పాతాళ గంగ.. వెల్లువెత్తంగ

AP groundwater levels have risen to record levels - Sakshi

5.55 మీటర్ల మేర పెరిగిన భూగర్భ జలమట్టం

ఈ నీటి సంవత్సరంలో 688.95 టీఎంసీల మేర పెరిగిన భూగర్భ జలాలు

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 169.66 టీఎంసీల పెరుగుదల

వైఎస్సార్‌ జిల్లాలో 157.21 టీఎంసీలు

అనంతపురం జిల్లాలోనూ 131.6 టీఎంసీలు పెరుగుదల

రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో భూగర్భ జలాలు పెరగడం ఇదే ప్రథమం

ఎండిన లక్షలాది బోరు బావులు రీచార్జ్‌

ఆనందంతో రబీ పంటలు సాగు చేసిన రైతులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాతాళ గంగ పైపైకి వస్తోంది. భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. గతేడాది ఇదే రోజున భూగర్భ జలమట్టం సగటున 13.34 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం 7.79 మీటర్లకు పెరిగింది. సగటున 5.55 మీటర్లు పెరిగినట్టు స్పష్టమవుతోంది. ఈ నీటి సంవత్సరం (గత ఏడాది జూన్‌ 1నుంచి ఈ ఏడాది మే 31వరకు)లో 688.95 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరిగాయి. రాష్ట్ర చరిత్రలో ఒక నీటి సంవత్సరంలో ఇంత భారీగా భూగర్భ జలాలు పెరగడం ఇదే ప్రథమం. సమృద్ధిగా వర్షాలు కురవడం, నదులు, వాగులు, వంకలు ఉరకలెత్తడం, ప్రభుత్వం వరద జలాలను ఒడిసిపట్టి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు వంటి చిన్న నీటి వనరులను నింపడం వల్లే ఇది సాధ్యమైందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నైరుతి, ఈశాన్య రుతు పవనాల ప్రభావం వల్ల రాష్ట్రంలో ఏడాదికి సగటున 965.97 మి.మీ. వర్షపాతం కురుస్తుంది. ఈ ఏడాది 1,100.23 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర మినహా.. రాష్ట్రంలోని పది జిల్లాల్లోనూ సాధారణం కంటే అధికంగా వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,485.02 మి.మీ. వర్షం కురవగా.. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 776.17 మి.మీ. వర్షం కురిసింది. వర్షాభావ ప్రాంతం (రెయిన్‌ షాడో ఏరియా)లోని అనంతపురం జిల్లాలో సాధారణ సగటు వర్షపాతం 554 మి.మీ.గా నమోదైంది. ఈ జిల్లాలోనూ సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షం నమోదైనట్టు స్పష్టమవుతోంది.

మొదటి స్థానంలో చిత్తూరు
చిత్తూరు జిల్లాలో ఏకంగా 13.65 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది. 169.66 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరగడంతో చిత్తూరు జిల్లా తొలి స్థానంలో నిలిచింది. వైఎస్సార్‌ జిల్లాలో 157.21 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరగడంతో ఆ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. వర్షాభావ ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఏకంగా 131.60 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరగడం గమనార్హం. సాధారణం కంటే తక్కువగా వర్షం కురవడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో భూగర్భ జలాలు 1.57 టీఎంసీలు, విజయనగరం జిల్లాలో 1.22 టీఎంసీల మేర తగ్గాయి. భూగర్భ జలమట్టం సగటు కోస్తాంధ్రలో 7.76 మీటర్లు ఉండగా.. రాయలసీమలో 7.77 మీటర్ల మేర ఉంది. ఈ ఏడాది  భూగర్భ జలమట్టం రికార్డు స్థాయిలో పెరగడంతో ఎండిపోయిన లక్షలాది బోరు బావులకు మళ్లీ జలకళ వచ్చింది. బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు వస్తుండటం వల్ల రైతులు ఆనందోత్సాహల మధ్య భారీ ఎత్తున రబీ పంటలు సాగు చేశారు. మంచి దిగుబడులు వస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top