
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల పోలీసులకు హైకోర్టులో మరోమారు చుక్కెదురైంది. కేసుకు సంబంధం లేని సెక్షన్లను ఎలా పెడతారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ బాలిక మిస్సింగ్ కేసులో ఆవేదనతో 7వ తేదీ రాత్రి వేంపల్లి వాసులు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. తోపులాటలో పోలీసు స్టేషన్ కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 200 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్టులు చేస్తున్నారు.
హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పోలీసులు.. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. దీంతో బాధితులు.. హైకోర్టును ఆశ్రయించారు. పులివెందుల పోలీసుల తీరుపై మండిపడిన హైకోర్టు.. స్టేషన్‌ను చుట్టుముడితే హత్యాయత్నం ఎలా అవుతుందంటూ ప్రశ్నించింది. వెంటనే ఆ సెక్షన్ తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దాడికి పాల్పడి ఉంటే సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి.. ఆ తర్వాత 41ఏ నోటీసులిచ్చి విచారించాలని హైకోర్టు తెలిపింది. నిన్నటి నుంచీ అరెస్టులు చేస్తున్న పోలీసులు.. ఇప్పటికీ దాదాపు 70 మందిని వరకూ అరెస్ట్ చేశారు.