
విజయవాడ పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కౌలు రైతుల సంఘం నాయకులు, రైతులు
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అన్నదాతల ఆగ్రహం
ధాన్యం విక్రయించిన రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్
విజయవాడలో పౌరసరఫరాల సంస్థ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన రైతులు
సాక్షి, అమరావతి: ధాన్యం డబ్బుల కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని ధాన్యం విక్రయించిన తాము నిండా అప్పుల్లో మునిగిపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. కడుపు మండి రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని దుయ్యబట్టారు. రూ.వెయ్యి కోట్ల ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలతో కలిసి అన్నదాతలు విజయవాడలోని పౌరసరఫరాల సంస్థ భవనం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సాగుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి అనేక ఖర్చులను సమన్వయం చేసుకోలేకపోతున్నామని వాపోయారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేకపోయామని, దీనివల్ల బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పొందడానికి అవకాశం లేకుండాపోయిందని మండిపడ్డారు. కౌలు చెల్లించకపోవడంతో భూ యజమానులు భూములను వెనక్కి తీసేసుకుంటున్నారని వాపోయారు. గత ఖరీఫ్‌లో అతివృష్టి, బుడమేరు వరదలతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని.. రబీ ధాన్యం బకాయిలను చెల్లించకపోవడంతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయామని రైతులంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు.
24 గంటల్లో ఇస్తామని.. రెండు నెలలైనా ఎందుకివ్వలేదు
ఏపీ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ.. రబీలో కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.వెయ్యి కోట్లు బకాయిలు పెట్టడం దారుణమన్నారు. 24 గంటల్లోనే డబ్బులు వేస్తామని చెప్పిన ప్రభుత్వం రెండు నెలలైనా చెల్లింపులు చేయకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించి రైతులను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్లిడి యలమందరావు మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కోలుకోలేని దెబ్బ తగులుతుంటే రైతులు ఎలా వ్యవసాయం చేస్తారని నిలదీశారు.
రైతు ప్రభుత్వమని చాటింపు వేసుకోవడం మినహా చేతల్లో మాత్రం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లా కౌలు రైతు సంఘం నాయకుడు బుడ్డి రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా మోసం చేస్తోందన్నారు. ఈవెంట్లు, యోగాలకు ఖర్చు చేసేందుకు రూ.లక్షల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం ధాన్యం అమ్మిన రైతులకు మాత్రం అన్యాయం చేస్తోందన్నారు. తక్షణమై రైతులకు బకాయిపడిన సొమ్ములను చెల్లించాలని కోరుతూ పౌరసరఫరాల కమిషనర్ సౌరబ్ గౌర్, పౌరసరఫరాల సంస్థ ఎండీ మనజీరు జిలానీకి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ కౌలు రైతుల సంఘం ఉపాధ్యక్షుడు పెయ్యల వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా శాఖ నాయకుడు నిమ్మగడ్డ వాసు, రైతు నేతలు గరిమెళ్ల కుటుంబరావు, పి.నాగరాజు, పెయ్యల భోగేశ్వరరావు, పి.మురళి పాల్గొన్నారు.
నిండా అప్పుల్లో మునిగిపోయాం!
ప్రభుత్వం చెప్పే మాటలకు.. చేసే దానికి పొంతన ఉండట్లేదు. ధాన్యం డబ్బులు చెల్లించకపోవడంతో కౌలు రైతులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌలుకు భూమిచ్చిన రైతులు మమ్మల్ని నమ్మట్లేదు. దాళ్వాలో 4 ఎకరాల్లో వరి సాగు చేశాను. అమ్మిన పంటకు రూ.3.50 లక్షలు రావాలి. కౌలు కట్టలేదని పొలం తీసేసుకున్నారు. పిల్లలకు స్కూలు ఫీజులు కూడా కట్టలేని దుస్థితి. మే 2, 3 తేదీల్లో పంట అమ్మితే ఇంత వరకు దిక్కులేదు. బుడమేరు వరదల్లో సార్వా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాళ్వాలో ఇప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో నిండా అప్పుల్లో ముగినిపోయాం. – కొండ శివాజి, కౌలు రైతు, కౌలూరు, జి.కొండూరు మండలం