ఫొటోగ్రాఫర్‌ నుంచి మంత్రి స్థాయికి..

BJP Senior Leader Pydikondala Manikyala Rao Funeral In West Godavari - Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు (60) కన్నుమూశారు. విజయవాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కరోనాతో పాటు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, మధుమేహంతో కొన్నిరోజులుగా బాధపడుతున్న ఆయన ఒక్కసారిగా ఆరోగ్యంలో మార్పు రావడంతో ప్రాణాలు విడిచారు. కరోనా నెగెటివ్‌ వచ్చినప్పటికీ ఇతర సమస్యలు ఆయనను ఇబ్బంది పెట్టడంతో ఆరోగ్యం క్షీణించింది.

బీజేపీ అగ్రనేతల ఆదేశాలతో న్యూఢిల్లీలోని ఆలిండియా మెడికల్‌ సైన్సెస్‌ బృందం వెంటిలేటర్‌పై ఉన్న మాణిక్యాలరావుకు వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయింది. శనివారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ప్రాణాలు విడిచారు. ఆయనకు భార్య సూర్యకుమారి, కుమార్తె గట్టిం సింధు, అల్లుడు  నవీన్‌కిషోర్‌ ఉన్నారు. గతనెల 3న కరోనా పాజిటివ్‌ రావడంతో విజయవాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన కొద్దిరోజుల్లో కరోనా నెగెటివ్‌ వచ్చినా ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రాణాలు వదిలారు.

మాణిక్యాలరావు పార్థివదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తున్న దృశ్యం 

అసామాన్యుడిగా ఎదిగిన సామాన్యుడు 
పైడికొండల సుబ్బారావు, రంగనాయకమ్మ దంపతుల తొలి సంతానం మాణిక్యాలరావు. ఆయనకు ఇద్దరు చెల్లెళ్లు. మాణిక్యాలరావు సామాన్య ఫొటోగ్రాఫర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. తాడేపల్లిగూడెంలోని కేఎన్‌ రోడ్డులో ప్రభాతా టాకీస్‌ వద్ద సారథి స్టూడియోను ప్రారంభించారు. తర్వాత స్టూడియోను కుమార్తె సింధు పేరిట సింధు స్టూడియోగా మార్చారు. అనంతర కాలంలో బస్‌ డిపో ఎదురుగా సింధు షూమార్టును ప్రారంభించారు. బాల్యంలోనే రాష్ట్రియ స్వయం సేవక్‌ సిద్ధాంతాలకు ఆకర్షితులై సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 7వ తరగతి చదువుతుండగా జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారు. హైసూ్కల్‌ విద్యార్థి దశలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటం చేశారు. బీజేపీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా పనిచేసిన ఆయన పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయన నరసాపురం ఎంపీగా యూవీ కృష్ణంరాజును గెలిపించడంలో విశేష కృషి చేశారు.

13వ వార్డు శివాలయం వీధిలో కౌన్సిలర్‌గా పోటీచేసి విజయం పొందలేకపోయారు. 2019లో నరసాపురం లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా పైడికొండల పోటీచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం వచ్చినా, తల్లి మరణం కారణంగా ఆ పదవిని స్వీకరించలేదు. సీమాంధ్ర ఉద్యమ కమిటీ ఉపాధ్యక్షుడిగా సీమాంధ్ర అవసరాలను కేంద్ర నాయకుల వద్దకు తీసుకెళ్లారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడిగా ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, 30 మండలాల్లో శీతల శవపేటికల ఏర్పాటు వంటివి చేశారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. అయోధ్య కరసేవలో పాల్గొన్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ కేబినెట్‌లో ఆయన దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.  

నిట్‌ తెచ్చిన ఘనత ఆయనిదే 
రాష్ట్ర విభజన అనంతరం జాతీయ విద్యాసంస్థ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)ను తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేయడంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు నిట్‌ ఇక్కడికి రాకుండా మోకాలడ్డిన సమయంలో కేంద్రంలో పలుకుబడి ఉపయోగించి, బీజేపీ అగ్రనాయకుల ఆశీస్సులతో జాతీయ విద్యాసంస్థను ఇక్కడకు తీసుకువచ్చారు. మంత్రిగా రాష్ట్రంలో నూతన ఆలయాల నిర్మాణానికి కృషి చేశారు. పట్టణంలో బలుసులమ్మ, ముత్యాలమ్మ, నందికొమ్మ రామాలయ నూతన నిర్మాణాలు ఆయన హయాంలోనే జరిగాయి.  

ధైర్యం చెప్పి వెళ్లి..  
‘కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్‌ వచ్చింది. కరోనా వస్తే రహస్యంగా దాయవద్దు. భయపడాల్సిన అవసరం లేదు. ఎయిడ్స్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధి కాదు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, ఆరోగ్యంపై సాధ్యమైనంత శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటే ఇబ్బంది లేదు’ అంటూ ఆయన గతనెల 4న వాట్సాప్‌లో వీడియో సందేశం ఇచ్చి కరోనా చికిత్సకు విజయవాడ వెళ్లారు.  

చిరునవ్వు చిరునామా చెరిగిపోయింది  
వెండిలాంటి జుట్టు, ముఖంపై చిరునవ్వు చిరునామా, రండి, కూర్చోండి అంటూ ఆప్యాయత నిండిన పిలుపు కలబోతగా మాణిక్యాలరావు జనంతో ఉన్నారు. ఆనందం వచ్చినా, కోపం వచ్చినా దాచుకోని వ్యక్తిగా మాణిక్యాలరావు మెలిగారు. ఆయన మరణంతో జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి. 

బీజేపీ అగ్రనేతలతో సత్సంబంధాలు  
బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వంతో మాణిక్యాలరావు సత్సంబంధాలు కొనసాగించారు. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, అగ్రనేతలు అమిత్‌షా వంటి వారితో పాటు జేవీఎల్‌ నరసింహారావు, కిషన్‌రెడ్డి, సోము వీర్రాజు వంటి వారితో స్నేహసంబంధాలు కొనసాగించారు. ఆయనకు కర్ణాటక పార్టీ నేతలతోనూ సంబంధాలు ఉన్నాయి. వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలతో వివిధ వర్గాలతో కలిసిమెలిసి పనిచేశారు.  

నిట్‌ పైడికొండలను మరువదు 
తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్‌ స్థాపనలో కీలకపాత్ర పోషించినందుకు మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును నిట్‌ ఎన్నటికీ మరువదని డైరెక్టర్‌ సీఎస్‌పీ రావు అన్నారు. శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మాణిక్యాలరావు మరణం ఊహించలేదని, కరోనా నుంచి కోలుకుని తిరిగి వస్తారనుకుంటున్న దశలో ఆయన మరణం విషాదకరం అని పేర్కొన్నారు. 

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
దేవదాయ, ధర్మాదాయశాఖ మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు పార్థివదేహానికి అధికార లాంఛనాలతో శనివారం అంత్యక్రియలు జరిగాయి. స్థానిక 6వ వార్డులోని శ్మశాన వాటికలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత పట్టణానికి చేరుకున్న మాణిక్యాలరావు పార్థివదేహాన్ని స్థానిక మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో ఆయన కుటుంబ సభ్యులు కడసారి చూసేందుకు ఉంచారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులు 20 మందిని మాత్రమే శ్మశాన వాటికలోకి అనుమతినిచ్చారు. శ్మశాన వాటిక ప్రాంగణం వద్ద మాణిక్యాలరావు చిత్రపటాన్ని సందర్శనార్థం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వచ్చిన పోలీసు దళం గాలిలోకి కాల్పులు జరిపి గౌరవవందనం సమరి్పంచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ, నాయకులు ఈతకోట తాతాజీ, అయినం బాలకృష్ణ, కంచుమర్తి నాగేశ్వరావు, నల్లకంచు రాంబాబు, తాడికొండ వాసు తదితరులు హాజరయ్యారు.   

సోము వీర్రాజు కన్నీటి పర్యంతం 
మాణిక్యాలరావు అంత్యక్రియల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారాన్ని పంచుకున్న వ్యక్తిని అధికార లాంఛనాలతో పంపించాల్సి వస్తుందని కలలో కూడా  ఊహించలేదన్నారు. 1981లో తన ఆ«ధ్వర్యంలో మాణిక్యాలరావు బీజేపీలో చేరారన్నారు. మాణిక్యాలరావు శాసనసభ్యులుగా, మంత్రిగా ఉత్సాహంగా పనిచేశారన్నారు. అలాంటి వ్యక్తిని ఈ పరిస్థితిలో చూస్తానని అనుకోలేదన్నారు. మాణిక్యాలరావు కుటుంబానికి పార్టీ తరఫున సానుభూతి తెలిపారు. మాణిక్యాలరావు మరణం పారీ్టకి, వ్యక్తిగతంగా తనకు తీరని నష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు. 

మంచి మిత్రుడిని కోల్పోయా 
వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయానని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మరణం పట్ల రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సంతాపం తెలిపారు. దేవదాయ మంత్రిగా జీర్ణావస్థలో ఉన్న పలు ఆలయాలను ఆయన పునరుద్ధరించారన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారన్నారు. నిట్‌ను తాడేపల్లిగూడెం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన తర్వాత  ఆయనతో మాట్లాడానని, ఎంతో ధైర్యంగా ఉన్నారన్నారు. కరోనాను జయించి ఆరోగ్యవంతంగా వస్తారని తాను భావించానని, ఇంతలోనే ఇలా జరగడం అత్యంత బాధాకరం అన్నారు. ఆయన  ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు.  

చాలా బాధ కలిగించింది 
కరోనా మహమ్మారికి మాజీ మంత్రి మాణిక్యాలరావు బలి కావడం చాలా బాధ కలిగించిందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సంతాపం తెలిపారు. మాణిక్యాలరావు క్రమశిక్షణ, నిబద్ధత గల నేత అని అన్నారు. ఉదయం ఆయన అల్లుడుతో ఫోన్‌లో మాట్లాడి యోగ క్షేమాలు కనుక్కుంటే బాగానే ఉందని చెప్పగానే ఎంతో సంతోషించానన్నారు. బీజేపీలో పేరున్న నాయకుడు ఇలాంటి పరిస్థితుల్లో దూరమవ్వడం చాలా బాధాకరం అన్నారు. మాణిక్యాలరావు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని ఎమ్మెల్యే కొట్టు అన్నారు.  

మంత్రి నాని దిగ్భ్రాంతి 
మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతిపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మాణిక్యాలరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నట్లు ఆయన తెలిపారు. సౌమ్యులు, ప్రజల నాయకుడు మూడున్నర దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో నిబద్ధత, నిజాయతీ, అంకితభావంతో పనిచేసిన నేత అని కొనియాడారు.  దేవదాయశాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారని, బీజేపీ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో నిట్‌ విద్యాసంస్థ నెలకొల్పటంలో కీలకంగా వ్యవహరించారని అన్నారు. ఆప్యాయంగా పలకరించే ఆయన మృతి బీజేపీకి తీరని లోటన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top