లింగమనేని రమేష్ మోసం చేశారు: చైతన్య గ్రూప్ ఛైర్మన్ బీఎస్ రావు

సాక్షి, అమరావతి: చైతన్య గ్రూప్ ఆఫ్ కాలేజీస్ ఛైర్మన్ బీఎస్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్య విద్యా సంస్థల విస్తరణకు డబ్బు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు లింగమనేని రమేష్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరకట్టపై ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు అప్పగించాడు లింగమనేని రమేష్.
కాగా, బీఎస్ రావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. లింగమనేని రమేష్‌కు 2012-13లో రూ.310 కోట్లు ఇచ్చాం. చైతన్య విద్యా సంస్థల విస్తరణకు డబ్బు తీసుకున్నారు. లింగమనేని కావాలనే మమ్మల్ని మోసం చేశాడు. రమేష్ ఇచ్చిన 10 చెక్కులు చెల్లలేదు. లింగమనేని మోసాలపై హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాం. ఆయన మోసాలపై ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. తీసుకున్న డబ్బుకు మాకు న్యాయం చేస్తానని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చారు. 2016లో ఎంవోయూ రాసి భూములు ఇప్పిస్తా అని హామీ ఇచ్చారు. కానీ, పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. లింగమనేని చేసిన మోసాలపై ఇప్పటివరకు 6 FIR లు ఫైల్ అయ్యాయని తెలిపారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు వేయగా.. లింగమనేని చేసిన మోసాలపై నెలవారీగా తనకు వడ్డీతో సహా చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని బీఎస్ రావు తెలిపారు.