార్టీ నేతలతో పాలాభిషేకాలు చేయించుకున్నారు.
పార్టీ అంతర్గత సమావేశాల్లో జీవో అమలు సాధ్యం కాదని చర్చించుకుంటూనే గత నెలన్నర రోజులకుపైగా గంభీరమైన ప్రకటనలు ఇస్తూ వచ్చారు. హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్దంగా ఉన్నాయంటూ కొట్టివేసినా.. అత్యున్నత న్యాయస్థానానికి వెళతామంటూ ఇంకో డ్రామాకు చంద్రబాబు తెర తీశారు. అందరూ ఊహించినట్టే సుప్రీంకోర్టు సైతం ఆ జీవో చెల్లుబాటు కాదని తీర్పు ఇవ్వడం గమనార్హం.
పార్లమెంట్‌లో చట్టబద్ధతతో అవకాశం ఉన్నా చిత్తశుద్ధి శూన్యం
సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన తర్వాత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే అందుకు పార్లమెంట్‌లో రాజ్యంగబద్ధంగా చట్టబద్ధత కల్పించడం మినహా మరో మార్గం లేదని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ సాగించడంలో టీడీపీ కూటమి పార్టీల మద్దతు కీలకం. ఇంత అవకాశం ఉన్నా బీసీ రిజర్వేషన్లపై ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రెండున్నరేళ్లుగా చంద్రబాబు తీసుకున్న చర్యలు శూన్యం. కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించేందుకు కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. బీసీల రాజకీయ సాధికారతపై చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు కపట నాటకాలు ఆడుతున్నారని బీసీ సంఘాలు, రాజకీయ వేత్తలు, రాజ్యాంగ నిపుణులు, ప్రతిపక్షాలు తేల్చి చెబుతున్నాయి.
తనకు అలవాటైన రీతిలో దుష్ప్రచారం..
బీసీలను మభ్యపెడుతూ రాజకీయ డ్రామాకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో విపక్షంపై నిందలు మోపుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వైఎస్సార్‌సీపీకి ఆపాదించే దుస్సాహసానికి బరి తెగించారు.
ఐదేళ్ల క్రితం అడ్డుకుంది బాబు అండ్ కో నే...
2020, 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28వ తేదీన జీవో నెంబరు 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 59 శాతం రిజర్వేషన్ల అమలుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. దీన్ని తప్పుబడుతూ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయంటూ టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి ద్వారా చంద్రబాబు కోర్టులో కేసులు దాఖలు చేయించారు.
రాష్ట్రంలో రిజర్వేషన్లు తగ్గించాలంటూ ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ప్రతాప్‌రెడ్డికి 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం నామినేటెడ్ పదవిని కూడా కట్టబెట్టడం గమనార్హం. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని హైకోర్టు తీర్పు వెలువరించడంతో... న్యాయస్థానం ఉత్తర్వులను గౌరవిసూ్తనే పార్టీ పరంగా బీసీలకు 34 శాతానికి మించి అవకాశం కల్పించి మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధిని చాటుకోవడం గమనార్హం.
బీసీ రిజర్వేషన్లపై ఇలా...
2020 జనవరి 8..
పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ ఎస్టీ, బీసీలకు మొత్తం 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం. స్థానిక ఎన్నికల నిర్వహణపై అంతకు ముందే దాఖలైన పిటిషన్లపై తక్షణమే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు తీర్పు.
2020 జనవరి 10
స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్ల 50 శాతం దాటాయంటూ 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి పొందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు.
2020 జనవరి 15
59 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే. రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై హైకోర్టులోనే తిరిగి విచారణ జరిపి నిర్ణయం వెలువరించాలని ఆదేశం.
2020 మార్చి2
సుప్రీంకోర్టు సూచనతో తిరిగి హైకోర్టులో టీడీపీ నేత కేసు దాఖలు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటకూడదంటూ హైకోర్టు ఉత్తర్వులు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పునకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఎన్నికలు పూర్తి.
2024 ఎన్నికల ముందు..
మన రాష్ట్రంతో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లోని కోర్టులు స్థానిక ఎన్నికల నిర్వహణలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని స్పష్టమైన తీర్పులు వెలువరించిన తర్వాత కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం ద్వారా దీన్ని అమలు చేసేందుకు అవకాశం ఉన్నా మూడేళ్లుగా మభ్యపెడుతూ బాబు డ్రామాలు.
2026 ఆగస్టు...
స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని గతంలోనే స్పష్టంగా తీర్పులు వెలువరించిన న్యాయస్థానాలు. చట్టపరంగా చెల్లదని తెలిసి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు సర్కారు జీవోలు.
2026 అక్టోబరు 1
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం కారణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటాయంటూ హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు చెల్లవంటూ హైకోర్టు తీర్పు.
సుప్రీంలో...
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటన.
2026 అక్టోబరు 3: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు.
2026 అక్టోబరు 9: హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించుతున్నాయని పేర్కొంటూ చంద్రబాబు సర్కారు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.


