ఏపీ: ఇక వీఆర్‌వోలు నేరుగా సీనియర్‌ అసిస్టెంట్లు

AP Govt Is Paving The Way For VROs Promotions - Sakshi

విద్యార్హత డిగ్రీతోపాటు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేయాలి

పదోన్నతులకు మార్గదర్శకాలు 

సాక్షి, అమరావతి: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వీఆర్‌వోల పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. గ్రేడ్‌–1 వీఆర్‌వోలకు నేరుగా సీనియర్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పించేందుకు విధివిధానాలను రూపొందించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీ చదివి, ఐదేళ్లు గ్రేడ్‌–1 వీఆర్‌వోగా సర్వీసు పూర్తి చేసినవారికి నేరుగా సీనియర్‌ అసిస్టెంట్‌ పదోన్నతికి అర్హత ఉంటుందని తెలిపారు. రెవెన్యూ శాఖలో పనిచేసే గ్రేడ్‌–1 వీఆర్‌వోలు, జూనియర్‌ అసిస్టెంట్లు/టైపిస్టుల మధ్య 60:40 నిష్పత్తిలో.. జిల్లా స్థాయిలో రొటేషన్‌ పద్ధతిలో పదోన్నతులు కల్పిస్తారు.

పదోన్నతి పొందిన వీఆర్‌వోలు.. మొదట సీనియర్‌ అసిస్టెంట్లుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్‌లో రెండేళ్లు పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా వారిని ఫీల్డ్‌ వర్క్‌కి పంపకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతి పొందాక అన్ని డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్వహించే కంప్యూటర్, ఆటోమేషన్‌ పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. ఇవన్నీ రెండేళ్లలోపు పూర్తి చేయకపోతే వారిని తిరిగి వీఆర్‌వోలుగా పంపుతామన్నారు. రెండేళ్లలో ఈ అర్హతలన్నీ సాధించినవారిని రెగ్యులరైజ్‌ చేయడంతోపాటు సీనియారిటీని కూడా నిర్ధారిస్తామని స్పష్టం చేశారు. ఇందుకనుగుణంగా 1998 ఏపీ మినిస్టీరియల్‌ సర్వీసు రూల్స్‌ని సాధారణ పరిపాలన శాఖ సవరిస్తుందన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top