అప్పుల్లో నెల నెలాభివృద్ధి! | CAG Report on Key Budget Indicators up to February of the Current Financial Year | Sakshi
Sakshi News home page

అప్పుల్లో నెల నెలాభివృద్ధి!

Mar 22 2026 4:11 AM | Updated on Mar 22 2026 4:11 AM

CAG Report on Key Budget Indicators up to February of the Current Financial Year

బడ్జెట్‌ అంచనాలను మించి ఫిబ్రవరి నాటికే రూ.14,467 కోట్ల అప్పు 

2023–24తో పోల్చితే 2025–26లో రెవెన్యూ రాబడులు రూ.3,274 కోట్లు తగ్గుదల 

అమ్మకం పన్ను, పన్నేతర రాబడి తిరోగమనం 

కేంద్ర గ్రాంట్లలో ఏకంగా రూ.14,852 కోట్లు తగ్గుదల 

అంచనాలను మించి పెరిగిన రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు 

ఈ ఆర్థిక ఏడాది ఫిబ్రవరి వరకు బడ్జెట్‌ కీలక సూచికలపై కాగ్‌ నివేదిక వెల్లడి  

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఓ వైపు నెల నెలా అప్పులు చేయడంలో భారీ వృద్ధి నమోదు చేస్తూ, మరో వైపు రెవెన్యూ రాబడుల్లో నెల నెలా అథమ స్థాయికి దిగజారిపోతోంది. అప్పులు చేయడంపై చూపిస్తున్న శ్రద్ధ రెవెన్యూ రాబడులు పెంచడం ద్వారా సంపద సృష్టిపై చూపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక ఏడాది ఫిబ్రవరి వరకు బడ్జెట్‌ కీలక సూచికలపై కాగ్‌ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ప్రస్తుత ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికే బడ్జెట్‌ అంచనాలను మించి అప్పులు చేసినట్లు కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. 

ప్రస్తుత ఆర్థిక ఏడాది అంటే మార్చి ఆఖరు నాటికి   రూ.79,926 కోట్ల అప్పు చేయనున్నట్లు బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొనగా, ఫిబ్రవరి నాటికే ఏకంగా రూ.94,393 కోట్లు అప్పు చేసింది. అంటే బడ్జెట్‌ అంచనాలను మించి రూ.14,467 కోట్లు అప్పు చేసింది. మరో పక్క రెవెన్యూ రాబడుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తోంది. 

2023–24 ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి నాటికి వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా ఈ ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రాకపోవడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. రెవెన్యూ రాబడులు 2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.1,52,820 కోట్లు రాగా, ప్రస్తుత ఆర్థిక ఏడాది (2025–26) ఫిబ్రవరి నాటికి రూ.1,49,546 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే రెవెన్యూ రాబడుల్లో రూ.3,274 కోట్లు తగ్గిపోయాయి. సాధారణంగా ఏటా ఎంతో కొంత మేర రెవెన్యూ రాబడులు పెరుగుతాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. 

ఆర్థికంగా దిగజారిపోతున్న రాష్ట్రం 
రెవెన్యూ రాబడులు తగ్గడం అంటే రాష్ట్రం ఆర్థికంగా దిగజారిపోతోందని స్పష్టం అవుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచి్చన నాటి నుంచి ప్రతి నెలా  అమ్మకం పన్ను రాబడితో పాటు పన్నేతర ఆదాయం, ఇతర పన్నులు, డ్యూటీలు రాబడితో పాటు కేంద్ర గ్రాంట్లు తిరోగమనమే తప్ప పురోగమనం లేదు. అమ్మకం పన్ను రాబడి 2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.16,860 కోట్లు ఉంటే, 2025–26 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.16,304 కోట్లు మాత్రమే. అంటే రూ.556 కోట్లు తగ్గిపోయింది. 

ఇతర పన్నులు, డ్యూటీల రూపంలో రాబడి 2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.6,549 కోట్లు వస్తే, 2025–26లో అదే సమయానికి రూ.4,955 కోట్లే వచ్చాయి. అంటే రూ.1,594 కోట్ల రాబడి తగ్గిపోయింది. పన్నేతర రాబడి 2023–24 ఫిబ్రవరి నాటికి రూ.6,740 కోట్లు వస్తే, 2025–26 ఫిబ్రవరి నాటికి రూ.5,067 కోట్లే వచ్చాయి. రూ.1,673 కోట్లు రాబడి తగ్గిపోయింది.  

కేంద్ర గ్రాంట్లలోనూ విఫలం
కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం బాగస్వామిగా ఉన్నప్పటికీ, కేంద్ర గ్రాంట్లను రాబట్టడంలో విఫలమైంది. 2023–24 ఫిబ్రవరి నాటికి కేంద్ర గ్రాంట్ల రూపంలో రూ.29,589 కోట్లు రాగా, 2025–26 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి అవి రూ.14,737 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే రూ.14,852 కోట్లు తగ్గిపోయాయి. విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు చెందిన సామాజిక రంగ వ్యయం కూడా చంద్రబాబు హయాంలో తగ్గిపోయింది. 

2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి సామాజిక రంగ వ్యయం రూ.1,16,413 కోట్లు ఉంటే, 2025–26 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.1,02,423 కోట్లే ఉంది. అంటే సామాజిక రంగ వ్యయం రూ.13,990 కోట్లు తగ్గిపోయింది. మరో పక్క రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగినట్లు కాగ్‌ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రెవెన్యూ లోటు రూ.60,812 కోట్లకు, ద్రవ్యలోటు రూ.91,310 కోట్లకు చేరినట్లు కాగ్‌ తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement