విశాఖలో డేటా సెంటర్‌కు 480 ఎకరాలు కేటాయిస్తున్నట్లు 2025 అక్టోబర్ 11న చంద్రబాబు సర్కారు జారీ చేసిన జీవో కాపీ. (ఇందులో ఎక్కడా అదానీ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం)
ఇప్పటికే ఎన్‌టీపీసీ, రెన్యూ పవర్‌ను తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తన ఘనతేనంటూ బుకాయింపు
గత ప్రభుత్వ కృషితో సాకారమైన అదానీ డేటా సెంటర్‌కు మళ్లీ కొబ్బరికాయ
అది అదానీ డేటా సెంటరేనని ఆధారాలతో బహిర్గతం చేసిన వైఎస్ జగన్
భూములు, రాయితీలు అదానీ పేరిట బదలాయిస్తూ సవరణ జీవోలు
జారీ చేయడమే చంద్రబాబు సర్కారు క్రెడిట్ దోపిడీకి నిదర్శనం
సాక్షి, అమరావతి: మొన్న ఎన్టీపీసీ గ్రీన్ పవర్.. నిన్న రెన్యూ పవర్.. నేడు డేటా సెంటర్..! విశాఖ కేంద్రంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచారు. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా మారుస్తున్నానంటూ రెండు రోజుల క్రితం రెన్యూ పవర్ శంకుస్థాపన సభలో ప్రకటించిన సీఎం చంద్రబాబు తాజాగా తాను తెచ్చిన గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖ విశ్వనగర మంటూ అనుకూల మీడియాలో ప్రచారానికి తెర తీశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో విశాఖలో అదానీ డేటా సెంటర్ సాకారం కాగా అందుకోసం 3,900 కి.మీ. పొడవున సబ్‌సీ (సముద్ర గర్భం) కేబుళ్లు కోసం గత ప్రభుత్వం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాయడం తెలిసిందే.
ఇప్పుడు అదే డేటా సెంటర్‌ను గూగుల్ డేటా సెంటర్ అంటూ చంద్రబాబు సర్కారు క్రెడిట్ దోపిడీకి పాల్పడుతోంది. అయితే అది అదానీ డేటా సెంటరే అని సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్ ఇప్పటికే బయటపెట్టడంతో చంద్రబాబు సర్కారు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. డేటా సెంటర్‌పై గూగుల్‌తో ఒప్పందం సమయంలో ఉద్దేశపూర్వకంగా అదానీ పేరును తొక్కి పెట్టి క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసిన విన్యాసాలు విఫలమయ్యాయి. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌ను అదానీ, భారతీ ఎయిర్‌టెల్ గ్రూపుల భాగస్వామ్యంతో గూగుల్ ఏర్పాటు చేస్తోందని అంగీకరించడంతోపాటు భూములు అదానీ పేరిటే బదలాయించి ప్రోత్సాహకాలు సైతం కల్పిస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేయడమే దీనికి నిదర్శనం.
బాబు సమక్షంలోనే తేల్చేసిన అదానీ..
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గతేడాది అక్టోబర్ 14న ఢిల్లీలో ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంలో చంద్రబాబు సర్కారు ఉద్దేశపూర్వకంగానే అదానీ పేరును ప్రస్తావించలేదు.
అయితే అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ స్పందిస్తూ ఈ డేటా సెంటర్‌లో తాము భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. భారతీ ఎయిర్‌టెల్ గ్రూప్ కూడా ఈ డేటా సెంటర్‌లో తాము భాగస్వాములమంటూ ట్వీట్ చేసింది. గూగుల్‌తో కలిసి తాము రూ.15 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ సీఎం చంద్రబాబు సమక్షంలోనే ప్రకటించడంతో ముఖ్యమంత్రితో పాటు వేదికపైన ఉన్న మంత్రుల మొహాలు ఒక్కసారిగా మాడిపోయిన సంగతి తెలిసిందే.

జీవో సాక్షిగా బండారం బద్ధలు..
చంద్రబాబు క్రెడిట్ చోరీని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాక్ష్యాధారాలతో మీడియా సమక్షంలో ఎండగట్టిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే గూగుల్‌తో ఒప్పందం సమయంలో సీఎం చంద్రబాబు అదానీ పేరెత్తలేదన్న విషయాన్ని బయటపెట్టారు. వైఎస్ జగన్ చెప్పిన ప్రతీ అక్షరం సత్యమేనని చంద్రబాబు సర్కారు విడుదల చేసిన జీవో సాక్షిగా రుజువైంది.
క్రెడిట్ చోరీని కప్పిపుచ్చేందుకు తొలుత గూగుల్ పేరిట జీవో విడుదల చేసి ఆ తర్వాత ఆ భూములను అదానీ ఇన్‌ఫ్రా పేరుమీదకు బదలాయించడమే దీనికి తార్కాణం. ఒకపక్క కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2020 నవంబర్‌లో విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. డేటా సెంటర్‌కు డేటా వచ్చేందుకు వీలుగా 3,900 కి.మీ. పొడవున సముద్ర గర్భంలో కేబుళ్ల ఏర్పాటుకు 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.
వైఎస్ జగన్ కృషితో సాకారం..
గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అదానీతో జత కట్టడమే కాకుండా నోయిడాలో అదానీ నిర్మించిన డేటా సెంటర్‌ను 2022 అక్టోబర్ 11న లీజుకు తీసుకుంది. ఈ క్రమంలో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న మాజీ సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. డేటా సెంటర్ కోసం గత ప్రభుత్వం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. చంద్రబాబు సర్కారు చెబుతున్న డేటా సెంటర్‌ను తాము నిర్మించడం లేదని.. దీన్ని అదానీ గ్రూపే చేపడుతోందని, అందువల్ల భూమిని కూడా అదానీ ఇన్‌ఫ్రాకే కేటాయించాలని కోరుతూ గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ గతేడాది అక్టోబర్‌లో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌కు లేఖ రాశారు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. గత ప్రభుత్వ కృషితో సాకారమైన డేటా సెంటర్‌ను చంద్రబాబు అబద్ధాలతో తన ఖాతాలో ఎలా వేసుకున్నారో వైఎస్ జగన్ సాక్ష్యాలతో ఎండగట్టిన విషయం తెలిసిందే. డేటా సెంటర్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్‌సీ కేబుళ్లు సింగపూర్ నుంచి విశాఖకు ఏర్పాటుకు వైఎస్ జగన్ అంకురార్పణ చేశారు. ఈ డేటా సెంటర్ ద్వారా విశాఖలో ఎకో సిస్టమ్ ఏర్పడుతుందని తద్వారా గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ వస్తాయని వైఎస్ జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.


