
ఏడాదిలోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన చంద్రబాబు సర్కారు
బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులే అప్పులు
ఏడాదిలోనే ఇంత భారీగా అప్పు చేయడంలో రికార్డు
మంగళవారం తాజాగా మరో రూ.3,600 కోట్లు అప్పు చేసిన వైనం
దీంతో ఏడాదిలోనే బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.1,23,702 కోట్లు
బడ్జెట్ బయట అప్పులు మరో రూ.62,410 కోట్లు
ఇంత అప్పు చేసినా అమలు కాని సూపర్ సిక్స్ హామీలు
సంపద సృష్టిస్తానన్న బాబు మాటలు నీటి మూటలే
ప్రతి మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా పాలన
సాక్షి, అమరావతి: సంపద సృష్టించకపోగా ఏడాది పాలనలోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంలో సీఎం చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల ఎడా పెడా అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఏడాదిలోనే ఇంత భారీగా అప్పులు చేయలేదు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. తాజాగా మంగళవారం రూ.3,600 కోట్లు అప్పు చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చేసిన.. చేయాలని నిర్ణయించిన అప్పులు ఏకంగా రూ.1,86,112 కోట్లకు చేరాయి.
ఏడాదిలోనే ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపారు తప్ప సూపర్ సిక్స్ హామీల అమలు ద్వారా ప్రజలికిచ్చేందేమీ లేదు. మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్‌బీఐ రాష్ట్రప్రభుత్వానికి 6.88 శాతం వడ్డీకి రూ.3,600 కోట్ల రుణం సమీకరించింది. ఈ అప్పుతో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.1,23,702 కోట్లకు చేరాయి. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.31,410 కోట్లు అప్పు చేస్తోంది.
ఇందులో ఇప్పటికే చాలా వరకు అప్పులు చేయగా, ఇటీవల కేబినెట్ సమావేశంలో 2013 కంపెనీల చట్టం కింద ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా మరో రూ.10,000 కోట్లు అప్పు చేయడానికి నిర్ణయం తీసుకుంది. అలాగే ఏపీ ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఇంకో రూ.1,000 కోట్లు అప్పు చేయడానికి ఇటీవల కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని, జీవో కూడా జారీ చేశారు.
సంపద సృష్టి దేవుడికే ఎరుక!
రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ, హడ్కో నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేస్తోంది. రాజధాని అప్పులకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసినా, సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ఏడాది పాలన పూర్తి చేశారు. సంపద సృష్టించడం దేవుడెరుగు.. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర హామీలను అమలు చేయకుండా అదనంగా ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారు.

ఏడాది పాలనలో ఏమైనా చంద్రబాబు ప్రభుత్వం చేసిందంటే భారీగా అప్పులు చేయడం తప్ప ఏమీ లేదని స్పష్టం అవుతోంది. ఏపీఎండీకి చెందిన 436 మైనర్ లీజుల విలువ రూ.1,91,000 కోట్లుగా చూపించి, తద్వారా ప్రైవేట్ బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.9,000 కోట్లు అప్పు చేసింది. ఇందు కోసం బాబు సర్కారు ప్రైవేట్ వ్యక్తులకు ఖజానాను తాకట్టు కూడా పెట్టింది.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం ఎక్కువ అప్పులు చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చంద్రబాబు భారీగా అప్పులు చేస్తున్నా, ఎల్లో మీడియా ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం లేదు. మంగళవారం మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతోంది.