
విజయవాడ: సంక్షేమం సంగతి అటుంచితే అప్పుల్లో మాత్రం ఏపీ ప్రభుత్వం దూసుకుపోతోంది. పాలనలో హామీల మాట పక్కన పెట్టిన ఏపీ సర్కార్.. అప్పులు చేయడంలో ‘రికార్డులను’ నెలకొల్పుతోంది. మంగళవారం వచ్చిందంటే చాలు.. అప్పులు చేస్తూ తనదైన ముద్రను కాపాడుకుంటోంది. తాజాగా మరో రూ. 3600 కోట్ల అప్పు తెచ్చింది చంద్రబాబు సర్కారు. తద్వారా అప్పుల్లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది.
కేవలం 13 నెలల్లోనే రూ. 1, 86, 112 కోట్లను అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం అప్పుల్లో చెత్త రికార్డును నమోదు చేసింది. ప్రత్యేకంగా కార్పొరేషన్లు, అమరావతి పేరుతో రూ. 62, 450 కోట్లు అప్పు చేసంది. ఈ క్రమంలోనే జూన్, జూలై నెలల్లో భారీగా అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం.
రాష్ట్ర ప్రభుత్వ సెక్యురిటీల వేలం ద్వారా అప్పులు సమీకరిస్తుంది చంద్రబాబు ప్రభుత్వం. బడ్జెట్ లోపలే కాకుండా బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేయడంలో చంద్రబాబు ఆరితేరారు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో అప్పులు చేస్తోంది.
ఇంత పెద్దమొత్తంలో అప్పులు తెస్తున్నా సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. సంపద సృష్టించడం దేవుడెరుగు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర హామీలను అమలు చేయకుండా అదనంగా ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారు. ఏడాది పాలనలో చంద్రబాబు సర్కారు చేసింది ఏమైనా ఉంది అంటే.. అది భారీగా అప్పులే అనే విషయం కళ్లకు కట్టినట్లు కనబడుతోంది.