బాబు కపట నాటకానికి కోర్టులో తెర | Supreme Court dismisses SLP filed by Chandrababu Naidu government | Sakshi
Sakshi News home page

బాబు కపట నాటకానికి కోర్టులో తెర

Oct 10 2026 4:34 AM | Updated on Oct 10 2026 4:34 AM

Supreme Court dismisses SLP filed by Chandrababu Naidu government

బీసీ రిజర్వేషన్‌లపై మాయ వేషాలు సుప్రీం సాక్షిగా బట్టబయలు  

చంద్రబాబు దొంగాటకు 1.42 నిమిషాల్లోనే తెరదించిన సుప్రీంకోర్టు ధర్మాసనం

చెల్లని డెడికేటెడ్‌ కమిషన్‌తో జీవోలా? 

నివేదిక పెండింగ్‌లో ఉందా లేదా? అలాంటప్పుడు దేని ఆధారంగా జీవోలిచ్చారు? 

ప్రభుత్వం చేసిన సర్వే, డేటాను ఆ కమిషన్‌ ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది? 

ఈ సర్వే ఏ చట్టం కింద చేశారు? ఆ చట్టం ఏమిటో మాకు చూపించండి

ఈ విషయంలో హైకోర్టు సరైన వైఖరినే తీసుకుంది 

బీసీలకిచ్చిన 34 శాతం రిజర్వేషన్లు చెల్లవు

ఆరు వారాల్లోగా స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభించండి 

రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం 

చంద్రబాబు ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ కొట్టివేత 

చట్టపరంగా చెల్లదని తెలిసీ మభ్యపెడుతూ బాబు డ్రామాలు

ప్రభుత్వం నిర్వహించిన సర్వే (సమగ్ర కుటుంబ సర్వే), డేటాను ఆ కమిషన్‌ ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది? ఈ సర్వేను ఏ చట్టం కింద చేశారు? ఆ చట్టం ఏమిటో మాకు చూపించండి. ఆ సర్వే ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు చెప్పడంలో తప్పేముంది?   – సుప్రీం ధర్మాసనం

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ఎన్నికల మోసాలు, కపట నాటకం, మాయ వేషాలు సుప్రీంకోర్టు సాక్షిగా మరోసారి తేలిపోయాయి! బీసీ రిజర్వేషన్‌లపై బాబు దొంగాటకు నిమిషాల వ్యవధిలోనే అత్యున్నత న్యాయస్థానంలో తెర పడింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు వైఖరి అంతా బూటకమని బహిర్గతమైంది. చంద్రబాబు మోసపూరిత తీరును సాక్షాత్తూ సుప్రీంకోర్టు 1.42 నిమి­షాల్లోనే బయటపెట్టింది. చంద్రబాబు సర్కారు చెల్లని డెడికేటెడ్‌ కమి­షన్‌ను ఏర్పాటు చేయడం.. ఆ కమిషన్‌ స్వతంత్రంగా వ్యవహరించకుండా కట్టడి చేయడం.. ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే దానికి అందించి దాని ఆధారంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామనడం.. జీవోలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. 

కమిషన్‌ నివేదిక పెండింగ్‌లో ఉందా లేదా? అలాంటప్పుడు దేని ఆధారంగా జీవోలిచ్చారని నిలదీసింది. ప్రభుత్వం చేసిన సర్వే (సమగ్ర కుటుంబ సర్వే), డేటాను ఆ కమిషన్‌ ఎలా పరిగణనలోకి తీసుకుంటుందని విస్మ­యం వ్యక్తం చేసింది. అంతేకాక ఈ సర్వేను ఏ చట్టం కింద చేశారు? ఆ చట్టం ఏమిటో మాకు చూపించండి.. అంటూ సూటిగా చంద్రబాబు సర్కారును నిలదీసింది. ఈ విషయంలో హైకోర్టు సరైన వైఖరినే తీసుకుందని స్పష్టం చేసింది. స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న గత తీర్పులను ఉద్దేశపూర్వకంగా బేఖాతర్‌ చేస్తూ.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం బాబు సర్కారు ఇచ్చిన జీవోలను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీం కోర్టు సమర్థించింది. 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం తప్పుబట్టింది. ఈ మేరకు హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను (ఎస్‌ఎల్‌పీ) కొట్టి వేసింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా గ్రామ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోగా ప్రారంభించాలని ఎన్నికల, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ శీల్‌ నాగులతో కూడిన ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.  

చట్టపరంగా  చెల్లదని తెలిసీ చంద్రబాబు బూటకపు జీవోలతో ఈ డ్రామాను నడిపినట్లు తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి స్పష్టమైంది. గతేడాది తెలంగాణ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% దాటడంతో అప్పటికే నోటిఫికేషన్‌ వెలువడినప్పటికీ ఎన్నికల ప్రక్రియను నిలిపి వేయాలంటూ అక్కడి హైకోర్టు ఆదేశాలిచ్చింది. గతంలో చాలా రాష్ట్రాల్లోనూ ఇదే జరిగింది.  రిజర్వేషన్లు 50% దాటకూడదంటూ కోర్టులు స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. కోర్టులో న్యాయ సమీక్షకు నిలబడదని తెలిసి కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ పార్టీ నేతలతో చంద్రబాబు పాలాభిషేకాలు చేయించుకున్నారు. అనుకూల ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంతో మభ్యపుచ్చే యత్నం చేశారు.

ప్రభుత్వ సర్వే ఆధారంగా కమిషన్‌ నివేదిక ఇచ్చిందని హైకోర్టు తేల్చిందిగా..?:  సుప్రీం
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణకు రాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటొచ్చా లేదా? అనే ప్రశ్న చాలాకాలంగా ఉత్పన్నమవుతోందన్నారు. స్థానిక సంస్థల వారీగా ప్రభుత్వం సేకరించిన ‘యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే’ (సమగ్ర కుటుంబ సర్వే) డేటాను హైకోర్టు విశ్వసించకపోవడానికి ఎలాంటి కారణం లేదని రోహత్గి వాదించారు. 

ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆ సర్వే ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించింది. అంతేకాక రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి అవసరమైన శాస్త్రీయ డేటా ఏదీ కమిషన్‌ వద్ద లేదని, అందువల్ల దాన్ని పరిగణనలోకి తీసుకోలేమని కూడా హైకోర్టు చెప్పిందిగా? అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్‌ కమిషన్‌ నియామకాన్ని ఎవరూ సవాలు చేయకపోవడంతో తాము ఆ కమిషన్‌ చట్టబద్ధత జోలికి వెళ్లడం లేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొందని, ఇది చాలా సహేతుకమైన వైఖరి అని తెలిపింది.

అసలు ఏ చట్టం కింద ఆ సర్వే చేశారు?
కమిషన్‌ తన నివేదికను సమర్పించినప్పటికీ, ప్రభుత్వం దానిని ఆమోదించని విషయాన్ని హైకోర్టు స్పష్టంగా పేర్కొందని సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది. ఈ సమయంలో రోహత్గీ జోక్యం చేసుకుంటూ, ఆ నివేదిక ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన డేటాపై ఆధారపడిందని, దానిని తాము పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని ధర్మాసనం స్పష్టం చేసింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కమిషన్‌ నివేదిక ఇచ్చిందని రోహత్గీ నివేదించగా...  ‘అసలు ఈ సమగ్ర కుటుంబ సర్వేను ఏ చట్టం కింద చేపట్టారు? ముందు మాకు ఆ చట్టాన్ని చూపండి’ అని ధర్మాసనం పేర్కొంది. 

విచారణ వచ్చే వారానికి వాయిదా వేయాలని రోహత్గీ కోరగా, ధర్మాసనం అందుకు నిరాకరించింది. ఇది 57 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన కేసు అని రోహత్గీ ప్రస్తావించగా.. సారీ.. డిస్మిస్‌ అంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. మరోసారి రోహత్గీ జోక్యం చేసుకుంటూ.. డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక ఇక్కడే ఉందని, దానిని పరిశీలించాలని  కోరగా,  హైకోర్టు చాలా సహేతుకమైన వైఖరితో తీర్పునిచ్చిందని సుప్రీం ధర్మాసనంస్పష్టం చేసింది. 

డమ్మీ కమిషన్‌..
డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక విషయంలో చంద్రబాబు సర్కారు తీరుపై ఆది నుంచి సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కమిషన్‌ నివేదికను బహిర్గతం చేయకపోవడాన్ని ఇప్పటికే హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కమిషన్‌ నివేదికను ఇంకా పరిగణనలోకి తీసుకోలేదని ఒకపక్క ప్రభుత్వం చెబుతోంది. మరి పట్టించుకోని కమిషన్‌ ఆధారంగా చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పించినట్లు? డమ్మీ కమిషన్‌ ఇచ్చిన నివేదిక చెల్లదని చంద్రబాబుకు తెలియదా? ఇదే విషయాలను హైకోర్టు సైతం ప్రస్తావించింది.

అయితే హైకోర్టు తీర్పు తరువాత కూడా చంద్రబాబు బీసీలను మోసం చేయడం మానలేదు. అదొక డమ్మీ కమిషన్‌ అని హైకోర్టు తేల్చినా చంద్రబాబు ఆ కమిషన్‌ను మరికొంత కాలం పాటు పొడిగించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా డెడికేటెడ్‌ కమిషన్‌ విషయంలో హైకోర్టు తీర్పును సమర్థించింది. అంతే కాదు.. చంద్రబాబు  ప్రభుత్వానికి డెడికేటెడ్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికను పరిశీలించాలన్న వినతిని సైతం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. తద్వారా ఆ కమిషన్‌ నివేదికకు ఏమాత్రం విలువ లేనే లేదని చెప్పినట్లయింది. 

చట్టం తెలియదా బాబూ? 
అధికారంలోకి వచ్చేందుకు తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబుకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు పార్లమెంట్‌లో చట్టం చేయకుండా సాధ్యం కాదన్న సంగతి స్పష్టంగా తెలుసు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని తరచూ చెప్పుకునే చంద్రబాబుకు చట్టం తెలియదంటే ఎవరు నమ్ముతారు? అన్నీ తెలిసి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. హామీ ఇద్దాం.. ఎలాగూ కోర్టులు దాన్ని కొట్టేస్తాయి..  ఆ నెపాన్ని న్యాయస్థానాలపై నెట్టేయవచ్చునన్న రీతిలో బాబు వ్యవహరించారు. 

గతంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దీన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు తనకు సన్నిహితుడైన బిర్రు ప్రతాప్‌రెడ్డిని రంగంలోకి దించారు. వైఎస్‌ జగన్‌ కల్పించిన రిజర్వేషన్లను హైకోర్టులో సవాలు చేయించి అక్కడ కొట్టేయించారు. సుప్రీంకోర్టులో కూడా కొట్టేసేలా చేశారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలో కీలక పదవుల్లో ఉన్న టీడీపీ నేతలు నాడు వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం చేశారు. 34 శాతం రిజర్వేషన్లు తాము అమలు చేసి చూపిస్తామంటూ నమ్మబలికారు.  

50 శాతం పరిమితి దాటిన రిజర్వేషన్లు..
రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ ఏడాది ఆగస్టు 20న చంద్రబాబు సర్కారు జీవో ఎంఎస్‌ నంబర్‌ 105 జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆగస్టు 19న జీవో ఆర్టీ నంబర్‌ 1065 తీసుకొచ్చింది. అయితే గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు ఏకంగా 61.08 శాతానికి చేరుకున్నాయి. ఇది ఇందిరా సహానీ, డాక్టర్‌ కె.కృష్ణమూర్తి, వికాస్‌ కిషన్‌ రావ్‌ గవాలీ కేసుల్లో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం గరిష్ట పరిమితిని ఉల్లంఘించడమే. 

సరైన శాస్త్రీయ అధ్యయనం లేకుండా, రిజర్వేషన్ల వర్గీకరణను (ఏ,బీ,సీ,డీ,ఈ) అమలు చేయకుండా కేవలం కుటుంబ సర్వే ఆధారంగా ఒకే బ్లాక్‌గా రిజర్వేషన్లు కల్పించడాన్ని హైకోర్టులో పిటిషనర్లు సవాల్‌ చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్ల జీవోలను ఈ నెల 1న కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. తీర్పునిచ్చిన నాటి నుంచి ఆరు వారాల్లోపు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement