ఏపీ: మొహర్రం వేడుకల్లో కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి 

AP Govt Guidelines On Covid Rules In Muharram Celebrations - Sakshi

మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: మొహర్రం వేడుకల్లో భక్తులు కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలను విడుదల చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు ఈ మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

సాధారణ సూచనలు: వ్యక్తులు బహిరంగ ప్రదేశాలలో కనీసం 6 అడుగుల (2 మీటర్లు) దూరం పాటించాలి. ఫేస్‌ మాస్క్‌లు తప్పనిసరిగా ఉపయోగించాలి. సబ్బు, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కు వద్ద చేతి రుమాలు, టిష్యూ పేపర్‌ వంటివి అడ్డుపెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయకూడదు. 

మార్గదర్శకాలు: మొహర్రం ప్రదర్శన, పీర్ల వద్ద ఎక్కువ మంది గుమికూడరాదు. భౌతిక దూరాన్ని పాటించాలి. సాధారణ ప్రజలు, భక్తులను ఎక్కువ మందిని అనుమతించకూడదు. అశూర్ఖానా (పీర్ల చావిడి) వద్ద తగినన్ని శానిటైజర్‌లు ఏర్పాటు చేసుకోవాలి. వృద్ధులు, పిల్లలతోపాటు దగ్గు, జలుబు, జ్వరం, మధుమేహం, అధిక బీపీ, గుండె జబ్బులు ఉన్నవారిని అనుమతించకూడదు.  ఊరేగింపుల్లో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాలి. సన్నాయి మేళం మినహా ఆర్కెస్ట్రా, సంగీత బృందాలు వంటివి ఏర్పాటు చేయకూడదు. తబరుక్, షర్బత్‌లను సీలు చేసిన ప్యాకెట్లలో మాత్రమే ఇవ్వాలి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top