
మళ్లీ మన టైమొచ్చిదాకా బరాయించాల..! మరింకేటి సేత్తాం!
జగనైతే ఎవరికీ ఏలోటూ లేకుండా అందరికీ అన్నీ ఏసేటోడు!
కరోనా టైమ్‌లో కూడా జగన్ ఏ పథకం ఆపలేదు
చంద్రబాబు వొచ్చాక ఇప్పుడేటీ రాలేదు..
అంతా మోసమే! ఎప్పుడో చేత్తానంటే ఎలా అవుతాది?
బాబు ఏడాది పాలనపై ఉత్తరాంధ్ర గుండె చప్పుడు ఇదీ!
జగనైతే ఎవరికీ ఏలోటూ లేకుండా అందరికీ అన్నీ ఏసేటోడు! బడ్డీ కొట్టు పెట్టుకున్నోళ్లకి డబ్బులిచ్చోడు.. ఒక్కడికీ లేదని పించలేదు. సంవత్సరానికి మాకు అన్ని పథకాలూ కలిపి డెబ్బై వేలదాకా వొచ్చేది. చంద్రబాబు వొచ్చాక ఇప్పుడేటీ రాలేదు. జనాలు నలిగిపోతాన్రు. చెప్పుకోకూడదు కానీ టీ సుక్కకి కూడా డబ్బులాడతం లేదు! – మంగలి సత్యం, నాయీ బ్రాహ్మణుడు, తామరాపల్లి, విజయనగరం జిల్లా
‘ఏటి సేసినారు..? రైతు భరోసా పెంచి ఇత్తామన్నారు.. అది అసలే నేదు..! చదువుకున్న కుర్రోళ్లకి డబ్బులేసేటోళ్లు..! వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి పథకాలన్నీ ఒచ్చియి.. అవి ఇప్పుడున్నాయేటి..? ఏయీ నేవు...! గుండికాయల మీద సెయ్యేసి తెలుసుకుంటే.. ఈడు సేసిందేముంది..? ఆడు సేసిందేముంది..? అని తెలుసుకుంతారు! ఒక తల్లికి పిల్లనేదు.. పిల్లకి తల్లీనేదు! ఎవరి చేతిలోనూ డబ్బుల్లేక నకనకనాడిపోతున్రు...! ఇప్పుడే పనీనేదు.. పేదాసాదా అంతా ఉసూరుమని ఏడుత్తాండ్రు! రెండొందలు మూడొందలు వొచ్చీ కరెంటు బిల్లు ఇప్పుడు డబలైపోనాది. కొట్టుమీద కిరాణా సామాన్లు పెరిగాయి.. నూని డబ్బా పెరిగింది.. ఇప్పుడింక బాగైనా బరాయించాల..! చెడ్డయినా బరాయించాల..! మళ్లీ మన టైమొచ్చీదాకా..! మరింకేటి సేత్తాం..!. – జట్టి మంగ, కండేపల్లి, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లా
నేను పక్కా టీడీపీ అయినా జగన్ పథకాలు టంచనుగా అందాయి ‘కరోనా టైమ్‌లో కూడా జగన్ ఏ పథకం ఆపలేదు. అయ్యన్నపాలెంలో ఒక కుటుంబానికి ఏటా రూ.లక్ష దాకా వచ్చేది. అప్పుడు జనాలకు సొమ్మాడటంతో కొత్త బట్టలని, ఇంట్లో ఏదైనా సామాన్లని కొనుక్కునేవారు. ఇప్పుడు వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. నేను పక్కా టీడీపీ. అయినా జగన్ పథకాలు మాకు టంచనుగా అందాయి..’ – సోమేశ్వరరావు, టైలర్ షాపు, అయ్యన్నపాలెం, నర్సీపట్నం
శివరామకృష్ణ మిర్తిపాటి – ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఏడాది పాలన గుండె చప్పుడు ఇది! నిజాలను భరించగలిగే శక్తి ఉంటే పేదల ఆక్రందన అర్థం అవుతుంది! గ్రామాల్లో పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఏరికోరి కష్టాల పాలయ్యామనే ఆక్రోశం ఎవరిని కదిలించినా కనిపిస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను నిలిపివేయడం.. సూపర్ సిక్స్ హామీలు అమలు కాకపోవడంతో పేదలు నలిగిపోతున్నారు. రైతులు పెట్టుబడి ఖర్చులకు డబ్బులు లేక.. ఉచిత పంటల బీమాకు దూరమై.. గిట్టుబాటు ధరలు లభించక అల్లాడుతున్నారు. పిల్లల చదువులు మళ్లీ గుదిబండలా మారుతున్నాయి. ఆర్థిక ఆసరా కోసం ఎదురు చూస్తున్న మహిళలు విసిగిపోతున్నారు. ఏడాది క్రితం దాకా కళకళలాడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో కకావికలమవుతోంది. ఏడాదికే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం బహుశా ఇదేనేమో!
ఏం ప్రభుత్వమండీ ఇది!
వాహనమిత్ర పథకం అందకపోవడంతో గ్రామాల్లో ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. రోజుకు ఐదారొందలు వస్తే పోలీసులు రూ.మూడు నాలుగొందలు కట్టాలని కేసు రాసేస్తున్నారని ఇక తాము ఎలా బతుకుతామంటూ విజయనగరం జిల్లా తామరాపల్లి జంక్షన్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు 8 వారాల నుంచి ఉపాధి హామీ కూలి డబ్బులు రాకపోవడంతో అప్పులు చేసి బతుకుతున్నామని విజయనగరం జిల్లా పెద్ద బోరబండ గ్రామానికి చెంది ఉపాధి హామీ కార్మి కులు చెబుతున్నారు. ఆఖరికి మూగజీవాల గోడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ‘గొర్రెలకు కూడా మందులిచ్చేటోడు జగన్! ఇప్పుడేవీ లేవు. మట్టి పనుల డబ్బులు 4 నెలలుగా పడలేదు.
రైతు భరోసా ఆగిపోయింది. ఎవరికీ ఏవీ లేక జనాలు మండిపోతున్నారు’ అని పురోహితినివలసకు చెందిన నీలబోణి లచ్చుము వాపోయాడు. ‘జగన్ ఉంటే ఏ పార్టీ అయినా కూడా అనుకున్న టైమ్‌కి అందరికీ అన్ని పథకాలూ వచ్చేవి. ఇప్పుడవన్నీ ఆగిపోయాయి. చంద్రబాబు హామీలు అమలు కావడం లేదు. పథకాలూ రాక, జనాల చేతిలో డబ్బులాడక మా వ్యాపారం సాగడం లేదు’ అని అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేటలో రోడ్డు పక్కన బెల్లం, కూరగాయలు అమ్మి జీవనం సాగిస్తున్న మాధవి నిర్వేదంగా చెప్పింది! ‘ఏం ప్రభుత్వమండీ ఇది! మాకు ఇంతకుముందు అన్ని పథకాలు వచ్చియి. మా మనవరాలికి అమ్మ ఒడి, మాయావిడికి రూ.18,500 వచ్చియి. ఇప్పుదేదీ లేదు’ అంటూ కోటవురట్లలో చిన్న కిళ్లీ బడ్డీ నడుపుకుంటున్న దాకారపు రవణ దిగాలుగా నిట్టూర్చాడు.
అభివృద్ధి.. అప్పుల్లోనే!!
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్, నాడు–నేడుతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టడంతో నిత్యం అభివృద్ధి పనులు జరిగేవి. జగనన్న కాలనీలలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను చేపట్టడంతో గ్రామాలలో ఉపాధి లభించేది. కోవిడ్‌లోనూ ఈ పనులు నిరాటంకంగా సాగడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు క్షీణించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం డీబీటీ ద్వారా రూ.2.73 లక్షల కోట్లకుపైగా నేరుగా ప్రజల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేసింది.
నవరత్నాల సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి మరీ అమలు చేశారు. సూపర్ సిక్స్ పేరుతో ఎడాపెడా హామీలిచ్చిన సీఎం చంద్రబాబు ఒక్క ఏడాదిలో దాదాపు రూ.1.70 లక్షల కోట్లు అప్పులు చేసి కూడా హామీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలమయ్యారు. కూటమి ప్రభుత్వంలో జీఎస్‌టీ ఆదాయం తగ్గిపోవడం ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందనేందుకు నిదర్శనం.
ఎప్పుడో చేత్తానంటే ఎలా అవుతాది?’
‘జగనున్నప్పుడు రైతు భరోసా ఏసీవోడు! చంద్రబాబు వచ్చిన కాడ నుంచి ఏవీ రావడం లేదు. ఏదో సొంత పొలం వదిలేయలేక తిండి గింజలు పండిస్తున్నాం. అదీనేకపోతే కూడు కోసుపోయి ఉండటమే! చోడవరం పందార ఫ్యాక్టరీకి చెరుకు తోలి ఐదు నెలలైంది ఇప్పటికొచ్చి రూపాయివ్వలేదు. మరి ఏటి తింటారు? మా ఆయన ఉపాధి హామీ మట్టి పనికెళ్లి రెండు నెలలైంది. ఒక్క రూపాయి పడలేదు. మార్చి నుంచి చేసినోళ్లకే లేదు. ఇంక మాకేం పడతాయి? చంద్రబాబుది అంతా మోసమే! ఎప్పుడో చేత్తానంటే ఎలా అవుతాది?’ అంటూ అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలం విజయరామరాజు పేటకు చెందిన అచ్చయ్య గోడు వెళ్లబోసుకుంది. 70 ఏళ్ల వయసులో రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు, మామిడి పళ్లు, కొబ్బరిబొండాలు అమ్ముతూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తోంది!
ఈ ప్రభుత్వంలో చాలా కష్టంగా ఉంది..!
‘పండిన పంటకు గిట్టుబాటు లేదు. ఒక రైతు భరోసా లేదు. క్రితం ఏడాది నువ్వులు క్వింటా రూ.12 వేలు ఉంది. ఇప్పుడు రూ.8 వేలే. కష్టం తప్ప ఏమీ ఉపయోగం లేదు. ఏ పథకాలూ లేవు. జగనున్నప్పుడు అమ్మ ఒడి అనో, 45 ఏళ్లు దాటిన ఆడోళ్లకి రూ.18,500 అనో ఏదో డబ్బులు పడేయి. ఇప్పుడు ఏవీ రావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో చాలా కష్టంగా ఉంది..!’ విజయనగరం జిల్లా తెర్లాంలో నువ్వులు నూరి్పడి చేస్తున్న రైతు దంపతులు శ్రీరాములు, లక్ష్మి ఆవేదన ఇదీ!!