ఏపీలో రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు అద్భుతం | Australia Agriculture Minister Mac Tiernan on AP farmer welfare | Sakshi
Sakshi News home page

ఏపీలో రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు అద్భుతం

Oct 11 2022 5:00 AM | Updated on Oct 11 2022 5:04 AM

Australia Agriculture Minister Mac Tiernan on AP farmer welfare - Sakshi

ఆస్ట్రేలియా మంత్రి అలన్నా మాక్‌ టైర్నన్‌తో భేటీ అయిన మంత్రి కాకాణి

సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న కార్యక్రమాలను వింటుంటే నిజంగా ఆశ్చర్యమేస్తోందని.. ఇక్కడి పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి అలన్నా మాక్‌ టైర్నన్‌ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తమ దేశం ఆసక్తిగా ఉందని చెప్పారు. ఆధునిక సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఏపీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు చేసేందుకు ఊతమిచ్చేలా ఆస్ట్రేలియాలోని మర్డోక్, వెస్ట్ర న్‌ ఆస్ట్రేలియా వర్సిటీలతో ఎన్జీ రంగా వర్సిటీ   సోమవా రం ఎంవోయూ కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి అలన్నా మాక్‌ టైర్నన్, పార్లమెంటరీ కార్యదర్శి సమంతారో సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ల్యాబ్‌ టూ ల్యాండ్‌ కాన్సెప్ట్‌ కింద ఆర్బీకేల ద్వారా పరిశోధనా ఫలితాలను నేరుగా రైతులకు అందిస్తున్నామని చెప్పారు.

సీఎం వైఎస్‌ జగన్‌  నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలకు అభినందనలు తెలిపిన ఆస్ట్రేలియా మంత్రి తప్పకుండా ఏపీతో కలిసి పనిచేస్తామన్నారు. ఎన్జీ రంగా వర్సిటీ వీసీ డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, మర్డోక్‌ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఆండ్రూ డీక్స్, డిప్యూటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పీటర్‌ డెవిస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఒప్పందంతో ప్రయోజనాలివే..
ఆస్ట్రేలియాలోని మర్డోక్, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా వర్సిటీలతో అవగాహన ఒప్పందం వల్ల ఎన్జీ రంగా వర్సిటీ విద్యార్థులు అక్కడకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించడంతోపాటు అక్కడ పరిశోధనలు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ యూనివర్సిటీలకు చెందిన వి ద్యార్థులు ఇక్కడ మన వర్సిటీలో పరిశోధనలు చేసుకునే అవకాశం ఉంటుంది. వర్సిటీ అధ్యాపక బృందం అక్కడకు వెళ్లి శిక్షణ పొందడంతోపాటు పరిశోధనా ఫలాలను పరస్పరం అందిపుచ్చుకోవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement