PG Medical Seats: కేంద్రం కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్‌కు 630 పీజీ వైద్యసీట్లు

Central Govt Approved Andhra Pradesh Proposal 630 New PG Medical Seats - Sakshi

11 మెడికల్‌ కాలేజీలకు కొత్త సీట్లు

అత్యధికంగా ఆంధ్రా మెడికల్‌ కాలేజీకి 128 

అత్యల్పంగా నెల్లూరు మెడికల్‌ కాలేజీకి 5 సీట్లు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో పీజీ వైద్యసీట్ల పంట పండింది. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ప్రభుత్వం ఒకేసారి 630 పీజీ వైద్యసీట్లను తెచ్చింది. ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అండర్‌ సెక్రటరీ చందన్‌కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ సర్కారుకు అనుమతిస్తూ లేఖ రాశారు. ఈ మేరకు ఎంవోయూ పంపిస్తున్నామని, దీనికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాలేజీల వారీగా ఎంవోయూకు ఆమోదం తెలపాలని సూచించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యకళాశాలలు పీజీలు, సీనియర్‌ రెసిడెంట్‌లతో కళకళలాడనున్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలున్నాయి. ఆయా కాలేజీలు రెండునెలల కిందట సెంట్రల్‌ స్పాన్సర్‌షిప్‌ కింద 688 సీట్లకు ప్రతిపాదన పంపించాయి. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ 630 పీజీ వైద్యసీట్లకు ఆమోదముద్ర వేసింది. 

భారీగా నియామకాలు చేసినందునే..
రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా కనివినీ ఎరుగని రీతిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకం జరిపినందునే పీజీ సీట్లు మంజూరు చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. గత మూడున్నరేళ్లలో దాదాపు 455 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించారు. 2,500 మందికిపైగా పారామెడికల్‌ సిబ్బందిని నియమించారు.

దీంతోపాటు నాడు–నేడులో భాగంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇవన్నీ చేయడం వల్లనే కేంద్రం కొత్త పీజీ వైద్యసీట్లకు ఆమోదముద్ర వేసింది. తాజాగా మంజూరైన సీట్లలో జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్‌ ఇలా సుమారు 18 విభాగాలకు సంబంధించిన పీజీ వైద్యసీట్లు ఉన్నాయి. అత్యధికంగా ఆంధ్రా మెడికల్‌ కళాశాలకు 128 సీట్లు రాగా అత్యల్పంగా నెల్లూరు మెడికల్‌ కాలేజీకి 5 సీట్లు వచ్చాయి. 

సూపర్‌ స్పెషాలిటీ సేవలు
కొత్తగా పీజీ వైద్యసీట్లతో పాటు సూపర్‌ స్పెషాలిటీ సీట్లు కూడా వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా కొత్తగా సీట్లొచ్చాయి. దీనివల్ల సామాన్యులకు స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ పరిధిలో సీట్లు పెరగడం పేద వైద్యవిద్యార్థులకూ మంచి పరిణామం.
– డాక్టర్‌ హరిచరణ్, వైస్‌ ప్రిన్సిపాల్, కర్నూలు మెడికల్‌ కాలేజీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top