'కరోనా' సమయంలో.. కానరాని పచ్చ నేతలు! ఫోన్‌లు సైతం.. | Behavior Of TDP Leaders Who Did Not Help People During Corona | Sakshi
Sakshi News home page

'కరోనా' సమయంలో.. కానరాని పచ్చ నేతలు! ఫోన్‌లు సైతం..

May 10 2024 12:44 PM | Updated on May 10 2024 12:44 PM

Behavior Of TDP Leaders Who Did Not Help People During Corona

కరోనావేళ ఆదుకోని టీడీపీ నేతలు

కోవిడ్‌ సమయంలో ఫోన్‌లు సైతం ఎత్తని పరిస్థితి

విశాఖలో అచ్చెన్న.. ఢిల్లీలో ఎంపీ రామ్మోహన్‌

మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

కష్టకాలంలో రూ.707.61కోట్లతో ప్రత్యేక ఆర్థిక సాయం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా నాయకులు జనం కోసం పనిచేయాలి. నమ్ముకున్న వారి క్షేమం కోసం పాటు పడాలి. కానీ టీడీపీ నేతలు ఆపత్కాలంలో ఆప్తులను వదిలేశారు. కోవిడ్‌ మహమ్మారి ఊళ్లకు ఊళ్లను వణికిస్తుంటే.. తమ దారి తాము చూసుకున్నారు. విశాఖలో ఒకరు, ఢిల్లీలో ఇంకొకరు, జనాలకు దూరంగా చాలామంది దాక్కున్నారు. ఓ వైపు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ముమ్మరంగా సాయం చేస్తూ జనాలకు ధైర్యమిస్తూ ఉంటే.. టీడీపీ నాయకులు మాత్రం కనీసం తమ కార్యకర్తల కోసమైనా పనిచేయలేదు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నాయకులు నిరంతరం జనాల్లోనే ఉంటూ వారి బాగోగులు చూసుకున్నారు.  

అధికారంలో ఉన్నంతకాలం ఇసుక, నీరుచెట్టు, ప్రాజెక్టులు, మద్యం, అభివృద్ధి పనుల ముసుగులో కోట్లు వెనకేసుకున్న టీడీపీ నాయకులు జనాలకు ఓ కష్టం వచ్చిన వేళ అండగా నిలవలేకపోయారు. కనీసం సొంత పార్టీ క్యాడర్‌ను కూడా కరోనా కాలంలో వారు పట్టించుకున్న పాపాన పోలేదు. కరోనా కష్టకాలంలో టీడీపీ నేతలు జాడే కానరాలేదు. కనీసం ఫోన్‌లు కూడా ఎత్తడం లేదు.

జిల్లాను కరోనా సెకెండ్‌ వేవ్‌ ఎంతగా కబళించిందో జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. యువత సైతం మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఇంత కష్టకాలంలో టీడీపీ నాయకులు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలీని పరిస్థితి ఉండేది. ఒక్కో నేత ఒక్కో చోట దాక్కుని ఉన్నారు. ఆపద వచ్చినప్పుడు తమ నాయకుడు ఆదుకుంటారని సాధారణంగా నియోజక వర్గ ప్రజలు, కేడర్‌ అనుకుంటారు. తమ నాయకుడు ఏదో ఒక ఆస్పత్రికి చెప్పి, బాగా చూడాలని, మెరుగైన వైద్యం అందించాలంటూ చెబుతారని ఆశిస్తారు. కానీ జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నం. టీడీపీ నేతలు ఎక్కడా ఆ రకంగా స్పందించిన దాఖలాల్లేవు. ఏ ఒక్క నేత కూడా కనీసం పట్టించుకోలేదు.   
దాక్కున్న టీడీపీ నేతలు..
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు స్థానికంగా లేరు. కరోనా సమయంలో విశాఖలో తలదాచుకున్నారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎక్కడున్నారో నాయకులకు కూడా తెలియని పరిస్థితి. నాయకులు ఎవరు ఫోన్‌ చేసినా కనీసం లిఫ్ట్‌ చేయలేదు. సోషల్‌ మీడియాలో మాత్రం హడావుడి చేశారు. తానొక కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభించినట్టు బిల్డప్‌ ఇచ్చారు.

ఆయనేదో వ్యక్తిగతంగా సాయమందిస్తారేమో అనుకుని చాలా మంది ఫోన్లు చేశారు. కానీ ఆయన చేసిందేమీ లేదు. ఇద్దరు వ్యక్తులతో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు వచ్చిన విన్నపాలను అధికారులకు మళ్లించారు. అప్పటికే అధికారులు కంట్రోల్‌ రూమ్‌ నడుపుతున్నారు. వారికి నేరుగా వచ్చే ఫోన్‌లకు స్పందిస్తున్నారు. ఈయన వల్ల మరింత జాప్యం జరిగే పరిస్థితి ఏర్పడింది. కోవిడ్‌ రోగులకు బెడ్‌లు ఎక్కడున్నాయని అడిగితే అధికారులను అడిగి చెబుతామంటూ దాట వేస్తూ చేతులు దులుపుకున్నారు.

మాజీ మంత్రి కళా వెంకటరావు ఎక్కడున్నారో తెలియనట్టుగా ఇంటికి తాళాలు వేసుకుని లోపలే ఉన్నారు. కనీసం కేడర్‌ ఫోన్‌ ఎత్త లేదని ఆ పార్టీ కార్యకర్తలే వాపోయారు. జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ పరిస్థితి దాదాపు ఇంతే. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీ, గౌతు శిరీష, మాజీ ఎమ్మెల్యేలు కోండ్రు మురళీమోహన్, కావలి ప్రతిభా భారతి తదితరులు కరోనా కాలంలో జనాలకు కనిపించనే లేదు.

అందుబాటులో వైఎస్సార్‌సీపీ నేతలు..
కష్టకాలంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. కొందరు నేరుగా ప్రజల వద్దకు వెళ్లగా, మరికొందరు తన పీఏ నంబర్లను ప్రజల వద్ద ఉంచి, ఏ సమస్య వచ్చినా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ విధంగా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు సేవలు పొందారు. తమకు అవకాశం ఉన్న మేరకు స్పందించారు. ఆస్పత్రిలో బెడ్‌ కావాలన్నా, రోగులకు మెరుగైన వైద్యం కోసం, మందులు, ఇతరత్రా అవసరాల కోసం ఎప్పటికప్పుడు స్పందించారు.

  • తమ్మినేని సీతారాం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారు. ఫోన్‌లో కూడా అందుబాటులో ఉన్నారు.

  • డిప్యూటీ సీఎం హోదాలో ధర్మాన కృష్ణదాస్‌ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడమే కాకుండా కోవిడ్‌ ఆస్పత్రులను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరం ఉన్నా స్పందించారు.

  • మంత్రి సీదిరి అప్పలరాజు కూడా అదే రకంగా స్పందించారు. కోవిడ్‌ ఆస్పత్రుల ఏర్పాటు, సేవలందించడంలో తనదైన పాత్ర పోషించారు.

  • ఎమ్మెల్యే రెడ్డి శాంతి అయితే నిరంతరం నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉన్నారు. మహిళా ఎమ్మెల్యే అయినప్పటికీ ధైర్యంగా ప్రజలకు అందుబాటులోనే ఉండి సాయపడ్డారు.

  • శ్రీకాకుళంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కూడా ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందించి సాయం చేయడంలో తమదైన పాత్ర పోషించారు.

  • ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ కరోనా బారిన పడినప్పటికీ తన అనుచరుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నారు.

  • ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ అయితే కరోనా కష్టకాలంలో రిస్క్‌ తీసుకుని పనిచేశారు. జిల్లా యంత్రాంగానికి రెండు ఆక్సిజన్‌ అంబులెన్స్‌లు అందించారు.  

రూ.707.61కోట్లు ప్రభుత్వ సాయం..
కరోనా సమయంలో నిత్యావసర సరుకులకు బయటకు వెళ్లలేని పరిస్థితిలో వైఎస్సార్‌సీపీ నాయకులు వ్యక్తిగతంగా తమ సొంత సొమ్ముతో కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేశారు. ఎక్కడికక్కడ పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ప్రత్యేకంగా వలంటీర్లను పెట్టుకుని తోచినంత సాయం చేశారు.

ఇక ప్రభుత్వం ప్రతీ ఇంటికి సాయం చేసింది. ఒకవైపు కోవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా ఆక్సిజన్‌ సిలిండర్లతో పాటు ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. రోగులకు పౌష్టికాహారం అందజేసింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు ఇంటింటికీ ఉచితంగా మందులు పంపిణీ చేసింది. ముందస్తు జాగ్రత్తగా ప్రతి ఇంటికి మెడికల్‌ కిట్‌ అందజేసింది. అంతటితో ఆగకుండా ప్రతి ఇంటికి ఆర్థిక సాయం చేసింది.

జిల్లాలో 6,70,438 మందికి రూ.707.61కోట్లు మేర సచివాలయంలోనే వలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. అంతేకాకుండా విదేశాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లోనూ చిక్కుకున్న వారిని ప్రత్యేక బస్సులు, ట్రైన్‌లు, విమానాలు ఏర్పాటు చేసి స్వగ్రామాలకు క్షేమంగా తీసుకొచ్చింది. ముఖ్యంగా జిల్లాలోని వలస కూలీలు, వలస మత్స్యకారులను ప్రత్యేక జాగ్రత్తలతో తీసుకొచ్చి, ప్రత్యేక క్వారంటైన్‌ ఏర్పాటు చేసి, ఏ ఒక్కరికీ  ప్రాణాపాయం లేకుండా చర్యలు తీసుకుంది.

ఇవి చదవండి: ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement