AP Inter Result 2023 LIVE Updates Overall Pass Percentage Is 72 - Sakshi
Sakshi News home page

AP Inter Result 2023: బాలికలదే పైచేయి

Published Wed, Apr 26 2023 7:29 PM

AP Inter Result 2023 LIVE Updates Overall Pass Percentage - Sakshi

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఫస్టియర్‌లో 65 శాతం, సెకండియర్‌లో 75 శాతం ఉత్తీర్ణతతో ప్రభంజనం సృష్టించారు. ఇక బాలురు ఫస్టియర్‌లో 58 శాతం, సెకండియర్‌లో 68 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు ఇంటర్‌ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విజయ­వాడలో విడుదల చేశారు.

ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 8,13,033 మంది విద్యార్థులు హాజరుకాగా 5,38,327 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సర విద్యార్థులు 3,79,758 మంది పరీక్షలు రాయగా 72 శాతం (2,72,001) మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా మొదటి సంవత్సరం 4,33,275 మంది పరీక్షలకు హాజరవగా 61 శాతం (2,66,3266) మంది ఉత్తీర్ణులయ్యారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత పెరిగింది. 2022లో ఫస్టియర్‌లో 54 శాతం, సెకండియర్‌లో 61 శాతం ఉత్తీర్ణత నమోదైన సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఈ ఏడాది ఫస్టియర్‌లో ఏడు శాతం, సెకండియర్‌లో 11 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఈ నెల 1 నుంచి 18 వరకు పరీక్ష పత్రాల మూల్యాంకనం చేపట్టి కేవలం 8 రోజుల రికార్డు సమయంలోనే œలితాలను ప్రకటించడం విశేషం. కాగా, ఫలి­తాల కోసం https://examresults. ap.nic.in, www.bie.ap.gov.in చూడొచ్చు. 

ఫలితాల్లో ఉమ్మడి కృష్ణా టాప్‌
ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌ ఫలితాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. పశ్చిమ గోదావరి (ఫస్టియర్‌) రెండో స్థానం, గుంటూరు (ఫస్టియర్‌) మూడో స్థానంలో నిలిచాయి. ఇక ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో గుంటూరు రెండో స్థానం, పశ్చిమ గోదావరి మూడో స్థానం దక్కించుకున్నాయి.  

ఒకేషనల్‌లోనూ బాలికలదే పైచేయి.. 
ఇంటర్‌ ఒకేషనల్‌ విభాగంలోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలికలు ఫస్టియర్‌లో 58 శాతం, సెకండియర్‌లో 73 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక బాలురు ఫస్టి­యర్‌లో 37 శాతం, సెకండియర్‌లో 50 శాతం మంది ఉత్తీర్ణుల­య్యారు. కాగా ఒకేషనల్‌ విభాగంలో ఫస్టియర్‌ పరీక్షలకు 
36,031 మంది హాజ­రు­కాగా 17,507 మంది (49 శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌ పరీక్ష­లకు 31,293 మంది హాజరవగా 19,430 మంది (62 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ ఫలితాల్లో ప్రకాశం జిల్లా 72 శాతంతో ప్రథమస్థానంలో నిలవగా, కర్నూలు 
50 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది.

విద్యకు అధిక ప్రాధాన్యం: మంత్రి బొత్స
ఇంటర్‌ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా ఫలితాలను సైతం రికార్డు స్థాయిలో వెల్లడించడం పట్ల సంతోషంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలి­పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. అందుకే విద్యావ్య­వస్థలో అనేక సంస్కరణలు అమలు చేస్తు­న్నట్లు వెల్లడించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభు­త్వ బడులను బలోపేతం చేస్తున్నామ­న్నారు. దీంతో ప్రైవేటు పాఠశా­లల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యా­ర్థుల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు. విద్యపై పెట్టిన ప్రతి పైసా పెట్టుబడితో సమానమని తమ ప్రభు­త్వం నమ్ముతోందన్నారు. ఫలితాల వెల్లడి కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్, ఇంటర్‌ విద్య కార్యదర్శి ఎం.వి శేషగిరిబాబు, పాఠ­శాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్, సర్వశిక్ష ఎస్‌బీడీ శ్రీనివాస్, ఎండీఎం డైరక్టర్‌ నిధి మీనన్, పాఠ్యపుస్తకాల ముద్రణా సంస్థ డైరెక్టర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి, ఇంటర్‌ బోర్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

6 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం
ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్‌ బోర్డుకు తెలి­యజేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఏప్రిల్‌ 27 నుంచి మే 6 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 24 నుంచి జూన్‌ 1 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు త్వరలో విడుదల చేస్తుందని తెలిపారు. అదే విధంగా జూన్‌ 5 నుంచి జూన్‌ 9 వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 

Advertisement
Advertisement