తొలి దశగా ఇళ్ల జాబితా లిస్టింగ్ స్వీయ గణన
ప్రతి ఒక్కరూ కచ్చితమైన సమాచారం ఇవ్వాలి
దేనికీ రుజువులు, పత్రాలు అడగబోము
ప్రజలే స్వీయ గణనను యాప్‌లో చేయాలి
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనాభా గణన
రాష్ట్ర జనాభా గణన డైరెక్టర్ నివాస్ వెల్లడి
సాక్షి, అమరావతి: జనాభా గణన–2027 ప్రక్రియ రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర జనాభా గణన డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు. తొలి దశగా ఇళ్ల జాబితా, ఇళ్ల గణనతోపాటు స్వీయ గణన మొదలవుతుందని చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా గణన–2027 ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా గణన యాప్‌లో నమోదు చేసేందుకు గురువారం నుంచి ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించినట్లు ఆయన చెప్పారు.
ఇళ్ల జాబితా, ఇళ్ల గణన మే 1 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. స్వీయ గణన అనేది మంచి విధానమని, ప్రజలు తమ వివరాలను సరిగా నమోదు చేశామనే విశ్వాసం పొందుతారన్నారు. స్వీయ గణన అనంతరం జనాభా గణన సిబ్బంది కూడా ప్రజలు సరిగా నమోదు చేశారా? లేదా ? అని పరిశీలన చేస్తారన్నారు. దీనివల్ల జనాభా గణన సిబ్బంది పని సులభమవుతుందన్నారు.
జనాభా గణనకు 1.10 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు
జనాభా గణనకు 1.10 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లను వినియోగిస్తామని నివాస్ చెప్పారు. జనాభా గణన సిబ్బంది 80 శాతం మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే ఉంటారని తెలిపారు. జనాభా గణనకు వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించాలని, వాస్తవ సమాచారం ఇవ్వాలని కోరారు. జనాభా గణన సిబ్బందికి ఆటంకాలు కల్పిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. 2027 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉన్న జనాభా ఆధారంగా జనగణన జరుగుతుందన్నారు. 2011లో చివరి జనగణన నిర్వహించగా, 2027లో జరగబోయేది 16వదని, స్వాతంత్య్రం వచ్చాక ఎనిమిదో విడత అని వివరించారు.
స్వీయ గణన ఇలా...
» ప్రజలు https://se.census.gov.in పోర్టల్‌లో తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి, ఇంటిని జియో–ట్యాగ్ చేసి వివరాలు నమోదు చేయాలి. అది పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేకమైన స్వీయ గణన ఐడీ జనరేట్ అవుతుంది. ఈ ఐడీని ఎన్యూమరేటర్‌కు అందజేసి క్షేత్రస్థాయి తనిఖీ సమయంలో ధ్రువీకరించాల్సి ఉంటుంది.
» వాటికి అదనంగా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వంట ఇంధనం, స్నాన సౌకర్యం, వంటగది వంటి సౌకర్యాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కుటుంబ ఆస్తులు (టీవీ, ఇంటర్నెట్, మొబైల్, వాహనాలు), ప్రధాన ఆహారం, మొబైల్ నంబర్ వంటి వివరాలు కూడా నమోదు చేయాలి.
» జనాభా గణన సందర్భంగా విద్య, కులం వంటివాటి ధ్రువీకరణకు ఎటువంటి రుజువులు, పత్రాలు అడగరు.
» జనాభా గణనకు ఆధార్ నంబర్‌తో సంబంధం లేదు.
» జనాభా గణన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఆ సమయంలో కుల గణనకు కూడా కేంద్ర ప్రభుత్వం
మార్గదర్శకాలను జారీ చేస్తుంది.
» ఇళ్ల జాబితా, ఇళ్ల గణన మే 1 నుంచి 30 వరకు కొనసాగుతుంది. ఇళ్ల జాబితా సేకరణలో భవనాలు, ఇళ్లకు నంబర్లు ఇస్తారు. గృహ జాబితా దశలో మొత్తం 33 ప్రశ్నలకు వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఇందులో గృహ నిర్మాణ అంశాలు (ఫ్లోర్, గోడ, పైకప్పు), గృహ వినియోగం, గృహ స్థితి, కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబ యజమాని వివరాలు, ఎస్సీ, ఎస్టీ సామాజిక స్థితి, గదుల సంఖ్య, నివాసం ఉంటున్న వివాహిత జంటలు వంటి అంశాలు ఉంటాయి.


