AP: గ్రూప్‌–2 మెయిన్స్‌లో ఇక రెండు పేపర్లే

APPSC Says Group-2 Mains-Has Only-Two Papers-With 300 Marks - Sakshi

స్క్రీనింగ్‌ టెస్టుగా జనరల్‌ స్టడీస్‌–మెంటల్‌ ఎబిలిటీ

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్‌–2 పోస్టులకు నిర్వహించే పరీక్ష విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటివరకు గ్రూప్‌–2 మెయిన్స్‌ను మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా వాటిని రెండుకు కుదించింది. ఈ మేరకు శుక్రవారం జీవో 6ను విడుదల చేసింది. పరీక్ష విధానం, సిలబస్‌పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ప్రభు­త్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ఆమో­దిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో గ్రూప్‌–2 స్క్రీనింగ్‌ టెస్టును 150 మార్కులకు నిర్వహించేవారు. మెయిన్స్‌లో పేపర్‌–1 జనరల్‌ స్టడీస్‌ ఉండేది. అలాగే మరో రెండు పేపర్లుండేవి. పేపర్‌కు 150 చొప్పున 450 మార్కులకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి నుంచి ఈ విధానంలో మార్పులు చేశారు. గతంలో మెయిన్స్‌లో పేపర్‌–1గా ఉన్న జనరల్‌ స్టడీస్‌ను రద్దు చేసి దాన్ని స్క్రీనింగ్‌ టెస్టుకు మార్చారు. దీన్ని గతంలో మాదిరిగానే 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇక మెయిన్స్‌ను రెండు పేపర్లకు తగ్గిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున 300 మార్కులు ఉంటాయి. ఈ క్రమంలో మెయిన్స్‌ సిలబస్‌ అంశాల్లోనూ మార్పులు చేశారు.

కొత్త విధానం ప్రకారం.. గ్రూప్‌–2 పరీక్ష, సిలబస్‌ మార్పులు ఇలా..
స్క్రీనింగ్‌ టెస్ట్‌: జనరల్‌ స్టడీస్‌  –మెంటల్‌ ఎబిలిటీ    150 మార్కులు 

మెయిన్‌ పరీక్షలు పేపర్‌–1: (150మార్కులు)
1. సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఏపీ సామాజిక చరిత్ర, సాంస్కృతోద్యమాలు)
2. జనరల్‌ ఓవర్‌ వ్యూ ఆఫ్‌ ద ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌

మెయిన్‌ పరీక్షలు పేపర్‌–2:  (150మార్కులు)
1. ఇండియన్‌ ఎకానమీ అండ్‌ ఏపీ ఎకానమీ
2. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top